ఆశ చూపించి వంచించడం చంద్రబాబు టెక్నిక్‌

రాజధాని ఆశ చూపి శటగోపం సినిమా చూపించాడు

ఐదేళ్లు బాబు చేసింది రియలెస్టేట్‌ వ్యాపారమే..

టీడీపీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడింది

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

తుళ్లూరు: మానవుడు ఆశా జీవి.. నేను ఎన్ని స్టోరీలు చెప్పినా ప్రజలు నమ్ముతారు.. ఆశ చూపించి మోసం చేయాలనే టెక్నిక్‌ను బాబు బాగా నమ్ముకున్నాడని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాజధానిలో విషయంలో ప్రజలకు శటగోపం సినిమా చూపించాడని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాల భూముల్ని చంద్రబాబు తన తాబేదారులతో కొనుగోలు చేయించాడన్నారు. రాజధాని పేరుతో టీడీపీ అందమైన కథలు చెప్పిందని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో భూములు కొనుగోలు చేసి చంద్రబాబు రియలెస్టేట్‌ వ్యాపారం చేశాడన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి కోసం రాష్ట్రమంతా బలికావాల్సి రావడం బాధాకరమన్నారు. అసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కున్నారని, బినామీ పేర్లతో టీడీపీ నేతలు వందల ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. 

తుళ్లూరులో ‘చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం’ పేరుతో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అందరం కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నాం. విభజన జరిగింది.. తరువాత ఎన్నికలు జరిగాయి.. టీడీపీ అధికారంలోకి వచ్చింది. విభజన తరువాత ఏపీ వ్యవసాయ మీద ఆధారపడిన రాష్ట్రం అయిపోయింది. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు హైదరాబాద్‌ 95 శాతం ఉన్నాయి. విద్యారంగం, కేంద్రానికి సంబంధించిన సంస్థలు హైదరాబాద్‌లో ఉండిపోయాయి. వ్యవసాయంసై ఆధారపడిన 13 జిల్లాల్లో ఎంతోమంది యువకులు పట్టభద్రులు అవుతుంటే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత, వీటితో పాటు చాలా ముఖ్యమైన అవసరం రాజధాని నగరం. 

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలలు అంటే డిసెంబర్‌ వరకు ఏయే పరిస్థితులు ఉన్నాయో ఇప్పటికీ అందరికీ గుర్తున్నాయి. మొదట రాజధాని గుంటూరు దగ్గర అన్నారు.. హైదరాబాద్‌ నుంచి వ్యాపార సంస్థలు అన్నీ వచ్చి గుంటూరు చుట్టూ రియలెస్టేట్‌ వాల్యూను పెంచాయి. ఆ తరువాత నూజివీడు అన్నారు. మళ్లీ సగం మంది అటు వెళ్లారు. దీంట్లో టీడీపీ ఉద్దేశం ఎవరికీ అర్థం కాలేదు. అమరావతిలో టీడీపీ నాయకులు భూములు కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఒక ప్లాన్డ్‌గా రాజధాని నగరం అని స్టోరీ సృష్టించి ఆ కథలో భాగంగా రియలెస్టేట్‌ వ్యాపారం చేసేందుకు టీడీపీ పూనుకుందనేందుకు అన్నిరకాల ఆధారాలు ఉన్నాయి. 

ఏ పరిస్థితుల్లో హైదరాబాద్‌ను విడిచి చంద్రబాబు అమరావతి పరిగెత్తుకొచ్చారో అందరికీ తెలుసు. బాధ్యతలను పక్కనబెట్టి.. పక్క రాష్ట్ర రాజకీయాల్లో చేతులు పెట్టి కాల్చుకొని రాత్రికి రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఉద్యోగుల భర్తలు ఇక్కడ.. భార్యలు అక్కడ.. భార్యలు అక్కడ భర్తలు ఇక్కడ.. పిల్లలను వదిలి చాలా ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు సొంత లాభం కోసం రాష్ట్రం అంతా బలికావాలంటే దారుణం. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ప్లాన్‌ చేసి భూసేకరణ చేశారంటే.. జూన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్ననాటి నుంచి డిసెంబర్‌ 30 వరకు ఈ ప్రాంతం కాబోయే రాజధాని అని ప్రకటించిన ఆరు నెలలలోపు కొన్ని వేల ఎకరాలు తీసుకున్నారు. దీన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనేందుకు అర్హత ఉంది. దీనిపై విచారణ జరుగుతుంది. 

Read Also: మద్యపాన నిషేధానికి బాబు వ్యతిరేకి

చంద్రబాబును చూసి మొట్టమొదట సింగపూర్‌ కంపెనీలు వచ్చి రాజధాని ప్లాన్‌ గీశాయంట. కోర్‌ క్యాపిటల్‌ అని చెప్పి 391 చదరపు కిలోమీటర్లు ఇచ్చారు. కానీ 2015 మార్చికి సింగపూర్‌ వారు ప్లాన్‌ ఇస్తే రూ.13 కోట్లు చెల్లించారు. తరువాత 2016 ఫిబ్రవరి నాటికి 391 చ.కి నుంచి 217కి తగ్గించారు. ఇంకోవైపు సీఆర్‌డీఏ ప్రాంతం 7 వేల నుంచి 8,300లకు పెంచారు. ఎందుకని చూస్తే 391 నుంచి 217కు ఎప్పుడైతే తగ్గించారో ఆ బ్యాలెన్స్‌ నూట చిల్లర చదరపు కిలోమీటర్ల లోపల మీకు కావాల్సిన వాళ్ల భూములన్నీ ఉన్నాయనమాట. 391లో వస్తే మీ ఎకరాకు గాను 1000గజాలు వస్తాయి అందాజాగా 217కు వస్తే మీ ఎకరాకు 1000 గజాలు చేతికి వస్తాయి. 391కి పోతే మీ రాజధానికి పక్కనే ఉంటారు. రాజధానికి సంబంధించిన అన్ని వసతులు ఉంటాయి. కానీ మీ ఎకరా మీకు ఉండిపోతుంది ఒక్క గజం కూడా పోకుండా ఇది వాళ్ల ప్లాన్‌. 

నవనగరాలు అని జోనింగ్‌ చేశారు.. ఇది హెల్త్‌ సిటీ.. ఇది టూరిజం సిటీ.. ఆ సిటీ.. ఈ సిటీ అని మీకు భూములు ఉన్నచోట్ల మీకు నచ్చినట్లుగా చేసుకున్నారు. ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మార్చుకున్నారు. ఈ ప్రాజెక్టుతో సింగపూర్‌తో ఎలాంటి సంబంధం లేదు. సింగపూర్‌కు సంబంధించిన రెండు వ్యాపార సంస్థలు అసెండాస్‌ సింగ్‌ బ్రిడ్జ్, సెంకార్ప్‌ ఈ రెండు సంస్థలకు కలిపి 50వేల ఎకరాల్లో అందాసుగా 1700 ఎకరాలు వాళ్ల చేతికి ఇవ్వడం జరిగింది. వాళ్లు చేయాల్సిన బాధ్యత ఏంటంటే.. అక్కడ ప్లాట్లు వేయడం, ఒక బిల్డింగ్‌ కట్టడం. దానిపేరు ఐకానిక్‌ బిల్డింగ్‌. ఎందుకింత కష్టపడి సింగపూర్‌ వాళ్లను పిల్చుకున్నాడని చూస్తే.. ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునేందుకు ఇదంతా మంచి ప్రాజెక్టు అని ఎండార్స్‌మెంట్‌ సీల్‌ కావాలి. ఇది ఆచరణకు వీలైయే ప్లానేనా? 

సహజంగా ఎవరైనా ఒక రాజధానిని కట్టాలనుకుంటే ఒక ప్రాంతం తీసుకుంటారు. అక్కడ 500 ఎకరాల్లో 1000 ఎకరాలో అక్కడ పరిపాలనకు సంబంధించిన భవనాలు అంటే రాజ్‌భవన్, సీఎం నివాసం, కార్యాలయం, సెక్రటేరియట్‌ బిల్డింగ్, గవర్నమెంట్‌ క్వార్టర్స్‌ ఇలాంటివి వస్తాయి. అయితే  2014 వీళ్లు శివరామకృష్ణణ్‌ కమిటీకి ఇచ్చిన నివేదిక మాకు కావాల్సింది 1500 ఎకరాలు మాత్రమే అని వీళ్లు రిపోర్ట్‌ ఇచ్చారు. శివరామకృష్ణణ్‌ కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ 10 జిల్లాలకు పైగా స్వయంగా తిరిగి ఒక రిపోర్ట్‌ ఇస్తే.. చంద్రబాబు దానిని కనీసం చర్చకు కూడా తీసుకురాలేదు. అసెంబ్లీలో కనీసం టేబుల్‌ చేయలేదు. అంటే అర్థమేమి..? రియలెస్టేట్‌ వ్యాపారం సెట్‌ చేసుకునేందుకు ఇవన్నీమొత్తం క్రియేట్‌ చేశారు. 

రాజధాని నిర్మాణానికి వాస్తవానికి 1500 ఎకరాలు కావాలి. ప్రభుత్వం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. కావాల్సిన భూమిని తీసుకున్న తర్వాత ఒక మాస్టర్‌ ప్లాన్‌ ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్‌ ప్రకారం రైతులు వాళ్లకు నచ్చిన విధంగా డెవలప్‌ చేసుకుంటారు. అలా కాదని ప్రభుత్వం రైతుల భూములు తీసుకుని వ్యాపారం చేశారు. ఎకరాకు గాను ఇదో మీకు ఇంతా ఇస్తాం అని దళితుల భూములు లాక్కున్నారు. ఎంత అన్యాయంగా లాక్కున్నారో మనందరం చూశాం. 

జూన్‌ 2014 నుంచి డిసెంబర్‌ 30 లోపల ఇది రాజధాని రాబోతోందని తెలిసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కింద ప్రజలకు తెలియక ముందే ముఖ్యమైన వాళ్లు పొలాలు తీసుకున్నారు. 1) చంద్రబాబు నాయుడు హెరిటేజ్‌ కోసం 14 ఎకరాలు తీసుకున్నారు. పరిటాల సునీత, జీవీఎస్‌ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, లింగమనేని రమేష్, ధూళిపాల నరేంద్ర, పుట్టా మహేష్‌ యాదవ్‌ (యనమల వియ్యంకుడు), కంభంపాటి రామోహన్‌ రావు వీళ్లతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. గుంటూరు, నూజివీడు అని ప్రజలను తప్పుదోవ పట్టించి వీళ్లు ఇక్కడ పొలాలు కొన్నారు.

బినామీ పేర్లమీద కూడా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు. వాళ్ల దగ్గర పనిచేసే డ్రైవర్లు, అకౌంటెంట్ల పేర్ల మీద కొన్నారు.  వారిలో కొంతమంది ముఖ్యులు... నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, కొమ్మల్లపాటి శ్రీధర్, వేమూరి రవికుమార్‌ (నారా లోకేష్‌ కు అసోసియేట్‌), మురళీమోహన్‌ వీళ్లకు సంబంధించిన దగ్గరి వ్యక్తులు కొన్నారు. ఇది చిన్న లిస్ట్‌ మాత్రమే. అమాయక రైతులను మభ్యపెట్టి వాళ్ల పొలాలు కొనుక్కుని మోసం చేశారు. 

మరీ ముఖ్యంగా అసైన్‌మెంట్‌ భూములు ఒక్క ఉదాహరణకు కురగల్లు, యర్రుపాలెం, నవులూరు ఈ ప్రాంతంలోని అసైన్డ్‌ భూములను దళితుల భూములను అమ్మండి అని భయపెట్టారు. మీకు ఉన్నా రిజిస్ట్రేషన్‌ కాదన్నారు. భూములను రిజిస్ట్రేషన్‌ చేయకుండా రెండున్నర మూడేళ్ల పాటు ఇలా చేశారు. దీంతో దళితులు భయపడి ఆ భూములను అమ్ముకున్నాక... ఆ భూములను టీడీపీ వాళ్లు కొనుకున్నాక ప్లాన్‌గా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చారు. దీంతో టీడీపీ వాళ్లకు 1000 గజాల ప్లాట్, మళ్లీ 250 గజాల కమర్షియల్‌ ప్లాట్‌. ఎంత ప్లాన్‌గా చేసుకున్నారో చూడండి. ఎస్సీ, ఎస్టీ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా వాళ్లు డబ్బులు సంపాదించుకునేందుకు ప్లాన్‌ చేస్తారు. 

ఎవరికైతే సీఆర్‌డీఏ దాదాపు 900 మందికి ప్లాట్లు ఇచ్చారో వారిలో మెజార్టీ భాగం ఎవరంటే దళితుల అసైన్డ్‌ భూములు కొన్నావారే అని తేలింది. అసైన్డ్‌ భూములతో ఆగకుండా తర్వాత లంక భూముల జోలికి వెళ్లారు. అక్కడ కూడా ఇలాగే చేసుకుంటూ పోయారు. ఆ తర్వాత లేని లంక భూములు, మునిగిపోయిన లంకభూములు అవి అది మాని రికార్డు సృష్టించేది ప్లాట్లు తీసుకునేది. ఇది కాకుండా 500 ఎకరాలకు పైగా అభ్యంతకరమైన భూములను సృష్టించేది ప్లాట్లు తీసుకునేది. 289 ఎకరాలు ఒకటి, 286 ఎకరాలు ఒకటి, 90 ఎకరాలు ఒకటి. ఎకరా కోట్ల చొప్పున వేల కోట్లు వ్యాపారం చేశారు. 

రాజధాని నిర్మాణానికి 1,10,000 వేల కోట్లతో ప్లాన్‌ చేశారు. ఇందులో రెండు భాగాలు చేశారు. 50 వేల ఎకరాలు ఒక భాగం, 50వేల ఎకరాలు ఒక భాగం అనుకోండి..  ఇలా చేసి 50 వేల కోట్లకు టెండర్లు పిలుస్తారు ఎన్నికలకు కొన్ని నెలల ముందర. దీనిపై వరల్డ్‌ బ్యాంక్‌ అభ్యంతరం తెలిపింది. ఇది తప్పుగా ఉందని టెండర్ల విధానమని. 50వేల కోట్లకు టెండర్లు పిలిచి వాళ్లు ఖర్చుపెట్టింది కేవలం 5 వేల కోట్లు మాత్రమే. అది కూడా అప్పు చేసి రూ.2వేల కోట్లు అమరావతి బాండ్లు, (అప్పును కూడా పండుగలా చేశారు.. పసుపు చల్లుకుని, పూలు చల్లుకుని.. ఎవడైనా ఏడుస్తూ చేస్తారు. కానీ చంద్రబాబు సంబరాలు చేస్తూ అప్పులు చేశారు.) 2వేల కోట్లు కెనరా బ్యాంక్‌ కన్షార్షియం, అయితే రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసింది ఎంతంటే రూ.277 కోట్లు మాత్రమే. ఇది మన డబ్బులు. లక్షల కోట్ల ప్లాన్‌.. 5వేల కోట్ల అప్పు సుందరమైన నగరం కడుతుంటే అందరూ అడ్డు వస్తున్నారట. ఏదైతే వీలవుతుందో ఆ పనిచేయాలి కానీ.. గ్రాఫిక్స్‌ చూపించుకుంటూ ఆశ చూపించారు. మానవుడు ఆశ జీవి నేను ఎన్ని కథలు చెప్పినా ప్రజలు నమ్ముతారని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే రైతులు, దళితులు, వ్యవసాయ కూలీలను మోసం చేశారు. 

ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు ఉన్న పరిస్థితి.  ఎప్పుడూ లేని విధంగా 40వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారు.  ఒక ప్రభుత్వం నుంచి మరొక ప్రభుత్వం మారేటప్పుడు రూ.5వేల కోట్లు బకాయిలు ఉంటాయి. టీడీపీ మాత్రం 40వేల కోట్లు బకాయిలు పెడుతూ ఇంకో రూ.20వేల కోట్ల బకాయిలు కరెంటు కంపెనీలవి.. సివిల్‌ సప్లైవి ఎప్పుడూ కనీవినీ ఎరుగని పరిస్థితుల్లో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట తప్పకుండా చేస్తున్నారు. ఎవరైతే పేదవారు ఉన్నారో.. ప్రభుత్వం ఆసరాతో ఉన్నారో ఫస్ట్‌ వాళ్ల్లకు చేస్తున్నారు. రైతు భరోసాకానీ, అమ్మఒడి కానీ ఏదైనా కానీ బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటున్నారు. అది ఓర్చలేక మీ మతమేమి.. మీ కులమేమి అని అంటున్నారు. వీరి ప్రశ్నలకు మన ముఖ్యమంత్రి సమాధానం.. నా మతం మానవత్వం, కులం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అని చెప్పారు. క్రమక్రమంగా సాధ్యమైన విధంగా ఆమోదయోగ్యమైన రిజల్టు వస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. 
 

Read Also: మద్యపాన నిషేధానికి బాబు వ్యతిరేకి

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top