పల్నాడులో ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్‌ కోసం పోటెత్తిన జనం

వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఎస్వీ స‌తీష్‌రెడ్డి 

జనం నుంచి వచ్చిన నేతను అణిచేయాలనుకోవడం అవివేకం

వైయస్ జగన్‌ ప్రజాభిమానం ముందు చంద్రబాబు ఎందుకూ పనికిరారు

పల్నాడులో ప్రజల ఆగ్రహం ముందు కూటమి కుట్రలు పటాపంచలు

కూటమి ఏడాది దుష్ట పాలనకు ఇవి హెచ్చరికలు

వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి స్పష్టీకరణ

తాడేప‌ల్లి: పల్నాడులో మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పర్యటనకు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని ఆటంకాలు కల్పించినా, ప్రజలు వాటిని అధిగమించి ప్రభంజనంలా జగన్ వెంట నిలిచారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులను ఉపయోగించి అనుమతులను నిరాకరించడం, జనం రాకుండా బారికెట్లను అడ్డుపెట్టి దౌర్జన్యం చేయించినా సరే జగన్ కోసం జనం పోటెత్తారని అన్నారు. కూటమి ఏడాది దుష్ట పాలనకు ఇవి ప్రజల నుంచి వస్తున్న హెచ్చరికలని గుర్తుచేశారు. జనం నుంచి వచ్చిన నాయకుడిని అధికారంతో అణిచివేయాలనుకోవడం చంద్రబాబు అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

వైయస్ఆర్‌సీపీ నాయ‌కులు దివంగత నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు కుటుంబాన్ని పరామర్శించడం, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పల్నాడుజిల్లా రెంటపాళ్ల గ్రామానికి వెళ్ళిన వైయస జగన్ పట్ల కూటమి ప్రభుత్వం ఆదినుంచి కుట్రపూరితంగానే వ్యవహరించింది. అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించడం, వాహనాల సంఖ్యపై ఆంక్షలు, శాంతిభద్రతల సమస్య అంటూ కట్టుకథలతో మొత్తం పర్యటననే అడ్డుకోవాలని చూశారు. వైయస్ జగన్ పల్నాడుకు బయలుదేరిన క్షణం నుంచి జనం ఆయన వద్దకు రాకుండా ఉండేందుకు అడుగడుగునా బారికేట్లతో పోలీసులే పహాకారాశారు. ఎంతగా జనంను దూరం చేయాలని చూసినా, ప్రజాభిమానం ముందు కూటమి ప్రభుత్వ కుట్రలు పటాపంచలు అయ్యాయి. పెద్దసంఖ్యలో ప్రజలు జగన్ కోసం తరలివచ్చారు. తాడేపల్లి నుంచి రెంటపాళ్లకు చేరుకునేందుకు 9 గంటల సమయం పట్టిందంటే ఎంతగా జనప్రవాహం వైయస్ జగన్ వెంట పయనించిందో అర్థం చేసుకోవచ్చు. దీనిని చూసిన కూటమి నేతల గుండెలు బద్దలయ్యాయి. 

చంద్రబాబు చరిత్రలో దృతరాష్ట్రుడులా మిగిలిపోతాడు
 
సీఎంగా చంద్రబాబు ఏడాది పాలనలో రోజురోజుకు దిగ‌జారిపోతున్నారు. ధుర్యోధ‌నుడి కబంధ హ‌స్తాల్లో చిక్కుకుని ధృత‌రాష్ట్రుడు ఎలాగైతే కౌర‌వ ‌సామ్రాజ్య ‌ప‌తనానికి కార‌ణ‌మ‌య్యాడో, అలాగే లోకేష్ ప‌ద‌వీ కాంక్ష వ‌ల్ల చంద్ర‌బాబు రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీని  స‌ర్వ‌నాశ‌నం చేసే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. మ‌హానాడు పేరుతో క‌డ‌పలో స‌భ నిర్వ‌హించి వేల వాహ‌నాల్లో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను తర‌లించడానికి లేని ఆంక్ష‌లు మా నాయ‌కుడు వైయస్ జగన్ పర్యటనకు ఎలా విధిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొడుకు మీద ఉన్న ప్రేమను కాసేపు ప‌క్క‌న పెట్టి ఇక‌నైనా చంద్ర‌బాబు క‌ళ్లు తెర‌వాలి. ఇప్పటికే ఏడాది పాల‌న‌తోనే ప్ర‌జ‌ల దృష్టిలో చంద్ర‌బాబు మోస‌గాడిగా మిగిలిపోయారు. త‌ల‌కిందులుగా త‌ప‌స్సు చేసినా ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన ఈ వ్య‌తిరేక‌త‌ను చ‌ల్లార్చ‌లేరు. తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావ‌డం అనేది క‌ల‌. చివ‌రి రోజుల్లో మంచి ప‌నులు చేసి ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా పాల‌న చేయాలని హితువు చెబుతున్నాం. 

నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు తండ్రి స‌వాల్‌ని స్వీక‌రించే ద‌మ్ముందా? 
 
కూటమి ప్రభుత్వ వేధింపుల వల్ల నాగమల్లేశ్వరావు చ‌నిపోతే ఆయ‌న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డానికి వైయ‌స్ జ‌గ‌న్ వెళ్తుంటే బెట్టింగ్‌కి బానిసై ఆత్మ‌హత్య చేసుకున్నాడ‌ని టీడీపీ నాయ‌కులు త‌ప్పుగా మాట్లాడుతున్నారు. నా బిడ్డ బెట్టింగ్ వ‌ల్ల చ‌నిపోయాడ‌ని నిరూపిస్తే ఏ శిక్ష కైనా సిద్ధ‌మ‌ని నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు తండ్రి స‌వాల్ విసిరాడు. దానికి స‌మాధానం చెప్పే ద‌మ్మున్న టీడీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు రావాలి. అవ‌ల‌క్ష‌ణాల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ప్ర‌చారం చేసే టీడీపీ నాయ‌కులు స‌త్తెన‌ప‌ల్లి వెళ్లి నిరూపించ‌గ‌ల‌రా? వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌కు రావ‌డాన్ని చూసి ఓర్చుకోలేక, ఆయ‌న‌కొస్తున్న ప్ర‌జాభిమానాన్ని చూసి త‌ట్టుకోలేక చ‌నిపోయిన వ్య‌క్తికి అవ‌ల‌క్ష‌ణాలు ఆపాదించ‌డం సమంజ‌స‌మేనా అనేది టీడీపీ నాయ‌కులు ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి. చేతిలో మీడియా ఉంది క‌దా అని విష‌ప్ర‌చారం చేస్తున్నారు. 

వైయ‌స్ జ‌గ‌న్‌ను పై నోరపారేసుకుంటే ఖబడ్దార్ 
 
వైయ‌స్ జ‌గ‌న్‌ని సైకో గాడు అని చంద్ర‌బాబు స‌హా టీడీపీ నాయ‌కులు మాట్లాడుతున్నారు. మరోసారి అలా మాట్లాడితే వారికి అదే స్థాయిలో జవాబు చెప్పడానికి సిద్దంగా ఉన్నాం.  ఎంతోమందికి అభిమానించే వ్య‌క్తిపై నోరుపారేసుకుంటే, ఖబడ్ధార్. అధికారం చేతిలో ఉంద‌ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఏం చేసినా చెల్లుబాట‌వుతుంద‌ని అనుకుంటున్నారు. చంద్ర‌బాబూ.. నీ నాలుకని కంట్రోల్ లో పెట్టుకోకుండా ఇష్టానుసారం మాట్లాడితే స‌హించేది లేదు. నువ్వు ఏ ర‌కంగా మాట్లాడితే అంత‌కు ప‌దింత‌లు మాట్లాడ‌టానికి మేం వెనుకాడేది లేదు. నీ ద‌గ్గ‌ర ప‌ది మంది ఉంటే, మా ద‌గ్గ‌ర వంద మంది ఉన్నారు. రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న వ్య‌క్తి గురించి మాట్లాడే ముందు ప‌దిసార్లు ఆలోచించుకో. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో అప్పు చెల్లించ‌లేద‌ని మ‌హిళ‌ను చెట్టుకు క‌ట్టేసి కొట్టే ధైర్యం ఎవ‌రిచ్చారు? ఏం త‌ప్పు చేసినా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమీ కాద‌నే ధైర్యంతోనే ఇలాంటి దారుణాలు జ‌రుగుతున్నాయి. అభంశుభం ఎరుగ‌ని వారిని అక్ర‌మ కేసుల‌తో జైలుపాలు చేస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌కి విశ్వాస‌పాత్రులుగా ఉన్నార‌నే కార‌ణంతో రిటైర్డ్ ఐఏఎస్‌లు ధ‌నుంజ‌య్‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డిల‌ను అక్ర‌మంగా జైళ్ల‌కు పంపారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపైనా తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారు. గతంలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు తన పార్టీ వారికి ఎంతెంత డబ్బు పంపారో మరిచిపోయారా?

Back to Top