టీడీపీ నేతలవి మతి లేని గతి తప్పిన మాటలు

ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

సీఎఫ్‌ఎంఎస్‌లో స్పెషల్‌ బిల్లులంటూ ఏమీ ఉండవు.

సీఎఫ్ఎంఎస్ స్పెషల్ బిల్స్ అనే హెడ్ లేదని ఏజి కి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది.

వేస్‌ అండ్‌ మీన్స్‌ అనేది తాత్కాలిక అప్పు మాత్రమే.

ఈ తాత్కాలిక అప్పును అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లించడం జరిగింది.

2020–21లో సుమారు రూ 30 వేల కోట్లు ఆదాయం తగ్గింది.

అయినా కరోనాలో పేదవారిని ఆదుకోవడంలో వెనక్కి తగ్గలేదు.

వీరు గోబెల్స్‌ను మించి పోయారు.

ఆర్థిక మంత్రిగా పని చేసిన వ్యక్తి చేసే ఆరోపణలేనా ఇవి?

  అమ‌రావ‌తి:  రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి రూ.48వేల కోట్లు వెళ్లాయంటూ యనమల చేసిన ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నాం,  టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి మండిప‌డ్డారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం. అన్నీ అవాస్తవాలని బుగ్గ‌న తీవ్రంగా ఖండించారు. యనమల చేసిన ఆరోపణలు రాజకీయ అక్కసుతో కూడుకున్నవి. వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వంపై బురదజల్లే దురుద్దేశంతోనే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారు. గత ఐదేళ్లు ఆర్థిక మంత్రిగా తెలుగుదేశం హయాంలో పని చేసిన రామకృష్ణుడు అవగాహనతోనే మాట్లాడుతున్నారా? లేక వాస్తవాలు తెలిసినా ప్రజలకు ఉద్దేశపూర్వకంగా అబద్దాలు చెబుతున్నారా? అనేది ఆయన తనను తానే ప్రశ్నించుకోవాలి. అబద్ధాలు చెప్పడంలో టీడీపీ నేతలు  గోబెల్స్‌ను మించిపోయారు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు భ్రమలు కల్పించి రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. 

శనివారం యనమల రామకృష్ణుడు గారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చేసిన ఆరోపణలు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. ఆయన చేసిన ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదు. ఆయన చేసిన పలు ఆరోపణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.  రాజకీయాల్లో వాస్తవాలు మాట్లాడాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు.. 

కరోనా మహమ్మారితో అందరూ ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలు తల్లకిందులయ్యాయి. బడ్జెట్‌ లెక్కలు తారుమారయ్యాయి. ఆదాయం గణనీయంగా పడిపోయింది. పేదలు మరింత పేదరికంలోకి జారిపోయే పరిస్థితి ఏర్పడింది. 

ఈ పరిస్థితి నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ.. పేదల జీవన ప్రమాణాలు పడిపోకుండా చూసుకున్నాం. వారికి వీలైనంత మేలు చేసేందుకు ఎక్కడా అవినీతి లేకుండా నగదు సాయం చేశాం. కరోనాతో ఇతర రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులకు గురైనా.. రాష్ట్రంలోని పేదలకు లోటు లేకుండా చూసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు చేసిన మేళ్లను దాచి రాజకీయం కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే యనమల పసలేని ఆరోపణలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి రూ.48వేల కోట్లు వెళ్లాయంటూ యనమల చేసిన ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నాం. యనమల చెబుతున్న రూ.48వేల కోట్లు వాస్తవిక వ్యయం కాదు.  ఆ మొత్తం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జరిగిన ‘బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్‌’ అనే విషయం గ్రహించాలి. 

సీఎఫ్‌ఎంఎస్‌లో స్పెషల్‌ బిల్లులంటూ ఏమీ ఉండవు. చంద్రబాబునాయుడు హయాంలో అస్తవ్యస్తంగా, తప్పుల తడకగా రూపొందించిన సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ ఈ గందరగోళానికంతటకూ కారణమైంది. ఈ వ్యవస్థలో బిల్లుల చెల్లింపులకు బీఎల్‌ఎం మాడ్యూల్‌ను పొందు పర్చారు. ట్రెజరీ కోడ్‌ ప్రకారమే ఈ బిల్లుల చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేశారు. 

 ఇందులో వివిధ శాఖలకు సంబంధించిన బిల్లు చెల్లింపుల హెడ్స్‌ ఉన్నాయి. అసలు ఈ వ్యవస్థలో స్పెషల్‌ బిల్లుల హెడ్‌ లేనే లేదు. సీఎఫ్‌ఎంఎస్‌ రిపోర్టింగ్‌ విధానంలో ‘బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్స్‌’ను గుర్తించడం కోసం స్పెషల్‌ బిల్లులు అనే పేరును పెట్టడం జరిగింది. అంతే తప్ప స్పెషల్‌ బిల్లుల హెడ్‌ అనేది లేనే లేదు.  
   
సీఎఫ్‌ఎంఎస్‌ క్రమపద్ధతిలో వ్యవస్థీకృతం చేయలేదు. అందుకే బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లు స్పెషల్‌ బిల్లుల కింద చూపారు. ట్రెజరీ అధికారులకు సీఎఫ్‌ఎంస్‌లో బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్స్‌ చేసే వెసులుబాటు ప్రస్తుతం లేనందు వల్ల ఈ అధికారాన్ని సీఎఫ్‌ఎంస్‌ సీఈఓకు ఆర్థిక శాఖ అధికారులు దత్తం చేశారు. ఈ ప్రక్రియ మొత్తం ఆర్థిక శాఖ, ట్రెజరీ నిబంధనల మేరకే జరిగింది. 

ఇదే విషయాన్ని కాగ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. ఆర్థిక శాఖ కార్యదర్శి ఇందుకు సంబంధించి కాగ్‌కు వివరంగా లేఖ రాశారు. ఆర్థిక సంవత్సరం చివరిలో ఇలాంటి బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్‌ అనేది సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ ఏర్పడక ముందు ట్రెజరీ అధికారులే మ్యాన్యువల్‌గా చేసేవారు. ఈ వ్యవస్థ ఏర్పడిన తరువాత స్వయంగా సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవోకు ఈ అధికారం కట్టబెట్టారు. ఆ ప్రకారమే సీఈవో చేశారు. ఈ విషయంపై కూడా లిఖిత పూర్వకంగా తానే అధికారం కట్టబెట్టానని ఆర్థిక శాఖ కార్యదర్శి కాగ్‌కు తెలిపారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదు. నగదు లావాదేవీలు లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది? ‘పైగా బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్స్‌ అనేవి పద్దుల నిర్వాహణలో భాగంగా ట్రెజరీ కోడ్‌లను అనుసరించి జరిగేదే’ ఇంత చిన్న విషయం మాజీ ఆర్థిక మంత్రి అయిన యనమలకు తెలీదా? ఇవన్నీ ఆయనకు తెలుసు. గత ప్రభుత్వంలో ఆయన స్వీయ పర్యవేక్షణలోనే ఇలాంటివి అనేకం జరిగాయి. . కానీ ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే అబద్దాలు చెబుతున్నారు. 

ఏపీ ఫైనాన్స్‌ కోడ్‌ 271 (4) ఆర్టికల్‌ ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో ఆయా పీడీ అకౌంట్లలో ఖర్చు కాకుండా మిగిలిన నిధులను ఈ బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్‌ ద్వారా ట్రెజరీ అధికారులు నిధులను పూర్తిగా మురిగిపోయేటట్లు చేస్తారు.

ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో ఇది ఎప్పుడూ సాధారణంగా జరిగే సహజ ప్రక్రియ. ప్రస్తుతం ఉన్న సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ ప్రకారం ట్రెజరీ అధికారులకు నిధులను మురిగిపోయేలా చేసే అవకాశం లేదు కనుక బుక్‌అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్స్‌ను సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవోకు అధీకృతం చేశారు. దీనివల్ల నిధులను కేంద్రీకృతంగా మురిగిపోయేలా చేసే అధికారం సీఈవోకు వచ్చింది.

ఈ విధానం కొత్తగా మేము ప్రవేశపెట్టింది కాదు. 2018లోనే ఇలా వివిధ శాఖల్లో ఖర్చుకాకుండా మిగిలిన నిధులను మురిగిపోయేలా చేసే అధికారాన్ని సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవోకు ఇచ్చారు. 2018 – 19, 2019 – 20 ఆర్థిక సంవత్సరాల్లో కూడా ఇదే పద్ధతిని ప్రభుత్వం అనుసరించింది. 

గత తెలుగుదేశం ప్రభుత్వం 2018 – 19 ఆర్థిక సంవత్సరంలో ఇదే విధంగా 98,049 బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లను స్పెషల్‌ బిల్లులుగా చూపారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2020 –21 ఆర్థిక సంవత్సరంలో 54,183 బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లను మాత్రమే స్పెషల్‌ బిల్లులుగా చూపింది. ఈ తరహా బిల్లుల్లో నగదు లావాదేవీలు ఉండవు.

ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన జీఎస్టీ చెల్లింపులు మాత్రమే నగదు రూపంలో జరిగాయి. ఈ విధంగా రూ 224 కోట్లు జీఎస్టీని నగదు రూపంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించాం. అదే విధముగా టీడీపీ ప్రభుత్వంలో 2018-19  సంవత్సరంలో జిఎస్టి చెల్లింపులు కూడా నగదు రూపంలో జరిగాయి. అలాంటప్పుడు ఇందులో ఇక నిధుల దుర్వినియోగం ఎక్కడిది? ఈ రూ.48వేల కోట్ల వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టంగా చెబుతున్నాం. 

ఇలాంటి కేంద్రీకృత ప్రక్రియపై అకౌంటెంట్‌ జనరల్‌ సందేహాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవోకు బుక్ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్స్‌ను చేసే అధికారాన్ని ఇస్తూ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది.  

    ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఐటీని వినియోగించడంపై ఎలాంటి అనుమానాలు లేవు. కానీ సీఎఫ్‌ఎంస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఒక ప్రణాళికా బద్ధంగా చేయకుండా అసంపూర్తిగా గత ప్రభుత్వం వదలి వేసింది. ఆ లోపాలను  మేము ఇపుడిపుడే సవరించుకుంటూ వస్తున్నాం. తద్వారా సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి మేం కృషి చేస్తున్నాం. 

రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఏడాది మొత్తం బడ్జెట్‌లో రూ.48వేల కోట్లు దుర్వినియోగం/ అవినీతి చే యగలమా! రాష్ట్రంలో దేశంలో క్రియాశీలత గల రాజకీయ పార్టీలు, వ్యవస్థలు,  మేధావులు, మీడియా ఉండగా ఇంత భారీ మొత్తంలో అవినీతికి పాల్పడడం   సాధ్యం కాదని చంద్రబాబునాయుడుకు బాగా తెలుసు. కానీ మాకు అవినీతిని అంటగట్టడానికి ఆయన తన పార్టీ నేతలతో ఇలాంటి అర్థః లేని ఆరోపణలు చేయిస్తున్నారు.   
యనమల మాటల తీరు చూస్తుంటే, ఆయన వయసుకు అనుభవానికి తగువున  అనే అనుమానం కలుగుతోంది.  

ప్రతి ఆర్థిక సంవత్సరంలో జరిగే లావాదేవీలు, రాబడి, వ్యయం అన్నీంటికీ పక్కాగా వివరాలు పారదర్శకంగా ఉంటాయి.  2020 – 21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఖర్చు రూ.2,03,448 కోట్లు (స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యయం కలిపి). ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్ల చెల్లింపులకు రూ.66,470 కోట్లు, అప్పు– వడ్డీ చెల్లింపులు రూ.33,753 కోట్లు,  నగదు బదిలీ పథకాలు, ఇతర పథకాలకు రూ.65,447కోట్లు,   ఇవన్నీ పోను మిగిలిన ఖర్చు రూ 37,774 కోట్లు. మూలధనం ఖర్చు రూ 18145 కోట్లు, ఈ మూల ధనం ఖర్చులో నాడు–నేడు, మనబడి, ఆసుపత్రి పనులు, రోడ్ల నిర్మాణం వంటివన్నీ వస్తాయి.  వివరాలన్నీ పారదర్శకంగా ఇంత స్పష్టంగా ఉంటే ఇందులో రూ.48వేల కోట్ల అవినీతికి తావెక్కడుందో టీడీపీ బడా నేతలకే తెలియాలి. 

Broad areas of expenditure    2018-19    2020-21(incl. expenditure under SDC)
Total Expenditure    1,64,841    2,03,448
Salaries and Pensions    53,811    66,470
Debt Servicing     28,887    33,753
DBT and Non-DBT Schemes    -    65,447
Remaining Expenditure     82,143    34,774

    అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018–19 గాను మొత్తం వ్యయం రూ 1,64,841 కోట్లు జరిగింది. అందులో ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు అన్నీ కలిపి రూ 53,811 కోట్లు అయింది. అప్పు–వడ్డీ చెల్లింపులకు రూ 28, 887 కోట్లు ఖర్చు చేశారు. మీ పాలనలో నామమాత్రంగా మినహా న గదు బదిలీ పథకాలేవీ అమలు చేయలేదు. ఇక మిగిలిన   మొత్తం సుమారు రూ 82,143 కోట్లు ఇతరత్రా ఖర్చు చేశారు. 

    మీ హయాంలో నీరు–చెట్టు లాంటి పథకాలు, ఆర్భాటంగా సదస్సులు ఏర్పాటు చేయడం, పెద్ద పెద్ద టీములను తీసుకుని దేశాలు పట్టుకుని తిరగడానికే వెచ్చించారు. ఇంత భారీ మొత్తంలో ఇతర వ్యయం చేసిన టీడీపీ ప్రభుత్వంలోనే అవినీతికి ఆస్కారం ఎక్కువగా ఉందనేది ప్రజలకు బాగా తెలుసు. ఏ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిందో , ఏ ప్రభుత్వం తమ సంక్షేమం కోసం ఖర్చు చేస్తోందో ప్రజలు గ్రహిస్తున్నారు.

     మా ప్రభుత్వానికి నగదు నిర్వహణ చేతకాదని టీడీపీ విమర్శిస్తోంది.  మా  ప్రభుత్వం ఏడాదిలో 103 రోజులు ఓడీకి , 331  రోజులు వేస్‌ అండ్‌ మీన్స్‌కు ఆర్బీఐ వద్దకు వెళుతున్నారని టీడీపీ నేతలు తప్పు పట్టారు. 

    భారతీయ రిజర్వు బ్యాంకు రాష్ట్రాలకు వారి రోజు వారీ నగదు నిర్వహణకు గాను,     వేస్‌ అండ్‌ మీన్స్‌ వసతిని కల్పించింది. దీనిని వాడుకోవడమనేది ఏ ప్రభుత్వానికైనా సర్వసాధారణమైన విషయం. వాస్తవానికి మేము పూర్తిగా ఆర్.బి.ఐ నియమ నిబంధనలకు లోబడే వేస్ అండ్ మీన్స్ వసతిని వాడుకోవడం జరిగింది.

ఉదాహరణకు ఏ విధంగా అయితే ఒక వ్యాపార సంస్థకు బ్యాంకులో కరెంటు ఖాతా ఉంటుందో... ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఖాతాలో ఉన్న మొత్తానికి మించి కూడా ఒక పరిమితి వరకూ నగదు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ విధంగా రోజు వారీ ఖర్చులకు నగదు కొరత ఏర్పడినపుడు ఆయా సంస్థలు అప్పటికపుడు బ్యాంకుల నుంచి తీసుకుంటూ ఉంటాయి. 

    అలాగే ప్రభుత్వాలు కూడా రిజర్వు బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తానికి మించి కొన్ని పరిమితులకు లోబడి నగదు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనినే ‘వేస్‌ అండ్‌ మీన్స్‌’, ‘ఓవర్‌ డ్రాఫ్ట్‌’ అంటారు. వేస్‌ అండ్‌ మీన్స్‌ అనేది తాత్కాలిక అప్పు మాత్రమే. ఇది స్వల్పకాలికంగా రోజు వారీ చేబదులు తీసుకున్నట్లుగా పరిగణిస్తారు. 

విభజన తరువాత మన రాష్ట్ర  ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బందికరంగా తయారైంది. అంతే కాక కోవిడ్‌ వల్ల రాబడి తగ్గింది. అలాంటి సమయంలో వేస్‌ అండ్‌ మీన్స్‌కు వెళితే తప్పేంటి?

టీడీపీ ప్రభుత్వం కూడా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ 59,729 కోట్లు వేస్‌ అండ్‌ మీన్స్‌ వసతి పొందడం వాస్తవం కాదా?

అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా 2020–21 సంవత్సరానికి గాను రూ 69,454 కోట్లు వేస్‌ అండ్‌ మీన్స్‌ను ఉపయోగించుకుంది. ఈ వాస్తవం టీడీపీ నేతలకు బాగా తెలుసు. 

 ఇదేదో ఇపుడే వైసీపీ ప్రభుత్వమే చేస్తున్నట్లుగా వాస్తవాలను మరుగున పరచి అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారో వారికే తెలియాలి. 

ఉదాహరణకు కోవిడు పరిస్థితిలో పేద వాడిని కష్టాల నుండి కాపాడడం కోసం  నియమిత గడువులోపల ఒక సంక్షేమ పథకానికి నిధులు విడుదల చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉండకపోవచ్చు. అప్పుడు ఆర్బీఐ వద్దకు వేస్‌ అండ్‌ మీన్స్‌కు వెళతాం. అప్పుడప్పుడు నెగటివ్‌ బ్యాలెన్స్‌ కూడా కావొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి అధికంగా వచ్చినప్పుడు అది మిగులు బ్యాలెన్స్‌గా కూడా మారొచ్చు. ఇది తెలిసి కూడా అదేదో పెద్ద తప్పయినట్టు టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉంది.

2020–2021 సంవత్సరంలో మా ప్రభుత్వం రూ1,04,539 కోట్లు వేస్‌ అండ్‌ మీన్స్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించిన్పటికీ ఆ మొత్తాన్ని అదే సంవత్సరంలో తిరిగి చెల్లించింది. అదే టీడీపీ ప్రభుత్వంలో 2018–19లో రూ 59868 కోట్లు వేస్‌ అండ్‌ మీన్స్‌ ద్వారా తీసుకుని రూ 139 కోట్లు తిరిగి చెల్లించకుండా వెళ్లి పోయిన మాట వాస్తవం కాదా?

ఎవరి పాలనలో నగదు నిర్వహణ సరిగ్గా జరిగిందో... ఎవరి హయాంలో సరిగ్గా జరుగలేదో ఈ ఉదంతం చూస్తే చాలు తెలిసి పోతుంది. నగదు నిర్వహణలో విఫలమైంది మీరా? మేమా? అని టీడీపీ నేతలను వారి అధినాయకుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 

అకౌంటెంట్‌ జనరల్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించి 2021–22 సంవత్సరం  వేస్‌ అండ్‌ మీన్స్‌∙వివరాలకు సంబంధించిన  అనుబంధ బడ్జెట్‌ అంచనాలను శాసన ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని అకౌంటెంట్‌ జనరల్‌కు తెలియ జేశాము. 

    అదే టీడీపీ ప్రభుత్వం 2018–19 సంవత్సరంలో శాసన ఉభయ సభల ఆమోదం తీసుకోనే లేదు. అలాంటి వారు మాకు ఇపుడు నీతులు చెబుతారా?

వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ చేయడం చేతగాదని యనమల మాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

2021–22 సంవత్సరంలో మా ప్రభుత్వం బడ్జెట్‌ అంచనాల్లో రూ 2,29, 779 కోట్లు పెడితే ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మొత్తం రూ 2,20, 634 కోట్లు ఖర్చు (స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యయం కలిపి) చేసింది. అంటే 96 శాతం నిధులను ఖర్చు చేశాం. 

అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018–19 రూ 1,91,064 కోట్లు బడ్జెట్‌ అంచనాలు చేసి కేవలం రూ 1,64,841 కోట్లు ఖర్చు చేసింది. అంటే కేవలం 86.3 శాతం కేటాయింపులను మాత్రమే ఖర్చు చేశారనేది స్పష్టం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఎవరికి ఆర్థిక నిర్వహణ బాగా చేతనవుతుందో... ఎవరికి చేతగాదో ప్రజలకు తేటతెల్లం అవుతుంది. 

కేంద్రం నుంచి మీ కన్నా ఎక్కువ గ్రాంట్లు సాధించడం మా ఘనత కాదా?..

కేంద్ర ప్రభుత్వం నుంచి మేం కష్టపడి అత్యధికంగా గ్రాంట్లను సాధిస్తే అదేదో అపరాధమైనట్టుగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ మంత్రులుండేవారు. అలాగే ఇక్కడ టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ మంత్రులున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంతో చెట్టపట్టాలేసుకొని తిరిగిన చంద్రబాబు కేంద్రం నుంచి పెద్దగా గ్రాంట్లు రాబట్టలేకపోయారు

ఇదే సమయంలో వైయ‌స్సార్‌ సీపీ ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించి మునుపటికంటే ఎక్కువగా గ్రాంట్లు పొందాం. అది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ ఘనత. మా ఘనతను కూడా అపరాధంగా చిత్రీకరించడం టీడీపీ నేతలకే  చెల్లింది.

గతంలో మీరు గ్రాంట్లు తెచ్చుకోలేకపోయారంటే.. అది మీ అసమర్ధత. ఈ రోజు మేం ఎక్కువగా నిధులు తెచ్చుకున్నామంటే అది మా ఘనత. మీ హయాంలో కన్నా.. ప్రస్తుత వైయ‌స్ఆర్‌ సీపీ  ప్రభుత్వం ఎక్కువ గ్రాంట్లు తెచ్చుకుంటుంటే టీడీపీ నేతలకు, చంద్రబాబుకు ఎందుకంత కడుపు మంట? ఎందుకంత రాజకీయ అక్కసు? అని ప్రశ్నిస్తున్నాను. 

వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పాలనా విధానాలతో ప్రజాదరణను పెంచుకుంటూంటే, ఇకపై తమకు రాజకీయ భవిష్యత్‌ ఉండదేమోనన్న నిరాశానిస్పృహలతో ఏమేమో మాట్లాడుతున్నట్టుగా ఉంది. 

కేంద్రం నుంచి గ్రాంట్లు ఎక్కువగా వచ్చాయని టీడీపీ నేతలు అంటున్నారు, మన రాష్ట్ర ఆదాయ వనరులు, కేంద్రానికి వెళ్లే పన్నుల్లో మన వాటా విపరీతంగా తగ్గి పోయిన విషయాన్ని టీడీపీ నేతలు చెప్పకుండా దాచిపెట్టి, కేవలం కొన్ని ఎంపిక చేసుకున్న అంశాలపైనే వక్రీకరణ చేస్తూ ప్రజలను ఎందుకు టీడీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు?

వాస్తవంగా 2018 –19లో రాష్ట్ర సొంత ఆదాయం రూ 62,503 కోట్లు మరియు, మనకు కేంద్రం నుంచి పన్నుల్లో రావాల్సిన వాటా రూ 32,713 కోట్లుగా ఉంది. ఈ రెండూ కలిపితే రూ 95,214 కోట్లుగా ఉంది. 
సాధారణ వృద్ధి రేటు ప్రకారం మన ఆదాయం ప్రతి ఏటా కనీసం 10 శాతం పెరగుతూ వచ్చింది. ఆ విధంగా చూస్తే 2020–21లో పై రెండు ఆదాయాల నుంచి మన రాష్ట్రానికి మొత్తం రూ 1, 15,209 కోట్లు రావాల్సి ఉండగా ... మన రాష్ట్రానికి కేవలం  రాష్ట్ర సొంత ఆదాయం రూ 60, 823 కోట్లు, కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా రూ 24,441 కోట్లు మాత్రమే వచ్చింది.  ఈ రెండు ఆదాయాలను కలిపితే మన ఆదాయం  2020–21లో రూ 85,264 కోట్లుగా ఉంది. 

దీని ప్రకారం పరిశీలిస్తే మనకు రావాల్సిన ఆదాయం, వాస్తవానికి వచ్చిన ఆదాయము మధ్య సుమారు రూ 30,000 కోట్లు తక్కువగా వచ్చింది. 

ఆదాయం తక్కువగా వచ్చినప్పటికీ రూ 65,447 కోట్లు నేరుగా ప్రజలకు నగదు బదిలీ చేశాం. ప్రభుత్వోద్యోగులకు పెన్షనర్లు 27 శాతం తాత్కాలిక భృతి ఇచ్చాం. వివిధ రకాల కింది స్థాయి ఉద్యోగులకు జీతాలు గణనీయముగా పెంచాము.  ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసులను ప్రభుత్వంలో విలీనం చేసి వారి జీతభత్యాల భారం ప్రభుత్వమే తీసుకుంది. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని నియంత్రణ చర్యలు చేపడితే ... టీడీపీ నేతలు మాత్రం రూ 48,000 కోట్లు మేం దోచామనడం పచ్చి అబద్దమని ప్రజలకు స్పష్టంగా తెలియ జేస్తున్నాను. 

మూలధన వ్యయాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తగ్గిస్తోందని మరో తప్పడు ఆరోపణ చేస్తున్నారు. మాకు మూలధన వ్యయం కన్నా కోవిడ్‌ సమయంలో సామాన్య పేద ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యం. రెండేళ్ల పాటు జనం కోవిడ్‌తో అలమటించారు. ఆరు నెలల పాటు బొత్తిగా ఆదాయం లేక ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని నేరుగా ఆదుకున్నాం. ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాం.
 ప్రజల విషయంలో టీడీపీ వి«ధానాలు వేరు.. మా సిద్ధాంతం వేరు. మీ దృష్టిలో సామాన్య ప్రజలకు విలువ లేదు. టీడీపీ నేతలు రూ.1,400 కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జ్‌ కట్టాలని భావిస్తారు. 

మేం అలా కాదు రూ.140 కోట్లతోనే పటిష్టమైన బ్రిడ్జి నిర్మించాలని సంకల్పిస్తాం. రూ.1,400 కోట్లలో రూ.140 కోట్లు పోనూ మిగిలిన రూ.1260 కోట్లను పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తాం. 

ద్రవ్యలోటు కన్నా రెవెన్యూ లోటు ఎక్కువగా ఉందని యనమల చెబుతున్నారు. ఇదెలా ఉందంటే.. ఒక తండ్రి వయసు కన్నా కొడుకు వయసే అధికం అన్నట్లుగా ఉంది. 

టీడీపీ నేతలది ద్వంద్వ వైఖరి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో యనమల వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఓ వైపు రాష్ట్రం దివాళా తీసిందని అంటారు. మరోవైపు దొంగతనం చేశామని, అవినీతికి పాల్పడ్డామని అంటున్నారు. దివాళా తీసిన చోట దొంగతనానికి అవకాశం ఉంటుందా? యనమల గారూ మీరు గందరగోళంలో ఉన్నారు. ఆ గందరగోళంలో మాపై బురద జల్లడంతో పాటు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. 

టీడీపీ వారికి సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కేలేదు. ఏ రకంగా చూసినా ప్రజలకు అత్యధిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదీ.. వారి ఖాతాల్లోకి నేరుగా నిధులు బదిలీ చేస్తున్నది వైసీపీ ప్రభుత్వమే..

తెలుగుదేశం హయాంలో ప్రజా సంక్షేమానికి చేసిందేమీ లేదు. కొంతమేర పెన్షన్లు, చేతి వృత్తుల వారికి కొన్ని పనిముట్లు ఇవ్వడం  తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. నీరు చెట్టు పేరుతో వేలాది కోట్లు దండుకున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే.

పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతల విమర్శలు పూర్తిగా తప్పు. 2010 – 11 పరిమాణం (క్వాంటిటీస్‌) ప్రకారం 2013 – 14 ధరలకే ప్రాజెక్టు వ్యయ అంచనాలను చంద్రబాబు అంగీకరించి వచ్చిన మాట వాస్తవం కాదా? ఈ విషయంలో  మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఒక జీవనాడిగా భావించి చంద్రబాబునాయుడు సృష్టించిన సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తోంది. 

సింగపూర్‌ తరహాలో రాజధాని కోసం మహానగరం లాంటి నిర్మాణం చేయడానికి రూ 10 లక్షల కోట్లు అని చంద్రబాబు అంచనాలు వేసి చెప్పారు. తరువాత రూ 10 లక్షల కోట్లు పోయి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు రూ 1లక్ష కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. అందులో మళ్లీ మొదటి దశ నిర్మాణానికి  రూ 50 వేల కోట్లు అని చెప్పి చివరకు ఐదు సంవత్సరాల్లో కేవలం రూ 5 వేల కోట్లు ఖర్చు చేసి వెళ్లారు. ఈ విధంగా ... టీడీపీ నేతల మాటలు చూస్తే.... మాటలు మాత్రం కోటలు దాటుతాయి. చేతలు మాత్రం గడప కూడా దాటవు అన్న చందంగా ఉంది.

అబద్ధాలు చెప్పడంలో టీడీపీ నేతలు  గోబెల్స్‌ను మించిపోయారు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు భ్రమలు కల్పించి రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. 

2019లో మీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.60వేల కోట్ల బకాయిలు అప్పగించి వెళ్లారు. అందులో రూ.40 వేల కోట్ల బిల్లుల బకాయిలు, రూ.20 వేల కోట్లు విద్యుత్‌ డిస్కాంలకు బకాయిలు చెల్లించకుండా వెళ్లిపోయారు. ఈ నిర్వాకం చాలదన్నట్టు గోబెల్స్‌ ప్రచారం చేయడమెందుకు? 

టీడీపీ నాయకుల వ్యవహారం ఎలా ఉందంటే.. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విస్తరాకులు వేసి భోజనం కూడా పెట్టలేదు కానీ, వైసీపీ ప్రభుత్వం పంచభక్ష పరమాన్నాలు పెడుతుంటే బంగారు పళ్ళెములో పెట్టలేదని అన్నట్లు ఉంది.

Back to Top