అచ్చం ‘చైతన్యరథం’లా తెలుగుదేశం పార్టీ మారిపోయింది

మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ

తెలుగుదేశం పార్టీకి బూజు పట్టింది. పనికి రాకుండా పోయింది

పార్టీ ఆ రథాన్ని తీసేసినట్లు ప్రజలూ టీడీపీని పక్కన పెట్టారు

తెలుగుదేశం పార్టీ పూర్తిగా జవసత్వాలు కోల్పోయింది

ఒక ఆలోచన కూడా లేకుండా పోయింది

మూర్ఖత్వం, ఒక సామాజికవర్గం, ఒకే ప్రాంతానికి పరిమితం

అదీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి

 చంద్రబాబు ఏ విధంగా రాముడయ్యారు?

ఆయనను ఏ విధంగా రాముడితో పోల్చగలం? 

కేవలం ఒక్క విషయం మినహా. అది ఏక పత్నీవ్రతుడు

రాముడి గుణాల్లో ఒక్కటైనా చంద్రబాబుకు ఉన్నాయా?

రాముడు తండ్రి మాటకు కట్టుబడి అడవికి పోయారు

చంద్రబాబు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచాడు
గుర్తు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

సమష్టి అభివృద్ధి, విశాల దృక్పథం చంద్రబాబుకు కొరవడ్డాయి

అచ్చం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మారింది

మైక్‌ పట్టుకుంటే చంద్రబాబు అంతులేని అబద్దాలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు కట్టిందెవ్వరు?

అవన్నీ నిర్మించింది స్వర్గీయ వైయ‌స్ రాజశేఖర్‌రెడ్డి గారు కాదా?

ప్రజలకు ఇవన్నీ తెలియవని చంద్రబాబు అనుకుంటున్నారా

ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి

మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

క్యాబినెట్‌ మార్పులపై సీఎంగారు ఆనాడే చెప్పారు

ప్రభుత్వం ఏర్పడినప్పుడే జగన్‌గారు స్పష్టంగా చెప్పారు

రెండున్నర ఏళ్ల తర్వాత మార్పులుంటాయన్నారు

తాడేపల్లి: అచ్చం ‘చైతన్యరథం’లా తెలుగుదేశం పార్టీ మారిపోయిందని మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.  తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవం అంటూ నానా హడావిడి చేస్తున్నారు. పత్రికల్లో ఊదరగొట్టారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కానీ ఆనాడు ఎన్టీ రామారావుగారు పార్టీ పెట్టినప్పుడు ఆయన తిరిగిన చైతన్యరథం ఇప్పుడు ఎలా ఉందో.. మొత్తం బూజు పట్టి, పనికి రాకుండా మారిందో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా సరిగ్గా అలాగే మారింది. ప్రజలు కూడా టీడీపీని అదే విధంగా పక్కన పెట్టారన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుకు అవి లేకుండా పోయాయి:
    తెలుగుదేశం పార్టీ జవసత్వాలు కోల్పోయింది. ఆలోచన కూడా లేకుండా పోయింది. మూర్ఖత్వం, ఒక సామాజికవర్గం, కొంత మంది, ఒకే ప్రాంతానికి పరిమితం అయినట్లుగా ఉంది. సమష్టి అభివృద్ధి, విశాల దృక్పథం ఇవేవీ చంద్రబాబుకు లేకుండా పోయాయి. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మారింది.
    ఆనాడు రాష్ట్రంలో సామాజిక పరిస్థితి చూసి ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. ప్రజలు కూడా ఆదరించారు. కానీ చంద్రబాబు వచ్చి ఏం చేశాడు? ఆయనకు వెన్నుపోటు పొడిచి, పార్టీకి కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చాడు. అందుకే ఆ పార్టీ జవసత్వాలు కోల్పోయింది. ఇది మేమంటున్న మాట కాదు. ప్రజలే అంటున్నారు. 

రాముడితో చంద్రబాబుకు పోలికా!:
    చంద్రబాబును రాముడితో పోల్చారు. ఆయనను ఏ విధంగా రాముడితో పోల్చగలం? కేవలం ఒక్క విషయం మినహా. అది ఏక పత్నీవ్రతుడు. కానీ రాముడికి ఉన్న గుణాల్లో ఒక్కటైనా చంద్రబాబుకు ఉన్నాయా? రాముడు తండ్రి మాటకు కట్టుబడి అడవికి పోతే, చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్నాడు.

కట్టకపోయినా అసత్యాలు:
    ఇంకా చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌రోడ్డు తానే కట్టాడంటాడు. వాటిని నిజంగా కట్టింది స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డిగారు. ఇది వాస్తవం. వాటి కోసం భూములు సేకరించి, నిర్మాణాలు పూర్తి చేసింది వైయస్సార్‌గారు. కాదంటారా? కావాలంటే శిలాఫలకాలు కూడా చూడొచ్చు.

ఆనాటి సీఎస్‌ ఏం చెప్పారు?:
    ఇంకా చంద్రబాబు ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడుతున్నారు.
అయితే 2004లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి గారు జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులు చేపట్టారు. దాదాపు 60 లక్షల ఎకరాలకు నీరివ్వాలని పనులు మొదలుపెట్టారు. ఇది అందరికీ తెలిసిన విషయం.
    ‘ఆరోజు సీఎస్‌గా మోహన్‌కందా ఉన్నారు. తొలి క్యాబినెట్‌ భేటీ తర్వాత.. నీటి వనరుల మీద సీఎస్‌గారు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆనాటి ప్రాజెక్టులు, నదుల జలాలు. వృథాగా పోతున్న జలాలు. మిగులు జలాల గురించి ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రాజెక్టులకు ఎంత వ్యయం అవుతుందో కూడా చెప్పారు. 20 నిమిషాల ప్రజెంటేషన్‌ తర్వాత అప్పటి మంత్రి దివాకర్‌రెడ్డిగారు సీఎస్‌గారిని అడిగారు. చంద్రబాబు హయాంలో కూడా మీరే (మోహన్‌ కందాగారు) సీఎస్‌గా ఉన్నారు కదా. ఇదే విషయాలను చంద్రబాబుగారికి ఎందుకు చెప్పలేదు? చెప్పి ఉంటే ఆయన ప్రాజెక్టులు కట్టి ఉండేవారు. రాష్ట్రం బాగుండేది కదా? అని దివాకర్‌రెడ్డి గారు అన్నారు.
    దానిపై వెంటనే సీఎస్‌ కందాగారు అన్నారు. 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం ఏర్పడుతుంది. అధికారం చేపట్టిన వారికి ప్రాధాన్యాలు ఉంటాయి. వారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. వాటిని మాకు చెబితే, ఆ మేరకు మేము ప్రణాళికలు రూపొందిస్తాం. మంత్రివర్గ సమావేశాల్లో వాటిని మీ ముందు ఉంచితే నిర్ణయాలు తీసుకుంటారు.
ఇవాళ వైయస్సార్‌గారు సీఎం కాగానే, రైతుల సమస్యలు ప్రస్తావించి, నదీ జలాలు ఎలా వినియోగించో చెప్పాలన్నారు. ఆ మేరకు మేము ఈ ప్రజెంటేషన్‌ రూపొందించాము అన్నారు. అదే చంద్రబాబుగారు ఎప్పుడూ పట్టణాల గురించే అడిగారని ఆయన చెప్పారు’.
    దీన్ని బట్టి ఆనాడు చంద్రబాబు ప్రయారిటీ ఏమిటి? వైయస్సార్‌ గారి ప్రయారిటీ ఏమిటన్నది అందరూ గమనించాలి. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ఆయన నమ్మారు. 

ఎందుకీ గొప్పలు?:
    శంషాబాద్‌ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌రోడ్‌ ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా?. అయినా ఎందుకు ఆ అబద్ధాలు. ఎవరినో నీవు ప్రధానిని చేశావని చెబుతున్నావు. మరి నీ ఇంటి పక్కనే పోటీ చేసిన నీ కొడుకు ఎందుకు ఓడిపోయాడు?.
    ప్రజలతో మమేకమై, వారి కష్టాలు చూసి, వాటి పరిష్కారం కోసం పని చేశారు నాడు ఎన్టీఆర్‌. ఆ తర్వాత వైయస్సార్‌గారు. ఇప్పుడు జగన్‌గారు ఆ పని చేస్తున్నారు.
    కానీ మీరేం చేశారంటే.. అమరావతి గురించి చెబుతావు. కానీ ఇక్కడ చేసింది దోపిడి, రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ తప్ప మరొకటి ఉందా? ఇది వాస్తవం కాదా?. పార్టీలు ఏర్పాటు కావడం, ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం సహజం. కానీ ఏదో బ్రహ్మాండాలు చేసినట్లు ఇవాళ పత్రికలు రాశాయి. అందుకే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తోంది.

ఒక విధానం, ఆలోచన ఉన్నాయా?:
    అసలు మీ పార్టీ విధానం ఏమిటో చెప్పాలంటే.. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏం చేసినా దాన్ని వ్యతిరేకించడమే. అదే మీ విధానం. 
కాదంటారా? మీకు నిజంగా ఒక విధానం, ఒక ఆలోచన ఉంటే ధైర్యంగా చెప్పండి.
    కానీ మాకు అవి ఉన్నాయి. వాటినే ప్రజలకు చెప్పాం. వారి విశ్వాసం పొందాం. అధికారంలోకి వచ్చాక, ఎక్కడా అవినీతి లేకుండా పని చేశాం. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాం. మీ ప్రభుత్వంలో మాదిరిగా ఇక్కడ జన్మభూమి కమిటీలు లేవు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా అర్హులైన వారందరికీ దాదాపు రూ.1.32 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. ఇది వాస్తవం. కాదంటారా. ఇక్కడ అమలు చేస్తున్న వాటిని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని చూస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు. వలంటీర్ల వ్యవస్థ అందరినీ ఆకట్టుకున్నాయి.

వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు:
    వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల దిశగా పని చేస్తున్నాం. ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా దాదాపు రూ.2 కోట్ల మేర ఆస్తి, సంపద సృష్టి  కనిపిస్తోంది. మీకు ధైర్యముంటే రండి చూపిస్తాను. గతంలో కనీసం పంచాయతీ భవనం కట్టాలన్నా ఎంతో కష్టంగా ఉండేది. అదే ఇవాళ సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆర్బీకేలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు. నాడు–నేడు కార్యక్రమంలో స్కూళ్లలో సమూల మార్పులు.. ఇవన్నీ అభివృద్దిలో భాగం కాదా? పరిపాలనలో మార్పు కాదా? చెప్పండి.
    మా పని మేము చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం పని చేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా మహానేత వైయస్సార్‌ స్ఫూర్తిగా ముందుకు వెళ్తున్నాం.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..

ఆ పని ఎప్పుడో చేశాం:
    40 శాతం టికెట్లు యువతకు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. మరి మా పార్టీలో యువకులు ఎందరు ఉన్నారో చూడండి. మేము ఆ పని ఎప్పుడో చేశాం. చంద్రబాబు తానేదో కొత్తగా ఆ పని చేస్తున్నట్లు చెబుతున్నారు. దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. నిజానికి తమ పార్టీకి పట్టిన బూజు చంద్రబాబు దులుపుకుంటున్నారు.

మార్పులపై ఆనాడే చెప్పారు:
    క్యాబినెట్‌ అనేది పార్టీ అధినేత పూర్తి స్వేచ్ఛ. మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిగారు. ఒక సీఎంగా తన మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలన్న దానిపై పూర్తి స్వేచ్ఛ ఆయనది. మంత్రివర్గం అన్నాక ఎన్నో కూర్పులు ఉంటాయి. పార్టీ అనేది తల్లి. పార్టీ ఉంటేనే అందరం ఉంటాం. కాబట్టి పార్టీని కాపాడుకోవడానికి అధినేత ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పడగానే జగన్‌గారు స్పష్టంగా చెప్పారు. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులుంటాయని ఆయన చెప్పారు.. అని మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.

Back to Top