ఆ రాతలను విస్మరించడం మేలు

ప్రభుత్వంపై బురదజల్లేలా పనికిమాలిన పత్రికల పిచ్చి రాతలు

ఇంతకు ముందున్న ఆస్తిపన్నుకు 10 – 15 శాతానికి మించి పెరగదు

375 చ.అ లోపు ఉన్న ఇళ్లన్నింటికీ రూ.50 మాత్రమే ఇంటి పన్ను

ఆస్తిపన్ను పెంపుపై కొన్ని పత్రికలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం

తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుజేసేందుకు కుట్ర చేస్తున్నారని, పనికిమాలిన పత్రికల తాలూకా రాతలను విశ్వసించకండి.. విస్మరించండి అని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆస్తిపన్ను పెంపుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతకు ముందున్న ఆస్తి పన్నుకు పది నుంచి 15 శాతానికి మించి పెరిగే సమస్య లేదన్నారు. సామాన్య రాష్ట్ర ప్రజలంతా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకంతో గొప్ప మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలిపించారన్నారు. ప్రజాప్రభుత్వంపై బురదజల్లేందుకు కొన్ని పత్రికలు కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన ఏం మాట్లాడారంటే.. 

‘కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం స్థానిక సంస్థలు బలోపేతం కావాలని కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలో స్థానిక సంస్థలు బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉందో.. తద్వారా స్థానిక సుపరిపాలనను ఇంకా మెరుగ్గా ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆ నేప‌థ్యంలోనే.. ఇంతకు ముందు ఇంటి తాలూకా ఆదాయం ఎంత వస్తుందో.. మూడు నెలల ఆదాయాన్ని పన్ను కింద వేసేవారు. ఉదాహరణకు ఇంటికి నెలకు రూ. వెయ్యి అద్దె వస్తే.. మూడు నెలల అద్దెను ప్రభుత్వానికి పన్ను కింద ఇచ్చే సంప్రదాయం ఇంతకుముందు ఉండేది. 

ఇవాళ ఆస్తి తాలూకా విలువ మీద పన్ను వేయాలని కేంద్రం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అన్నిట్లో ఈ విధానం జరుగుతుంది. ఆస్తి పన్నును ఆస్తి విలువ మొత్తం మీద 0.10 శాతం నుంచి 0.50 శాతం వేయాలని నిర్ణయం చేశాం. అప్పటికీ.. ప్రజలు ఇబ్బందులు పడాతారా.. అని సుమారు రెండు దఫాలుగా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రజల మీద భారం పడకుండా విధానమైన మార్పు చేయాలని సూచించారు. 

ప్రజలు ఇవాళ కడుతున్న పన్ను రూ.500 ఉంటే దానికి పది, పదిహేను శాతం మించకుండా పన్ను ఉండాలని జీఓలో ప్రతిపాదించాం. రాష్ట్రంలో ఉన్న 375 చదరపు అడుగులలోపు ఉన్న ఇళ్లన్నింటికీ రూ.50 మాత్రమే ఇంటి పన్ను. ఆస్తిపన్ను కడితే హక్కు వస్తుందనే ఉద్దేశంతోనే రూ.50 కూడా పెట్టడం జరిగింది. ఇంతకు ముందున్న ఆస్తి పన్నుకు పది నుంచి 15 శాతానికి మించి పెరిగే సమస్య లేదు. 

ఆస్తిపన్నుపై పేపర్లలో వచ్చిన గందరగోళంపై కొందరు అసోసియేషన్‌ సభ్యులు నన్ను కలిశారు. వారినే ఆస్తిపన్ను ఎంత పెంచితే బాగుంటుందని అడిగాను.. డొమస్టిక్‌ (నివాస గృహాలు) 20 శాతం లోపు, కమర్షియల్‌కు (వాణిజ్య భవనాలు) 25 శాతం పైన పెంచండి అని వాళ్లే చెప్పారు. అయినప్పటికీ 10 నుంచి 15 శాతం మాత్రమే పెరుగుతుంది. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే.. కొన్ని పత్రికలు పనికిమాలిన రాతలు రాస్తున్నాయి. బాధ్యత గల పత్రికలు ప్రజలకు మంచి సమాచారం ఇవ్వాలి.. వాస్తవాలను సమాజానికి తెలియజేయాలి.. కానీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తా ఎలా..?’ అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

Back to Top