విజయవాడ: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై చాలా కేసులున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు స్టేలు తెచ్చుకొని నెట్టుకొచ్చారు.. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తప్పించుకోలేకపోయారు అని ఆయన విమర్శించారు. తప్పు చేసినప్పుడు చట్టాల నుంచి తప్పించుకోలేరు.. ధర్నాలు, ఆందోళనలతో కేసుల నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు.. అసెంబ్లీలో అనవసరంగా అల్లరి చేశారు.. చంద్రబాబు కేసులపై చర్చించేందుకు ఎందుకు వెనుకడుగు వేశారని బొత్స సత్యనారాయణ తెలిపారు. జనసేన- టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇది వరుకు లేదనా.. ఎప్పుడూ వారిద్దరూ కలిసే ఉన్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇద్దరూ కలిసినా మాకేమీ నష్టం లేదు.. వారాహిలో ఇప్పుడు ఇద్దరూ కలిసి తిరుగుతారు.. కలిసే మాట్లాడుతారు అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఉందని మంత్రి బొత్స అన్నారు. దొంగతనం చేసి, దొరికిపోయి జైల్లో పెడితే.. ప్రజల్లో సానుభూతి వస్తుందా అని అడిగారు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.. అందులో రాజీపడే ప్రసక్తి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. రాష్ట్రంలో సుమారు 11వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానిదే అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ కంటే మెరుగైన స్కీమ్ జీపీఎస్ తీసుకొచ్చాం.. ఎలాంటి అవినీతి లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా సంక్షేమ నిధి అందిస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీనే అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే ఆయా అంశలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది అని మంత్రి తెలిపారు.