విశాఖ వద్దనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి

పరిపాలన రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష

మూడు రాజధానులతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

అమరావతి యాత్ర వందశాతం టీడీపీ యాత్రే.

రైతులు ఎక్కడైనా తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం చూశామా..?

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లిలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అనాధిగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉందన్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ కుటిలయత్నాలు చేస్తోందని, అమరావతి యాత్ర వందశాతం టీడీపీ యాత్రేనని మంత్రి బొత్స స్పష్టం చేశారు. 

రైతులు ఎక్కడైనా తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం చూశామా..? అని ప్రశ్నించారు. రైతులను అడ్డుపెట్టుకొని రాష్ట్ర సంపదను దోచుకోవాలని చూస్తున్నారన్నారు. విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న స్థానిక నాయకులు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎలా పోటీ చేస్తారని మంత్రి బొత్స ప్రశ్నించారు. 

చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ. 6,000 కోట్లు ఖర్చు చేశారని, అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు చేసి ఖర్చు చేశారని ప్రస్తావించారు. మిగతా 1,500 కోట్లలో వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్‌ నుంచి అమరావతికి ఖర్చు చేశారని గుర్తుచేశారు. అమరావతిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలంటే 5–6 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 

పరిపాలన రాజధానిగా విశాఖ వద్దనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుందా అని, ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఒకే సామాజిక వర్గానికి రాష్ట్ర సంపద దోచిపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది సీఎం వైయస్‌ జగన్‌ విధానమని స్పష్టం చేశారు. అమరావతిలో భవనం నిర్మించాలంటే 110 నుంచి 135 అడుగుల లోతు పునాది కోసం తవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. బడ్జెట్‌ మొత్తం, జీతాలు, సంక్షేమ కార్యక్రమాలకే సరిపోతుందని, తాను చెప్పింది నిజమో.. అబద్ధమో చంద్రబాబు, యనమల రామకృష్ణడు చెప్పాలన్నారు. విభజన చట్టంలోనే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని చెప్పారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.

పవన్‌ కల్యాణ్‌ వచ్చినంత మాత్రాన రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల మనసు మారదన్నారు. చనిపోయిన సిల్క్‌ స్మితా వచ్చినా ఇంతకంటే ఎక్కువమంది వస్తారని ఎద్దేవా చేశారు. పాదయాత్రకు శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేయాలని, ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. పాదయాత్ర జరుగుతున్న సమయంలో బైక్‌ ర్యాలీలు, నిరసనలు తెలపడం, నల్ల బ్యాడ్జీలు ధరించడం, స్వచ్ఛందంగా షాపులు మూసివేయడం, బంద్‌ నిర్వహించడం వంటివి జేఏసీ చేయాలన్నారు. జేఏసీ తలపెట్టిన ఏ కార్యక్రమానికైనా తాము మద్దతుగా నిలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 
 

Back to Top