మ‌ళ్లీ వైయ‌స్ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం 

మంత్రి బొత్స‌స‌త్య‌నారాయ‌ణ‌

 తాడేపల్లి: రెండేళ్ల తర్వాత కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందే చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద  మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే..:

 

దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి:

విశాఖ ఎన్‌సీపీ భూముల్లో అక్రమాలు చేశామంటూ, టీడీపీ మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. వారి మాటలు ఎవరైనా వింటే నవ్విపోతారు. మొన్న విశాఖలో కూడా మాట్లాడాను. చాలా స్పష్టంగా చెప్పాను. అయినా వారికి అర్ధం కాలేదట. దానికి నేను ఏం చేస్తాను?

 

అప్పుడేం జరిగింది?:

2019లో ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు ఎన్‌సీసీ ఒక దరఖాస్తు చేసింది. గతంలో తమకు ఇచ్చిన భూమిని అంతకు ముందు ఉన్న ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంటే, కోర్టుకు పోయి వారు స్టేటస్‌కో తీసుకువచ్చారు. దీంతో ఆ భూమి కేటాయింపు వివాదం కాగా, దానికి పరిష్కారం చూపుతూ, ఎన్‌సీసీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. అందులో మూడు అంశాలు ప్రస్తావించారు.

 

ఇవీ ఆ మూడు అంశాలు:

1. మా డబ్బును 12 శాతం చక్రవడ్డీతో తిరిగి ఇవ్వాలి.

2. అంతకు ముందు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఆ భూమిని అభివృద్ధి చేసి, ఇళ్లు కట్టి అమ్మితే, వచ్చిన మొత్తం 4.5 శాతం రాయల్టీగా ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ క్లాజ్‌ను రద్దు చేసి, అందుకు బదులుగా ఎంత మొత్తం అయితే అంత చెల్లిస్తామన్నారు.

3. అదే విధంగా కావాలంటే, మరోసారి చర్చిద్దామని సూచించారు.

 

అప్పటి ప్రభుత్వం ఏం చేసింది?:

అప్పుడు చంద్రబాబుగారు 2019లో ఎన్నికలకు కొన్నాళ్ల ముందు, దాన్ని క్యాబినెట్‌ ముందుంచారు. ఇద్దరు వాల్యుయేటర్లతో ఆ భూముల విలువ కట్టించి, దాని ప్రకారం 4 శాతం రాయల్టీకి ఎంత డబ్బు వస్తే, అది కట్టించుకుని అంతకు ముందు ఉన్న అగ్రిమెంటులో ఉన్న క్లాజ్‌ను రద్దు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించి, ఆ మేరకు జీఓ నెం.64 జారీ చేశారు.

 

క్యాబినెట్‌ నిర్ణయాన్ని కాదని..:

ఆ తర్వాత ఎన్‌సీసీ మళ్లీ దరఖాస్తు చేసింది. తమకు అగ్రిమెంటులో క్లాజ్‌ రద్దు చేయడం కాకుండా, ఆ భూమికి జీపీఏ ఇవ్వమని కోరారు. 

అప్పుడు క్యాబినెట్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏక పక్షంగా వ్యవహరించిన చంద్రబాబు జీఓ. నెం.121 ఇచ్చారు. వాళ్లు అడిగారు కాబట్టి, వారికి జీపీఏ ఇస్తూ, ఈ జీఓ ఇచ్చారు.

 

మేము వచ్చాక అది కుదరదన్నాం:

ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వం పోయి, మా ప్రభుత్వం వచ్చింది. అప్పుడు వారు మా దగ్గరకు వచ్చారు. జీఓ.నెం.121 అమలు చేయమని కోరారు. జీపీఏ ఇవ్వమని కోరితే, మేము ఒప్పుకోలేదు. అంతకు ముందు క్యాబినెట్‌ నిర్ణయం ప్రకారం జారీ అయిన జీఓ నెం.64 అమలు చేస్తామని చెప్పాం. ఎందుకంటే క్యాబినెట్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం నిర్ణయం తీసుకోలేరు కాబట్టి, జీపీఏ ఇవ్వబోమని స్పష్టం చేశాం. అందుకు అనుగుణంగానే జీఓ నెం:67 జారీ చేశాం.

 

టీడీపీ అర్ధం లేని విమర్శలు:

అయితే మా ప్రభుత్వం పాత జీఓను పట్టించుకోకుండా, కొత్తగా జీఓ జారీ చేసి అందులో అవినీతికి పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ నేను ఒక్కటే విషయం స్పష్టం చేస్తున్నాను.

అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసి, జీఓలు జారీ చేసిన వారిని వచ్చి, ఈ విషయం మాట్లాడమని చెప్పండి. అంతే తప్ప, పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఆరోపణలు చేయడం కాదు.

 

ఇదీ మేం చేసింది..:

మేము జారీ చేసిన జీఓ ప్రకారం, ఓపెన్‌ ఆక్షన్‌లో పిల్చి, ఇద్దరు ఎవాల్యుయేటర్లను ఎంపిక చేసి, వారి ద్వారా విలువ లెక్కించాము. వారు అన్నీ లెక్కించి రూ.97 కోట్లు అవుతుందని చెప్పడంతో, ఆ మొత్తం కట్టించుకుని రిజిస్ట్రేషన్‌ చేయమని చెప్పాం.

 

మరి ఆ ప్రభుత్వం ఏం చేసింది?:

అదే చంద్రబాబు ఏం చేశారు? క్యాబినెట్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా జీపీఏ ఇచ్చారు. వారికి భూములపై హక్కులు కల్పించారు. ఆ విధంగా దోచుకుని తిన్నారు. ఆ భూమి విలువ ఇప్పుడు రూ.1500 కోట్లు అంటున్నారు. ఆ భూమి విలువ అంత ఉన్నప్పుడు మీరు భూమి వారికి ఇస్తూ, జీఓ ఎలా జారీ చేశారు. అందుకే ఇప్పుడు ధర్నా చేస్తామంటున్న టీడీపీ నేతలు, ఇన్ని అక్రమాలు చేసిన చంద్రబాబు ఇంటి ముందు చేయండి. చంద్రబాబు అంత దోపిడి చేస్తే, మేము దాన్ని కొనసాగించాలా?

 

పూర్తి పారదర్శకంగా:

నేను ఒక్కటే చెబుతున్నాను. మా ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఎక్కడా అవినీతికి పాల్పడం. ఎక్కడైనా మాకు తెలియకుండా పొరపాటు, తప్పు జరిగితే.. విషయం తెలియగానే తప్పనిసరిగా సవరించుకుంటాం.

ఇప్పుడు మీకు విశాఖ భూములకు సంబంధించి అన్ని వివరాలు, డాక్యుమెంట్లు ఇస్తున్నాం. మీరూ పరి«శీలించండి. మేము చేసిన దాంట్లో ఏమైనా తప్పు జరిగి ఉంటే చెప్పండి. అంతే తప్ప, నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఆరోపణలు చేయడం సరికాదు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయడం సరికాదు.

 

దమ్ముంటే చర్చకు రండి:

మళ్లీ చెబుతున్నాను. ఇది చంద్రబాబు చేసిన దోపిడి. అక్రమ వ్యవహారం. దుర్భుద్ధితోనే జీఓ ఇచ్చారు. ఆయనే అవినీతికి పాల్పడ్డారు.

మీకు ధైర్యం ఉంటే చర్చకు రండి. ఏ ఛానల్‌కు అయినా నేను వస్తాను. చంద్రబాబు చేసిన అవినీతిని చూపుతాను.

చంద్రబాబు చట్టవిరుద్ధంగా జారీ చేసిన జీఓ నెం.121 ప్రకారం కాకుండా, అంతకు ముందు అప్పటి క్యాబినెట్‌ నిర్ణయం ప్రకారం జారీ చేసిన జీఓ నెం.64ను అమలు చేసే విధంగా జీఓ నెం.67 జారీ చేసి, ఆ నిర్ణయం ప్రకారమే వాల్యుయేటర్ల నివేదిక ఆధారంగా డబ్బు కట్టించుకుని రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. అంతే తప్ప, ఎక్కడా అవినీతికి పాల్పడలేదు.. అని మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top