విశాఖ: మా ప్రభుత్వానికి ఎవరి మీద కక్షసాధించాల్సిన అవసరం లేదు. తన, మన భేదం లేకుండా పాలన సాగుతోంది. చేపట్టే ఏ కార్యక్రమైనా చట్టం, న్యాయం ప్రకారం చేయాలనేది సీఎం వైయస్ జగన్ ఆలోచన, మా ప్రభుత్వ విధానమని మున్సిపల్ శాఖ బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేసి.. 25 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లాడన్నారు. రాజధాని పేరు చెప్పి అమరావతి ప్రజలను చంద్రబాబు మోసం చేశాడని మండిపడ్డారు. అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇస్తే.. టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, విచారణలో భాగంగానే బాబుకు నోటీసులు అందాయన్నారు. విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని అసెంబ్లీ సాక్షిగా సీఎం వైయస్ జగన్ ప్రకటించారని, అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా, తండ్రి రెండు అడుగులు వేస్తే.. తాను నాలుగు అడుగులు ముందుకేస్తానని సీఎం వైయస్ జగన్ చెప్పారని, చెప్పిన మాట కంటే మిన్నగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. మహానేత ప్రారంభించి ఆయన మరణంతో అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని చెప్పారు. వైయస్‌ఆర్ సీపీని, సీఎం వైయస్ జగన్ నాయకత్వాన్ని ప్రజలు పూర్తిగా సమర్థించారని, మున్సిపాలిటీ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకగ్రీవంగా వైయస్ జగన్ నాయకత్వాన్ని, ప్రభుత్వ పనితీరును, అభివృద్ధి, సంక్షేమానికి పట్టణ ప్రాంతం ఓటేసిందన్నారు. వైయస్‌ఆర్ స్ఫూర్తితో వచ్చిన ఈ ప్రభుత్వం.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకుసాగుతుందని చెప్పారు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు 18వ తేదీన జరగబోతున్నాయని, అభ్యర్థులను కూడా పార్టీ నాయకత్వం నిర్ణయం చేస్తుందని, గంటలో ప్రకటించనున్నామన్నారు. నాడు–నేడు కార్యక్రమంతో విద్య, వైద్య రంగాల్లో సీఎం వైయస్ జగన్ సమూల మార్పులు తెచ్చారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకు ధైర్యాన్ని కల్పించారని, ఎక్కడా లేని విధంగా పంట వేసేముందే గిట్టుబాటు ధర ప్రకటించిన ఏకైక ప్రభుత్వం.. వైయస్ జగన్‌దన్నారు. పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్, మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ఏ సమస్య వచ్చినా వెంటనే అందుబాటులో ఉండి పరిష్కరిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో మరింత బాధ్యతగా పనిచేస్తామని చెప్పారు.