సినిమా టికెట్లకు ఎమ్మార్పీ ఉంటే త‌ప్పేంటీ..?

టికెట్‌ రూ. 500కు పెంచితే జనంపై ఒత్తిడి పెంచినట్టు కాదా?

ప్రజల వినోదాన్ని బలహీనతగా మారుస్తారా?

అందరి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది

రామతీర్థం ఆలయ శంకుస్థాపనను అశోక్‌ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు

ఆలయాల అభివృద్ధికి ఒక్కపైసా వెచ్చించని ధర్మకర్త అశోక్ గ‌జ‌ప‌తి

మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విజయనగరం: ప్రజల వినోదాన్ని బలహీనతగా మార్చుకొని ఇష్టానుసారం టికెట్ల ధరలు పెంచడం సమంజసం కాదని మున్సిప‌ల్ శాఖ‌ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టికెట్‌ ధర రూ.500కు పెంచితే జనంపై ఒత్తిడి పెంచినట్టు కాదా అని ప్రశ్నించారు. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సినిమా టిక్కెట్ల ధరలను అడ్డగోలుగా పెంచడం సరికాదన్నారు. అందరి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు. సినిమా టికెట్లపై ప్రభుత్వం ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుందని, ఏమైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి తెలియజేయాలని థియేటర్ల నిర్వాహకులకు సూచించారు. బిస్కెట్లు, సబ్బులకు ఎమ్మార్పీ రేట్లు ఉన్నప్పుడు సినిమా టికెట్లకు ఉంటే తప్పు ఏమిటని నిలదీశారు. సమస్యకు పరిష్కారం ఉండే మార్గంలో వెళ్లడం మంచిదని అన్నారు.

రామతీర్థం బోడికొండపై కోదండరామస్వామి ఆలయం నిర్మాణానికి పవిత్రమైన శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు అసత్యాలు చెబుతున్నారని బొత్స చెప్పారు. నిబంధనల మేరకే ఆలయ శంకుస్థాపనను దేవదాయశాఖ చేపట్టిందన్నారు. కార్యక్రమం వివరాలను ముందుగా తెలియజేసేందుకు వెళ్లిన ఆ శాఖ సిబ్బందిని అశోక్‌ దుర్భాషలాడారని, ప్రొటోకాల్‌ ప్రకారం ధర్మకర్తగా ఆయన పేరు పెట్టిన శిలాఫలకాన్ని కూడా చిందరవందర చేశారని వివరించారు.

గర్భగుడుల్లో శిలాఫలకాలు వేయకూడదని ఉన్నప్పుడు, చంద్రబాబు పాలనలో జరిగిన వాటి గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. బాధ్యత గల ధర్మకర్త అయితే ఆలయం అభివృద్ధికి కృషి చేస్తారని, ఆయన ఆ దిశగా ఏనాడూ పనిచేయలేదని విమర్శించారు. టీడీపీ పాలనలో ఒక్కపైసా వెచ్చించే ఆలోచన చేయని ధర్మకర్త ఆయనేనంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.4 కోట్లు ఖర్చు చేస్తుంటే, అభివృద్ధి జరగనీయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. విగ్రహాలను టీటీడీ ఉచితంగా ఇస్తున్న సమయంలో ప్రత్యేకించి విగ్రహాల కోసం మాత్రమే అని ఇచ్చిన రూ.లక్ష చెక్కును తిరిగి పంపాల్సి వచ్చిందన్నారు. దుర్బుద్ధితో మీడియా ముందే ఆయన ఇలా ప్రవర్తించారని మండిపడ్డారు. 

Back to Top