గతంలో మీడియాపై ఆంక్షలు పెట్టిందెవరు?

గతంలో ప్రెస్‌మీట్‌లకు రావద్దంటూ హుకుం జారీ చేసిందెవరు?  

పత్రికా స్వేచ్ఛపై కొత్త చట్టాన్ని ఏమైనా తీసుకువచ్చారా?

మంత్రి బొత్స సత్యనారాయణ

సచివాలయం: గతంలో మీడియాపై ఆంక్షలు విధించింది ఎవరని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు పత్రికా స్వేచ్ఛ పేరుతో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క మీడియాపై ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. సచివాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని ఎలా అంటారని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పత్రికా స్వేచ్ఛపై కొత్త చట్టాన్ని ఏమైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు.
ఉన్నవి లేనట్లు ఏ పత్రికలు అయితే రాస్తున్నాయో..వాటికి సంబంధించి ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారన్నారు. చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏమి తెలియని నంగనాచిలాగా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏదైనా చట్టాన్ని సవరించామా అని ప్రశ్నించారు. కొత్తగా ఏదైనా చట్టాన్ని తీసుకువచ్చామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిపైనైనా ఎలాగైనా రాసుకోవచ్చు అని ఏ న్యాయస్థానమైనా తీర్పు ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఎవరైనా తప్పుడు రాతలు రాసినప్పుడు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ఏ పత్రికనైనా, మీడియానైనా రాకుండా అడ్డుకుందా అని నిలదీశారు. గతంలో చంద్రబాబు సాక్షి పత్రికను మీడియా సమావేశానికి రాకుండా అడ్డుకోలేదా అన్నారు. బయటకు పో..మైక్‌ తీయండి అని చంద్రబాబు హెచ్చరించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని మొసలి కన్నీళ్లు కార్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబు సహజతత్వం అందరికీ తెలుసు అన్నారు. గతంలో చంద్రబాబు మీడియాపై ఎంతగా చెలాయించారో చూశామన్నారు. మా ప్రభుత్వంలో విసమంతా కూడా అలాంటి చెలాయింపులు లేవన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.47 వేల కోట్లు అప్పులు మిగిల్చిందన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఆపేశారని ధ్వజమెత్తారు.ఎన్నికల ముందు అప్పులు తీసుకువచ్చి మరీ పెద్ద కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని విమర్శించారు.
ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్న దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచన మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. మా ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై చట్టవిరుద్ధంగా చేస్తున్నామని చెప్పే దమ్ము ప్రతిపక్షానికి ఉందా అని సవాలు విసిరారు. మా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. 

Read Also: మాఫియా డాన్‌ లాంటి మీడియా పుట్టుకకు బాబే కారణం

Back to Top