మొంథా తుపాన్‌లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి

ఏ ఆంక్షలు లేకుండా వెంటనే ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలి

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీయస్‌ నాగిరెడ్డి డిమాండ్‌

ప్రభుత్వ తప్పిదంతోనే రైతులకు పంటల బీమా పరిహారం రాలేదు

ఇన్సూరెన్స్‌ చేసుంటే ఎంత వచ్చేదో అంత పరిహారం చెల్లించాలి

తేల్చి చెప్పిన ఎంవీఎస్‌ నాగిరెడ్డి

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం రైతు 
సంక్షేమం) ఎంవీఎస్‌ నాగిరెడ్డి.

వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వ హయాంలో రైతులకు లక్ష కోట్ల లబ్ధి 

నేరుగా వారి ఖాతాల్లో ఏకంగా రూ.99,734 కోట్లు జమ

గణాంకాలతో సహా వివరాలు వెల్లడించిన ఎంవీఎస్‌ నాగిరెడ్డి

కూటమి ప్రభుత్వంలో దారుణంగా వ్యవసాయ రంగం

20 ఏళ్లలో ఎప్పుడూ చూడని వ్యవసాయం సంక్షోభం

అన్నదాతలకు అంతా నష్టం. అప్పుల్లో కూరుకుపోయారు

వ్యవసాయాన్ని, రైతులను ప్రభుత్వం గాలికొదిలేసింది

ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆక్షేపణ

ఉచిత పంటల బీమా ఎగ్గొట్టి రైతుల నడ్డి విరిచారు

ఇప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ నమోదుకు కండిషన్‌

అది తీసుకుంటే పంటలు సేకరించబోరట 

అంటే ఒకటి తీసుకుంటే.. మరొకటి కట్‌

విపత్తుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం బెదిరింపు

ప్రెస్‌మీట్‌లో ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఫైర్‌

తాడేపల్లి: మొంథా తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన రైతులను మానవతా దృక్పథంతో ఆలోచించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అందుకు భిన్నంగా పంట నష్టం అంచనాలను తక్కువగా చూపడం అత్యంత హేయమని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం రైతు సంక్షేమం) ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆక్షేపించారు. దీనివల్ల సీఎం చంద్రబాబు ఇప్పటికీ తన వ్యవసాయ వ్యతిరేక విధానాలను వదులుకోలేదని స్పష్టమైందని ఆయన తెలిపారు. మొంథా తుపాన్‌లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
    
ప్రభుత్వ తప్పిదం వల్లనే రైతులకు పంటల బీమా పరిహారం రావడం లేదని గుర్తు చేసిన ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ఇన్సూరెన్స్‌ చేసి ఉంటే ఎంత వచ్చేదో అంత పరిహారం చెల్లించాలని తేల్చి చెప్పారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం ఒక పండగలా సాగిందని, ఆ 5 ఏళ్లలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా రైతుల ఖాతాల్లో దాదాపు లక్ష కోట్లు జమ చేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎంవీఎస్‌ నాగిరెడ్డి గుర్తు చేశారు.

ప్రెస్‌మీట్‌లో ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

● రైతుల నడ్డి విరిచారు:
    
వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలకు మంగళం పాడిన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఒక్క పెట్టుబడి సాయాన్ని మాత్రం చాలా అరకొరగా అమలు చేసింది. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేల చొప్పున మాత్రమే ఇచ్చి, అక్కడా ఏకంగా రూ.19,089 కోట్లు బకాయి పెట్టింది. అక్కడా రైతుల్లో కోత విధించింది.
    అదే గత వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వంలో 5 ఏళ్లలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా రూ.99,734 కోట్లు జమ చేయడం జరిగింది. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక, రైతుల నడ్డి విరిచారు. వ్యవసాయ రంగాన్ని, రైతులను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఇప్పుడు కూడా మొంథా తుపాన్‌ నష్టాన్ని తక్కువగా చూపుతూ, మరోసారి రైతులకు అన్యాయం చేస్తోంది. ఇంకా దారుణం ఏమిటంటే, ఇప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీకి నమోదు చేసుకుంటే, పంట కొనుగోలు చేయబోమని. అంటే ఒకటి తీసుకుంటే మరొకటి కట్‌. ఇది అత్యంత దారుణం.

● అటు అనావృష్టి.. ఇటు అతివృష్టి:

    ఒక రైతు నాయకుడిగా 20 ఏళ్లుగా పోరాడుతున్నా. ఇప్పుడు చూస్తున్న వ్యవసాయ సంక్షోభం గతంలో ఎప్పుడూ చూడలేదు. అనావృష్టి వల్ల కారణంగా రాయలసీమలో ఆగస్టులోనే వేరుశెనగ పంట దెబ్బతింది. 14 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన పంట కేవలం 5.11 లక్షల ఎకరాలకే పరిమితమైంది. దీని వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడే పరిస్థితి వచ్చింది.
    కాగా, ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 24 జిల్లాల్లో మొంథా తుపాన్‌ ప్రభావం ఉంది. అయినా పంట నష్టం తక్కువ చూపించే ప్రయత్నం జరుగుతోందని ప్రాథమిక అంచనాలు రూపొందించే నాటి నుంచే వైయ‌స్ఆర్‌సీపీ చెబుతోంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో రూ.870 కోట్ల నష్టం వాటిల్లింది. మరోవైపు రహదారుల విధ్వంసం వల్ల రూ.2790 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు అక్టోబర్‌ నెలలో ప్రతి జిల్లాలో కురవాల్సిన దాని కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. అదీ నష్టం చేస్తోంది. 

● నష్టాన్ని తక్కువగా చూపుతూ కుట్ర:
 
    తాను రైతు వ్యతిరేకినని చంద్రబాబు మళ్లీ నిరూపించుకున్నారు. మొంథా తుపాన్‌ వల్ల 3.99 లక్షల ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగిందని ప్రభుత్వం తుది నివేదిక సిద్దం చేయడం హేయం. వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశెనగ, మినుములు, పెసలు, కంది, పొగాకు, చెరకు పంటలన్నీ కలిపి కూడా 3.99 లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగినట్టు ప్రభుత్వం చెబుతోంది. నిజానికి రాష్ట్రంలో ఒక్క వరి పంట మాత్రమే 29 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. అది చాలా వరకు దెబ్బతింది. అలాంటప్పుడు అన్ని పంటలు కలిపి 3.99 లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్లు చెప్పారు.

● సుంకు రాలిపోయిన పంటలు వదిలేశారు:

    ఈ ఏడాది 83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉంటుందని, 51 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరిస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. కానీ మొంథా తుపాన్‌ వల్ల ధాన్యం ఉత్పత్తి 83 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 70 లక్షల మెట్రిక్‌ టన్నులకు పడిపోబోతుంది. వాస్తవం ఇలా ఉంటే, మొంథా తుపాన్‌ వల్ల అన్ని పంటలు కలిపి 4.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి తగ్గుతుందని చెప్పడం రైతులను వంచించడమే. పడిపోయిన వరి పొలమే కాకుండా సుంకు రాలిపోయిన వరి పంటకు కూడా దిగుబడి రాదని మా అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ చాలా స్పష్టంగా చెప్పారు. కాగా, ఈ ప్రభుత్వం సుంకు రాలిపోయిన పంటను పూర్తిగా వదిలేసింది. దాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు.

● రైతులను ప్రభుత్వమే బెదిరిస్తోంది:

    మూడో వంతు పంటకు నష్టం జరిగితే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ విధానం. కానీ ఇన్‌పుట్‌ సబ్సిడీకి నమోదు చేసుకుంటే ధాన్యం సేకరించమని ప్రభుత్వం రైతులను బెదిరిస్తోంది. దీన్ని గ్రామాల్లో ప్రచారం చేయడమే కాకుండా, వాట్సాప్‌లో మెసేజ్‌లు కూడా పంపిస్తున్నారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా?. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోయినప్పుడు కనీస మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసి ఆదుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యత. కానీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది.
    ‘ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన డేటా ప్రకారం, అక్టోబరులో 26 జిల్లాల్లో సాధారణం కంటే 85 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. 18 జిల్లాల్లో లార్జ్‌ ఎక్సెస్, 7 జిల్లాల్లో ఎక్సెస్‌ కాగా, ఒక్క కర్నూలులో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఇంత నష్టం జరిగి పంటలు మునిగిపోయి రైతులు నష్టపోతే ప్రభుత్వం లెక్కలు తక్కువగా చూపిస్తోంది. మరోవైపు ఏ పంటకూ కనీస గిట్టుబాటు ధర రావడం లేదు. ఉల్లి రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకుంటామన్న మాటలు కూడా నీటి మూటలయ్యాయి.

● రైతులకు లక్ష కోట్ల లబ్ధి చేసిన జగన్‌:

    వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వ హయాంలో రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంకా సాగు చేసిన ప్రతి రైతును, ప్రతి ఎకరాను ఇన్సూరెన్స్‌ పరిధిలోకి తీసుకొచ్చిన ఘనత కూడా వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వానికే దక్కుతుంది. ఉచిత పంటల బీమా ద్వారా 5 ఏళ్లలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7802 కోట్ల పరిహారం ఇచ్చారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్‌ ముగిసే లోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చాం. అందుకోసం మొత్తం రూ.3261 కోట్లు ఖర్చు చేశారం. 2017–18, 2018–19కి గాను చంద్రబాబు బకాయిలు పెట్టిపోయిన రూ.1180 కోట్లు కూడా చెల్లించారు. ఇంకా సున్నా వడ్డీ పంట రునా పథకం కింద రూ.2,050 కోట్లు ఇవ్వడం జరిగింది. వైయ‌స్ఆర్‌ యంత్రసేవా పథకంలో రైతులకు ఇచ్చిన సబ్సిడీ రూ.366 కోట్లు కాగా, రూ.1000 కోట్లకు పైగా విలువైన యంత్రాలు పంపిణీ చేయడం జరిగింది. విత్తన సబ్సిడీ రూ.138 కోట్లు, దురదృష్టవశాత్తూ బలవన్మరణాలకు పాల్పడిన 1794 మంది రైతుల కుటుంబాలకు రూ.116 కోట్లు ఇచ్చి ఆదుకోవడం జరిగింది.

● రైతులకు ఏ అండా లేదు:

టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 18 నెలల్లో ప్రతి రెండు రోజులకు ఒక రైతు ఆత్మహత్య జరుగుతున్నట్టు పత్రికల్లో వార్తలొస్తున్నాయి. అయినా ఇంతవరకు ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదు సరికదా.. ఆ రైతుల కుటుంబాలకు పరిహారం కూడా ఇవ్వడం లేదు. ఒక పంట దెబ్బ తింటే రెండోసారి విత్తనాలు వేసుకునేలా కాంటిజెన్సీ ప్లాన్‌ను వైయస్‌ జగన్‌ అమలు చేశారు. ఇందు కోసం రూ.19 కోట్లు రైతులకు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు హయాంలో ఆ ప్లాన్‌ ఊసే లేదు. 

అందుకే ఇకనైనా కూటమి ప్రభుత్వం రైతుల బాగోగులు పట్టించుకోవాలి. అలాగే మొంథా తుపాన్‌లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని, ఏ ఆంక్షలు లేకుండా ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలని, రైతుల నుంచి మొత్తం పంటలు కొనుగోలు చేయాలని ఎంవీఎస్‌ నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు.
 

Back to Top