తాడేపల్లి: పేద విద్యార్థులకు వైద్య విద్యను, నిరుపేదలకు మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం శ్రీ వైయస్ జగన్, ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వేగంగా పనులు పూర్తి చేయడంతో, ఆయన హయాంలోనే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమై అడ్మిషన్లు కూడా కొనసాగాయి. పులివెందుల, పాడేరు కాలేజీలు కూడా దాదాపు పూర్తి కాగా, గత ఏడాది 2024–25లో అడ్మిషన్లు జరగాల్సి ఉంది. పాడేరులో షెడ్యూల్ ప్రకారం అడ్మిషన్లు జరగ్గా, పులివెందుల కాలేజీలో కూడా 50 సీట్లకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. అయితే ఆ సీట్లు వద్దంటూ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఎన్‌ఎంసీకి లేఖ రాశారు. అలా వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లారు. తన హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయని సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం అంటూ ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని నిరసిస్తూ, వైయస్పార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం పేరుతో కార్యాచరణ ప్రకటించింది. అందులో భాగమే కోటి సంతకాల సేకరణ. అసెంబ్లీ, జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు. రెవెన్యూ అధికారులకు వినతి పత్రాల సమర్పణ. ఈ ప్రక్రియలో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు నిర్వహిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే, అంత కంటే ఎక్కువగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రై వేటీకరణను నిరసిస్తూ వైయస్సార్‌పీపీ బుధవారం తలపెట్టిన నిరసన ర్యాలీల్లో కదం తొక్కేందుకు పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేథావులు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు.. అలా అన్ని వర్గాల వారు సిద్ధమవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీల్లో పాల్గొనేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదలి వస్తున్నారు. గత ప్రభుత్వంలో వైయస్ జగన్ 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, వాటిలో 5 కాలేజీలను 2023–24లోనే ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులకు అదనంగా సమకూర్చారు. ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా బలోపేతం చేశారు. ఆ తర్వాత గత ఏడాది చంద్రబాబు గద్దెనెక్కడంతో వైద్య కళాశాలలకు గ్రహణం పట్టుకుంది. 50 సీట్లతో పాడేరులో మెడికల్ కాలేజీ ఎట్టకేలకు ప్రారంభమైనా 100 సీట్లకు కోత పడింది. అలా చంద్రబాబు కక్షపూరిత విధానాలతో రెండేళ్లలో రాష్ట్రం ఏకంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయింది. లక్ష కోట్ల విలువైన సంపద లాంటి ప్రజల ఆస్తులను పచ్చ కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ పేరుతో కుట్ర చేస్తున్నారు. దీనిపై వైయస్ఆర్‌సీపీ ప్రజా ఉద్యమం పేరుతో ఉద్యమ కార్యాచరణ చేపట్టింది.