ధరలు పెంచి ప్రజలను ఆర్థికంగా దోపిడీ

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్‌

సంక్రాంతి పండుగను పేద, మధ్యతరగతి చేసుకునే పరిస్థితి లేదు

వైయ‌స్ఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు, మద్యం ధరలు విపరీతంగా పెంచి ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి,  మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ధరల పెంపు కారణంగా ఈసారి సంక్రాంతి పండుగను పేదలు, మధ్యతరగతి ప్రజలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువులతో పాటు మద్యం ధరలను కూడా విపరీతంగా పెంచిందని ఆరోపించారు. చింతపండు, కొబ్బరి, వంటనూనె, బియ్యం వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో నకిలీ, కల్తీ మద్యం తయారీ విపరీతంగా పెరిగిపోయిందని, గోవా మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని విమర్శించారు.

సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వం మద్యం ధరలను మరింత పెంచిందని మండిపడ్డారు. 180 ఎంఎల్ మద్యం ధరను రూ.10 పెంచడం ప్రజలపై అదనపు భారమని పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న ధరలతో పోలిస్తే, కూటమి ప్రభుత్వం భారీగా ధరలు పెంచిందని విమర్శించారు. అదే విధంగా, ప్రతి మద్యం షాప్‌ నుంచి ఎన్నికోట్లు లంచాలు వసూలు చేశారని, ఈ వ్యవహారంలో ఎక్సైజ్ మంత్రి, “చిన బాబు” పాత్ర ఏమిటని ప్రశ్నించారు. గతంలో సంక్రాంతికి పనికిరాని వస్తువులను వేసి భోగి మంటలు వేసుకునేవారని, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్నే భోగి మంటల్లో వేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలోనే రూ.300 కోట్ల అప్పులు చేసిందని, రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు. ఎన్నికల ముందు రామరాజ్యం తెస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు రాక్షస పాలన సాగిస్తోందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

Back to Top