కాకినాడ జిల్లా : రౌతులపూడి మండలం సార్లంకపల్లె గ్రామంలో చోటుచేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. మన్యంలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ తండాలో 38 పూరిళ్లు పూర్తిగా దగ్ధమై, సుమారు 120 మంది గ్రామస్థులు కట్టుబట్టలతో మిగిలిపోవడం అత్యంత దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంటలు దావానలంలా వ్యాపించి క్షణాల్లోనే ఊరంతా భస్మీపటలం కావడం తీవ్రంగా కలచివేసిందని వైయస్ జగన్ తెలిపారు. ఈ ఘటనలో బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తక్షణమే వసతి, ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా, ప్రతి బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించాలన్నారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని, ఆ ఇళ్లు నిర్మించి అప్పగించే వరకు తాత్కాలిక నివాసం, ఇతర అవసరమైన సహాయాన్ని పూర్తిస్థాయిలో అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైయస్ జగన్ కోరారు. ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి బాధితులను ఆదుకోవాలని, వారి జీవితాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.