తాడేపల్లి: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మైనారిటీస్ వెల్ఫేర్ డేగా నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైయస్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షులు ఖాదర్ బాషా ధ్వజమెత్తారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్న పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ముస్లిం మైనారిటీలపై దాడులకు పాల్పడుతూ ఇళ్లను కూల్చివేస్తూ మాపైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగానే చూస్తున్నారని చెప్పారు. పెళ్లిళ్లలో మా నాయకుడు జగనన్న పాటలు పెట్టుకున్నా ఈ ప్రభుత్వం ఓర్వలేకపోతోందని, జావీర్ అనే యువకుడిని పోలీసులు తీసుకెళ్లి దారుణంగా కొట్టి అక్రమ కేసు పెట్టారని వివరించారు. వినుకొండలో నడిరోడ్డు మీద రషీద్‌ను అత్యంత కిరాతకంగా నరికి చంపితే నిందితులను శిక్షించాల్సిన ప్రభుత్వం, రషీద్ కుటుంబసభ్యుల పైనే కేసులు పెట్టి వేధిస్తోందని, ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వారిని కూడా బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఇష్రత్ జహాన్ అనే పదో తరగతి బాలిక పదో తరగతిలో 600 మార్కులకు 599 మార్కులు సాధించినందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ వైయస్ జగన్ లు అభినందించినా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కనీసం స్పందించలేదని ధ్వజమెత్తారు. ఇమామ్‌లు, మౌజమ్ లకు పెండింగ్ లో పెట్టిన ఏడాది వేతనాలు తక్షణం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మైనారిటీలను అన్ని విధాలుగా వేధింపులకు గురిచేస్తున్న ఈ ప్రభుత్వానికి మైనారిటీస్ వెల్ఫేర్ డేని నిర్వహించే అర్హత లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కేసులు నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేశమంతా ఒక్కటై బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. వారు ఇంకా ఏమన్నారంటే... ● ఏ ఒక్క ఎన్నికల హామీనీ అమలు చేయలేదు: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా, మైనారిటీస్ వెల్ఫేర్ డేగా నిర్వహించుకుంటాం. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మైనారిటీస్ వెల్ఫేర్ డేను నిర్వహించిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. మైనారిటీలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చి ఉన్నా చూపించాలి. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు, పట్టణాల్లో ఈద్గాలు, ఖబరస్థాన్ లకు భూ కేటాయింపులు చేస్తామని చెప్పి పట్టించుకోలేదు. మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీని ఆదుకుంటామని చెప్పి మాటతప్పారు. అర్హత ఉన్న ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామని హామీ ఇచ్చారు. మసీదుల నిర్వహణకు డబ్బులిస్తామని చెప్పారు. ఇమామ్‌లు, మౌజన్‌లకు ఏడాది కాలంగా వేతనాలు పెండింగ్‌లో పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా పార్లమెంట్ ఉభయ సభల్లో మద్దతు తెలిపి ఏవిధంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నారో కూటమి నాయకులు సమాధానం చెప్పాలి. వక్ఫ్ భూములను కాపాడేలా మాజీ సీఎం వైయస్ జగన్ జీవో నెంబర్ 40 తీసుకొస్తే, 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. వక్ఫ్ భూములను తెలుగుదేశం నాయకులకు అప్పనంగా కట్టబెడుతున్నారు. తెలుగుదేశంలో ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులు చంద్రబాబును నిలదీయాలి. ● మైనారిటీలపై దాడులు, ఇళ్ల కూల్చివేతలు: రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మైనార్టీల మీద దాడులు ఎక్కువైపోయాయి. వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు. ఇళ్లను కూల్చివేస్తున్నారు. వినుకొండలో రషీద్‌ని అతికిరాతకంగా నడిరోడ్డుపై నరుకుతుంటే చోద్యం చూసిన ప్రభుత్వం, ఆ కుటుంబానికి న్యాయం చేయకపోగా ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చిన వారిని కూడా జైలుకు పంపించారు. ఇంత దుర్మార్గంగా ముస్లిం మైనారిటీల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వైయస్ఆర్‌సీపీకి చెందిన మైనారిటీ నాయకులను తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. పెళ్లిలో జగనన్న పాట పెట్టుకున్నందుకు జావీర్ అనే యువకుడిని పోలీసులు తీసుకెళ్లి కొట్టి అక్రమ కేసు పెట్టి వేధించారు. మైనార్టీలు స్వేచ్ఛగా పెళ్లిళ్లు కూడా చేసుకోలేని దారుణ పరిస్థితులు కూటమి పాలనలో నెలకొన్నాయి. ఇప్పటికైనా ముస్లిం మైనారిటీలపై మీ అరాచకాలను ఆపితే మంచిది. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. వక్ఫ్ భూములను ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం ఆపాలి. లేదంటే వైయస్ఆర్‌సీపీ తరఫున పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. ● బాలికను అభినందించే మనసు కూడా లేదా బాబు - ఖాదర్‌బాషా వైయస్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షులు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందనే కక్షతో కూటమి ప్రభుత్వం మైనారిటీలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతోంది. నందికొట్కూరుకు చెందిన ఇష్రత్ జహాన్ అనే విద్యార్థిని పదో తరగతిలో 600లకు 599 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఆ బాలికను ఇటీవల ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు కూడా పిలిచి అభినందించారు. అంతేకాకుండా మాజీ వైయస్ జగన్ కూడా ఆ బాలికకు అభినందనలు తెలియజేశారు. తనను కలిసినప్పుడు డాక్టర్ కావాలని ఆ బాలిక తన కోరిక వెలిబుచ్చడంతో అందుకు అండగా ఉంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆ బాలికను అభినందించడానికి సీఎం చంద్రబాబుకి మాత్రం మనసు రాలేదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆ బాలికను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వ పెద్దలకు నిజంగా మైనారిటీల పట్ల ప్రేమ ఉంటే మాటల్లో కాకుంగా చేతల్లో చూపించాలి. హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ. లక్ష ఇస్తామని చెప్పిన చంద్రబాబు, వేల సంఖ్యలో యాత్రికులు ఉండగా కేవలం 80 మందికి మాత్రమే ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనారిటీలను ద్వితీయ పౌరులుగా చూస్తున్నారు. ● ఢిల్లీ బాంబ్ దాడిని ఖండిస్తున్నాం: ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిని వైయస్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనకు కారకులైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వారికి దేశంలోని ప్రతిఒక్కరూ అండగా ఉండాలి.