తిరుమల లడ్డూ పై ఆధారాల్లేని ఆరోపణలు

లేని కల్తీ జరిగిందంటూ దుష్ప్రచారం

చివరకు దేవుడినీ రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గం

కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు ప్రభుత్వం

ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

తాడేపల్లి లోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

లడ్డూలో కల్తీ జరిగితే సిట్ వాస్తవాలు ప్రకటించాలి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల ఆరోపణలు ఎందుకు?

సిట్ ను కూడా పక్కదారి‌ పట్టించేలా లోకేష్ ట్వీట్ లు

దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దన్న సుప్రీం ఆదేశాలూ బేఖాతరు

కూటమి తీరుపై వెల్లంపల్లి తీవ్ర ఆక్షేపణ 

తాడేపల్లి: తిరుమల లడ్డూ పై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తూ.. లేని కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కేవలం వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కక్ష సాధింపు రాజకీయాల కోసం చివరకు దేవుడినీ రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. నెయ్యి నాణ్యతపై ఈవో, చంద్రబాబు, లోకేష్ లు తలో మాట మాట్లాడుతూ...  కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆక్షేపించారు. లడ్డూ ప్రసాదంపై ఆధారాలుంటే నేరుగా సిట్ అధికారులే ఆ వివరాలను ఎందుకు భయటపెట్టడం లేదని సూటిగా ప్రశ్నించారు.  అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో ఆలయాల్లో భక్తుల రక్షణలో విఫలమైన కూటమి ప్రభుత్వం...  కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఆరోపణలు చేస్తోందని తేల్చి చెప్పారు. 
ఇంకా ఆయన ఏమన్నారంటే...

● కూటమి ప్రభుత్వం కపటి ప్రేమ..

కూటమి ప్రభుత్వం హిందువులపై కపట ప్రేమ నటిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లో ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ ఆలయాల్లో జరిగిన దుర్ఘటనలతో... ఏదైనా దేవాలయాలకు వెళ్తే భద్రత ఎలా ఉంటుందో అన్న ఆందోళన భక్తుల్లో నెలకొంది. తిరుమలలో అయితే మునుపెన్నడూ లేనివిధంగా మాంసాహారం తినడం, మద్యం సేవించడం, చెప్పులతో దర్శనానికి రావడం వంటి అపచారాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడ అపచారం జరిగినా దాన్నుంచి దృష్టి మరల్చడానికి ప్రభుత్వం వెంటనే తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తీసుకురావడం అలవాటుగా మారింది. ప్రభుత్వం తన దగ్గర ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలే తప్ప అనవసరమైన ఆరోపణలు చేయకూడదు.

● ప్రసాదం కల్తీ పై పొంతనలేని ప్రకటనలు...

తమ భాగస్వామ్య పార్టీల సమావేశంలోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి స్దాయిలో ఉన్న చంద్రబాబు మాట్లాడడం చాలా బాధాకరం. ఈ ఘటన జూన్ లో జరిగిందన్న చంద్రబాబు... సెప్టెంబరు వరకు ఎందుకు నోరు విప్పలేదు? అది కూడా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సీఎం స్ధాయిలో ఉండి శ్రీ వేంకటేశ్వర స్వామితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ దిగజారేలా మాట్లాడడం సమంజసం కాదు.
ముఖ్యమంత్రి అయిన వెంటనే టీటీడీ పాలకమండలితో పాటు, ఈవోను కూడా మార్పు చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 21న అప్పటి టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావు టీటీడీలో అంతా సక్రమంగా ఉందని మాట్లాడారు. కొద్ది రోజుల తర్వాత లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ ఉందని చెపితే... సీఎం చంద్రబాబు మాత్రం యానిమల్ ఫ్యాట్ కలిసిందని.. ఇద్దరూ పొంతనలేని ప్రకటనలు చేశారు. 
కేవలం రాజకీయ దురుద్దేశ్యంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లి... వైయ‌స్ఆర్‌సీపీ ప్రతిష్టను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఈ రకమైన ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. నాలుగు లారీల నెయ్యిని వెనక్కి పంపించామని ఒకరు, లడ్డూ ప్రసాదంలో వాడామని మరొకరు పొంతనలేని ప్రకటనలు చేశారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకే తమ ప్రకటనల మీద స్పష్టత లేదు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఒక్కోసారి ఒక్కో రకమైన ప్రకటనలు చేస్తూ.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం చాలా బాధాకరం. 

● సుప్రీం కోర్టులో చంద్రబాబుకి చురకలు...

లడ్డూ వ్యవహారంపై సరైన దర్యాప్తు చేయాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు.. ఆధారాల్లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏ రకంగా ఇలా మాట్లాడుతారని సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే  ప్రశ్నించింది. ఇది వాస్తవం కాదా? వైఎస్సార్స్ కాంగ్రెస్ పార్టీ తరపున బాధ్యత తీసుకుని వైవీ సుబ్బారెడ్డి గారే లడ్డూ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే... ప్రభుత్వం తిరిగి ఆయనపైనే పొంతనలేని ఆరోపణలు చేస్తోంది. ఎల్లో మీడియాతో పాటు మంత్రి లోకేష్  సిట్ దర్యాప్తులో వాస్తవాలు బయటపడ్డాయి.... నెయ్యిలో రసాయనాలు కలిసాయని చెబుతున్నారు. సీఎం చంద్రబాబు, అప్పటి ఈవో శ్యామలరావు, మంత్రి లోకేష్ లు భిన్నమైన ప్రకటనలు చేస్తూ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారు.  
వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను అరెస్టు చేశారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. నాణ్యత పరీక్షలో భాగంగా నెయ్యి ఒక ల్యాబ్ లో విఫలమైనప్పుడు.... రెండో ల్యాబ్ లో ఎందుకు పరీక్షించలేదన్న కోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.  ల్యాబ్ రిపోర్టులో ఫెయిలైనందున ఆ నెయ్యిని తిప్పి పంపించామని ఈవో గారు చెపుతుంటే... వాటిని వాడామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే, మీ ఆధ్వర్యంలోని పాలకమండలే ఉన్నప్పుడు వాస్తవాలు చెప్పకుండా.. నోటికొచ్చినట్లు చెప్పడం ఎంత వరకు సమంజసం? 

● తిరుమల ప్రతిష్ఠను మంటగలుపుతున్న చంద్రబాబు..

ప్రజలు మీకు మీకు అధికారం ఇచ్చింది, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది.. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆరోపణలు చేస్తూ, తిరుమల పవిత్రను మంటగలపడానికా? సిట్ విచారణపై కూడా సుప్రీం కోర్టు స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చింది. సిట్ లో ఇద్దరు సభ్యులను సీబీఐ నుంచి, ఇద్దరిని రాష్ట్రం నుంచి నియమించమని చెప్పింది. కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం  విచారణ జరిపి వాస్తవాలను ఆధారాలతో సహా బయటపెట్టాల్సిన ప్రభుత్వం.. ఆ పని చేయకుండా ప్రతిరోజు తన అనుకూల మీడియాలో లడ్డూ పవిత్రత మంట కలిసేలా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయించడం సమంజసం కాదు. శ్రీవేంకటేశ్వర స్వామి మీద మీకున్న భక్తి ఇదేనా? అధికారంలో ఉండి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆరోపణలు మీరు చేయడం ఏంటి?  అధికారంలో ఉంది మీరే.. దర్యాప్తు చేసి ఆధారాలతో మాట్లాడండి.

● నెయ్యి ధరలపైనా పచ్చి అబద్దాలు...
 
ఇక వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి ధరల గురించి మాట్లాడుతూ.. రూ.320 కే కిలో స్వచ్చమైన నెయ్యి వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. 2014-19 మధ్య మీ ప్రభుత్వ హయాంలో కిలో రూ.273, రూ.306, రూ.276 లకే కొన్నారు. ఐదేళ్లలో మీరు ఇదే ధరలకు కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో మాత్రం తక్కువ ధరలకు కొన్నట్టా? చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉన్న ల్యాబ్ లోనే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కూడా పరీక్ష చేశారు. వైయస్.జగన్ హయాంలో అయితే ల్యాబ్ ను మరింత ఆధునీకరించారు. దాని మీద కూడా అపవాదులు  మాట్లాడుతూ... జరగని కల్తీ జరిగిందని మీడియాకు ఎందుకు లీకులు ఇస్తున్నారు? ప్రజల్లో ఎందుకు అపోహలు కలిగిస్తున్నారు? నేరుగా సిట్ మీడియాతోనే.. లడ్డు ప్రసాదంలో కల్తీపై మాకు ఆధారాలు దొరికాయని ఎందుకు చెప్పడం లేదు? మంత్రి నారా లోకేష్ వైయ‌స్ఆర్‌సీపీ మీద బురద జల్లుతూ ఎందుకు ట్వీట్ చేస్తున్నారు? రాజకీయాల్లోకి దేవుడ్ని లాగొద్దు. ఇది మంచి సంప్రదాయం కాదు. కలియుగ వైకుంఠం తిరుపతి తోనూ, కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి తోనూ ఎందుకు మీరు చెలగాడం ఆడుతున్నారు?
ఆధారాలంటే చెప్పే దమ్మూ, ధైర్యం లేకుండా అనవసర ఆరోపణలు చేస్తూ భక్తులను అపోహలకు గురి చేయడం సరికాదు. టీటీడీ నిర్వహణకు స్పష్టమైన విధి, విధానాలున్నాయి. వాటి ప్రకారం ఎవరైనా ముందుకు వెళ్తారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం టీటీడీని రాజకీయాలకు వాడుకోవాలని చూడ్డం సరికాదు. హిందువుల మీద కపట ప్రేమ చూపించడం తప్ప... కోట్లాది మంది భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం ఏనాడూ శ్రద్ధ చూపించలేదు.

● భక్తుల రక్షణ పట్టని ప్రభుత్వమిది..

చందనోత్సవంలో భక్తులకు సరైన ఏర్పాట్లు ఉండవు, కార్తీక మాసంలో సరైన ఏర్పాట్లు ఉండవు, పుష్కరాల్లోనూ సరైన ఏర్పాట్లు ఉండవు, కేవలం ప్రచార ఆర్భాటం తప్ప.. భక్తులు ఈ సౌకర్యాలు కల్పించామని చెప్పే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ప్రతిదాన్నీ రాజకీయం చేయడం మినహా భక్తుల కోసం చేసిందేమీ లేదు. 
లడ్డూ ప్రసాదంపై విచారణ జరిపించాలని.. వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తే... తిరిగి ఆయనపైనే ఆరోపణలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి దగ్గర పీఏగా పనిచేశారంటూ అప్పన్నను అరెస్టు చేశారు. వాస్తవానికి అప్పన్న అనే వ్యక్తి సుబ్బారెడ్డితో పాటు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి దగ్గర కూడా పనిచేశారు. మరి వారి పేర్లు ఎందుకు ప్రస్తావించడం లేదు. 

మరోవైపు ఆ రోజు ప్రసాదాల నాణ్యత కోసం నిర్దేశించిన పర్చేజింగ్  కమిటీలో సభ్యుడిగా..  ప్రస్తుతం మీ దగ్గర మంత్రిగా ఉన్న కొలుసు పార్ధసారధి ఉన్నారు. అలాగే చెన్నైకు చెందిన కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు. వీరి అనుమతితోనే ప్రసాదాలకు కావాల్సిన ముడి సరుకులు కొనుగోలు చేస్తారు. వీళ్లందరినీ వదిలిపెట్టి.. వైయ‌స్ఆర్‌సీపీలో కీలకమైన నాయకుడు కాబట్టి వైవీ సుబ్బారెడ్డిని మాత్రమే టార్గెట్ చేశారు. అధికారంలో ఉన్నది మీరే ఆధారాలతో సహా నిరూపించాలే తప్ప.. ప్రతిసారి తిరుమల పవిత్రత దెబ్బతినేలా ఆరోపణలు చేయడం సరికాదని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లేని కల్తీ జరిగినట్లు మీ అనుకూల మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడాన్ని కట్టిపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Back to Top