విజయవాడ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసి దోచుకునేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నిందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ పరిధిలోని ఫిలిం గోడౌన్ స్ట్రీట్ లో పార్టీ డివిజన్ ఇంచార్జ్ మదిరి స్వామి వివేకానంద ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేశారు. వైయస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 12న తలపెట్టిన నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈమేరకు ప్రజా ఉద్యమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ..స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా 2019లో వైయస్ జగన్ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023–24లో గత ప్రభుత్వంలోనే ప్రారంభించిందని చెప్పారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను మాజీ సీఎం వైయస్ జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూర్చారన్నారు. ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా బలోపేతం చేశారని గుర్తు చేశారు. గతేడాది చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలకు గ్రహణం పట్టుకుందని, 50 సీట్లతో పాడేరులో మెడికల్ కాలేజీ ఎట్టకేలకు ప్రారంభమైనా వంద సీట్లకు కోత పడిందన్నారు. పులివెందుల వైద్యకళాశాలకు ఎన్‌ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ, తమకు వద్దంటూ చంద్రబాబు సర్కారు అడ్డుపడి లేఖ రాసిందని గుర్తు చేశారు. చంద్రబాబు కక్షపూరిత విధానాలతో రెండేళ్లలో రాష్ట్రం ఏకంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ. లక్ష కోట్ల విలువైన సంపద లాంటి ప్రజల ఆస్తులను పచ్చ కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ వాసా ఆదినారాయణ బాబు, తదితరులు పాల్గొన్నారు.