తాడేపల్లి: దేవుడ్ని కూడా రాజకీయాల్లోకి లాగటం మంచిది కాదని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ వి ఆధారాల్లేని ఆరోపణలు అని కొట్టిపారేశారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. `తిరుమల లడ్డూ విషయంలో ఏమీ జరగక పోయినా జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు. నిజంగా లడ్డూలో కల్తీ జరిగిన ఆధారాలు ఉంటే సిట్ ప్రకటించవచ్చు కదా?. పదేపదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?. సిట్ ను కూడా పక్కదారి పట్టించేలా లోకేష్ ట్వీట్ లు పెడుతున్నారు. రాజకీయాలలోకి దేవుడ్ని లాగవద్దని సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది. అయినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బుద్ది మారలేదు. ఆలయాల్లో అపచారాలు చేసి హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ తీయవద్దు. చంద్రబాబు సర్కార్ పాలనలో భక్తులకు రక్షణ లేదు. ఆలయాలకు వెళ్తే తొక్కిసలాటలో చనిపోతున్నారు. టీటీడీలోనైతే గతంలో జరగనన్ని అపచారాలు జరుగుతున్నాయి. డైవర్షన్ కోసం వెంటనే లడ్డూ విషయాన్ని తెరమీదకు తెస్తున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించారు. ఈవో శ్యామలరావే లడ్డూ నాణ్యత బాగుందని కితాబిచ్చారు. మళ్ళీ ఆయనే స్వరం మార్చి ఆరోపణలు చేశారు. వైయస్ఆర్ సీపీ మీద ఆరోపణలు చేయటానికి వెంకటేశ్వర స్వామిని వాడుకోవటం దారుణం. తొలుత జంతువుల కొవ్వు అని చెప్పి, ఇప్పుడు మళ్ళీ రసాయనాలు కలిశాయని లోకేష్ ట్వీట్ చేశారు. ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టే స్వయంగా ప్రశ్నించింది. వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో రిట్ వేసి లడ్డూ విషయమై విచారణ కోరారు. సిట్ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. కానీ చంద్రబాబు, పవన్, లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. హిందూ భక్తుల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? . ఆధారాలు లేకుండా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? . నిజంగాఆధారాలు ఉంటే సిట్ అధికారులు ప్రెస్‌మీట్ పెట్టి ఎందుకు చెప్పటం లేదు?. కేవలం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయటం దేవుడిని రాజకీయాలలోకి ఎందుకు తెస్తున్నారు? . ఆలయాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించటం చేతకాని ప్రభుత్వం ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తోంది` అని వెలంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.