ఎవరిని అడిగి ఎన్నికలు వాయిదా వేశారు

నిమ్మగడ్డ రమేష్‌ ఇంకా చంద్రబాబే సీఎం అనుకుంటున్నారా..?

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైయస్‌ఆర్‌ సీపీదే విజయం

సీఎం వైయస్‌ జగన్‌ ఉదయించే సూర్యుడు.. ఎవరూ ఆపలేరు

ఎన్నికల వాయిదాపై ఈసీ పునరాలోచించాలి

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎవరిని సంప్రదించి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌గా నియమించిన చంద్రబాబే ఇంకా సీఎం అనుకుంటున్నారా అని నిలదీశారు. రాజ్యాంగపరమైన పదవిలో ఉండే రాష్ట్రానికి నష్టం చేకూర్చే విధంగా ఈసీ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్నాడని మంత్రి అవంతి మండిపడ్డారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది రోజులు ఓపిక పడితే 175 నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలు, మండలాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు వచ్చేవారని, ఆటోమెటిక్‌గా గ్రామాల్లో శానిటేషన్, ప్రజా సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు చూసుకునేవారన్నారు. చంద్రబాబు పుణ్యమా అని 2018 నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు లేవన్నారు. ఎన్నికల కమిషనర్‌ చెప్పే కరోనా వైరస్‌ నివారించాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటే పారిశుద్ధ్య సమస్య లేకుండా ఉంటుందన్నారు.
 
కేంద్రంతో పోరాడి నిధులు సాధించుకోవచ్చు అని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, గత ఐదేళ్లలో ఎన్నిసార్లు పోరాడి నిధులు సాధించాడో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడే ముందు ఎన్నికలు ఎప్పుడు జరిగినా నిధులు ఇప్పిస్తామని కేంద్రంతో బీజేపీ నాయకులు, పవన్‌ కల్యాణ్‌ చెప్పించగలరా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు తానా అంటే బీజేపీ నేతలు, పవన్‌ కల్యాణ్‌ తందానా అంటున్నారని మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా టూరిజం ఎక్కువగా ఉన్న గోవాలోనే 22వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయని, గోవాలో ఎన్నికలు నిర్వహిస్తుంటే.. ఎవరిని అడిగి ఏపీలో ఎన్నికలు వాయిదా వేశారో ఈసీ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికలు ఆరు వారాలు కాదు.. ఆరు నెలలు తరువాత ఎన్నికలు పెట్టినా వైయస్‌ఆర్‌ సీపీదే విజయమని మంత్రి అవంతి అన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట.. ఎన్నాళ్లు మేనేజ్‌ చేస్తాడో చూస్తామన్నారు. ఎన్నికలు వాయిదా వేయించి చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నాడని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు రాసినట్లుగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ లేఖ ఉందన్నారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషనర్‌ వాస్తవ పరిస్థితుల్లోకి రావాలని, ఎన్నికల వాయిదాపై పునరాలోచన చేయాలని సూచించారు. సీఎం వైయస్‌ జగన్‌ ఉదయించే సూర్యుడు అని, చంద్రబాబులాంటి వారు ఎవరూ అడ్డుకోలేరన్నారు.

 

Back to Top