వైయస్ఆర్ జిల్లా: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురు–శిష్యులు చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి నాశనం చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. రాయలసీమ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టిన ఈ చర్య సీమకు చేసిన ఘోర ద్రోహంగా ఆయన అభివర్ణించారు.తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని అంజాద్ బాషా అన్నారు. సోమవారం అంజాద్‌బాషా కడపలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు ఆపేశారన్న విషయం ఇప్పుడు స్పష్టమైందని చెప్పారు. రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో, శ్రీశైలం నుంచి 800 అడుగుల లోతులో ఉన్న నీటిని కూడా రాయలసీమ ప్రాజెక్టులకు తరలించాలన్న దూరదృష్టి నాటి సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డిదని గుర్తు చేశారు. వైయస్ జగన్ బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తే ఆయనకు మంచి పేరు వస్తుందన్న అసూయతోనే ఆ పథకాన్ని పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. కేవలం రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తే వరదల సమయంలో రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న ప్రాజెక్టును కావాలని నిలిపివేశారని విమర్శించారు. ఉన్న ప్రాజెక్టును వదిలేసి రూ.80 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు కడతానని చంద్రబాబు గొప్పలు చెప్పడం హాస్యాస్పదమని అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న కృష్ణా జలాలను రాయలసీమకు ఇవ్వలేని వ్యక్తి, గోదావరి జలాలను ఇస్తాననడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఈ చర్యలతో చంద్రబాబు మరోసారి తాను రాయలసీమ ద్రోహినని నిరూపించుకున్నారని అంజాద్ బాషా దుయ్యబట్టారు. రాయలసీమ ప్రజల హక్కుల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.