యర్రగొండపాలెం: టీడీపీ నాయకుల బెదిరింపులకు రియల్ ఎస్టేట్ వ్యాపారి, వైయస్ఆర్‌సీపీ ముస్లిం నాయకుడు సయ్యద్ కరీముల్లాబేగ్ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీముల్లాబేగ్, సురేష్ అనే వ్యాపార భాగస్వాములు స్థానిక పుల్లలచెరువు రోడ్డులోని పార్కుకు సమీపంలో 13.50 ఎకరాల్లో వెంచర్ వేసుకోవటానికి 2021లో చలానా కట్టి ల్యాండ్ కన్వర్షన్ చేయించారు. అందులో 4 ఎకరాలను విక్రయించి.. మరో ఎకరంలో భవనం నిర్మించి ప్రైవేటు స్కూల్‌కు అద్దెకు ఇచ్చారు. మిగిలిన భూమిలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడానికి, పక్కా భవనాలు నిరి్మంచే నిమిత్తం ఉడాకు రూ.4.70 లక్షలు చలానా చెల్లించారు. వారికి ఆ స్థలంపై అన్ని హక్కులు ఉన్నప్పటికీ టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ ఆ పార్టీ వర్గీయులు వారిని వేధింపులకు గురిచేస్తూ వచ్చారు. సంక్రాంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎడ్ల పందేలు నిర్వహించేందుకు ఆ స్థల యజమానుల అనుమతులతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిని సహించని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ఉడా చైర్మన్ షేక్ రియాజ్‌ను రంగంలోకి దించారు. ఎరిక్షన్‌బాబు, రియాజ్ మరి కొంతమంది టీడీపీ నేతలు కరీముల్లాబేగ్‌కు చెందిన భూముల్లోకి వెళ్లి వివరాలు అడిగారు. ఆ స్థలాలకు సంబంధించి తాను అన్ని అనుమతులు తీసుకునే భవన నిర్మాణం చేశానని కరీముల్లాబేగ్ వివరించారు. సంతృప్తి చెందని టీడీపీ నేతలు రూ.1 కోటి విలువైన కట్టిన భవనాన్ని కూల్చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో కరీముల్లాబేగ్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఉడా చైర్మన్‌తోపాటు టీడీపీ వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే అక్కడే ఉన్న సిమెంట్ బల్లపై కూలబడిపోయాడు. ఆ సమయంలో ఎడ్ల పందెం నిర్వహించే స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వెంటనే తన కారులో స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం వెంటనే గుంటూరులోని ఆస్పత్రికి తరలించాలని సూచించడంతో హుటాహుటిన గుంటూరు తీసుకెళ్లారు. ధన దాహంతోనే వేధింపులు ఈ ఘటనపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అన్ని అనుమతులతో పనులు చేపడుతున్న విషయం టీడీపీ ఇనచార్జి ఎరిక్షన్‌బాబుకు తెలిసినా ధనదాహంతో ఆ భూములపై దాడులు చేయించి కరీముల్లా బేగ్‌ను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అధికారుల ప్రమేయం లేకుండా ఉడా చైర్మన్ తనిఖీలు ఏ విధంగా చేపట్టారని. ఆయన టీడీపీ నాయకులను వెంటేసుకుని రావడం ఏమిటని ప్రశి్నంచారు. ధనదాహంతో ఎరిక్షన్‌బాబు జనాలను పీడిస్తున్నాడని చెప్పారు.