చిన్న ఎన్నికలోనే ప్రజాస్వామ్యానికి ఖూనీ

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వపు దురహంకారానికి మరో నిదర్శనం ఎంపీపీ ఉప ఎన్నిక‌

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఫైర్‌

తాడేప‌ల్లి: ఒక చిన్న ఎంపీపీ ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేయడం దేశంలోనే అరుదైన ఘటన అంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు . ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతికి బదులుగా బలప్రదర్శన వేదికగా మార్చిన చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, తన అసలు స్వభావాన్ని మరోసారి బట్టబయలు చేసింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. అధికార మత్తుతో ప్రజల ఓటు హక్కును అడ్డుకోవడం, భయాందోళన వాతావరణం సృష్టించడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయాయంటూ ఫైర్ అయ్యారు. ఇవాళ రెండు చోట్ల జ‌రిగిన ఎంపీపీ ఉప ఎన్నిక‌లో టీడీపీ నేత‌ల రౌడీయిజాన్ని ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఎండ‌గ‌ట్టారు. 

ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న సంఘటనలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఎంపీపీ ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్తున్న వైయస్సార్‌సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడం, వారిపై దాడి చేయడం అత్యంత దారుణం. ఈ దాడుల్లో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడగా, మరో సభ్యుడిని కిడ్నాప్ చేయడం, మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యంపై చేసిన బహిరంగ దాడిగా భావించాలి.

ఈ చర్యల వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం — ఎంపీపీ ఎన్నికలో వైయస్సార్‌సీపీ సభ్యులు ఓటు వేయకుండా అడ్డుకోవడం. బలప్రయోగంతో భయాందోళన వాతావరణం సృష్టించి, ప్రజల ఓటు హక్కును హరించడం ద్వారా ప్రజాస్వామ్య స్వరాన్ని అణిచివేయాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఒక పథకం ప్రకారం జరిగిన ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రయత్నమే.

ఇలాంటి సంఘటనల సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ, టీడీపీకి అనుకూలంగా కీలుబొమ్మల్లా వ్యవహరించడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తూ, చట్టాన్ని పక్కన పెట్టిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కోల్పోయేలా చేస్తోంది.

ఇదే తరహా పరిస్థితి రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలంలో కూడా చోటు చేసుకుంది. అక్కడ కూడా వైయస్సార్‌సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి, దూరంగా ఉంచడం ద్వారా ఎన్నికను తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు మూగ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ, ఎంపీపీ ఎన్నికను బలవంతంగా పూర్తి చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేయడం, బహిరంగంగా దాడులు చేయడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం — ఇవన్నీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణంగా మారిపోయాయి.

దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఎన్నికలోనే ప్రజాస్వామ్య పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఈ ప్రభుత్వం ఎంత స్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందో, ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మారిందో స్పష్టంగా తెలుస్తోంది.

ఇది కేవలం ఒక ఎంపీపీ ఎన్నిక కాదు — రాష్ట్ర ప్రజాస్వామ్యానికి పెట్టిన పరీక్ష. ఆ పరీక్షలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అంటూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో టీడీపీ నేత‌ల అరాచ‌కాలకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు.

https://x.com/i/status/2008175058301440322

Back to Top