ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకం

ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేయడం అతి హేయం

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.

వింజమూరు, బొమ్మనహళ్లి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ 

ఆరు నెలల పదవీకాలం ఉన్నా, ఎంపీపీల గెలుపునకు బరితెగింపు

ఎంపీటీసీ సభ్యులను పట్టపగలే కిడ్నాప్‌ చేసి ఎత్తుకెళ్లారు

పోలీసుల కళ్లెదుటే కిడ్నాప్‌ జరిగినా, పట్టించుకోని ఖాకీలు

రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కళ్లుండీ గుడ్డిదానిలా వ్యవహారం

ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆక్షేపణ

తాడేపల్లి: రెండు ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకం పరాకాష్టకు చేరిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. కేవలం ఆరు నెలల పదవీ కాలం కోసం ఎంపీటీసీ సభ్యులను పట్టపగలే కిడ్నాప్‌ చేయడం దారుణమని ఆయన ఆక్షేపించారు. వింజమూరు, బొమ్మనహళ్లి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు రౌడీయిజానికి దిగితే పోలీసులు చోద్యం చూస్తూ నిలబడిపోయారని విమర్శించారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో సైతం ‘రెడ్‌ బుక్‌ రాజ్యాంగం’ అమలవుతోందని ఆక్షేపించారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కళ్లుండీ గుడ్డిదానిలా వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు.  
ప్రెస్‌మీట్‌లో లేళ్ల అప్పిరెడ్డి ఏమన్నారంటే..:

ఆరు నెలల పదవి కోసం ఇంత కక్కుర్తి అవసరమా?:
    అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్‌ను సీఎం చంద్రబాబు అరాచకంగా, అప్రజాస్వామికంగా పాలిస్తున్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగం కాకుండా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగమే రాష్ట్రంలో అమలవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ ఎన్నికలోనూ ప్రజా ప్రతినిధులు స్వేచ్ఛగా ఓటు వేయలేదు. వింజమూరు, బొమ్మనహళ్లి ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడింది. కేవలం ఆరు నెలల పదవికాలం కోసం ఎంపీటీసీలను ఎత్తుకెళ్లడం, కిడ్నాప్‌ చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. గత వైయస్‌ఆర్‌సీపీ పాలనలో ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎప్పుడూ లేవు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది?:
    వైయస్‌ఆర్‌సీపీ రెండు చోట్ల ఓడిపోయినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదు. కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తూ, ప్రజా ప్రతినిధులను కిడ్నాప్‌ చేస్తుంటే రాష్ట్రంలో వ్యవస్థలు పని చేయడం లేదా?  అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కళ్లుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని స్థితికి వెళ్లింది. నెల్లూరులో మహిళా ఎంపీటీసీ సభ్యురాలిని గౌరవం లేకుండా లాక్కెళ్లిన ఘటనను పోలీసులు చూస్తూ నిలబడ్డారు. బొమ్మనహల్లిలో మెజారిటీ ఎంపీటీసీలు వైయస్సార్‌సీపీకి చెందిన వారైనా, బలవంతంగా టీడీపీ అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించారు. 

చట్ట వ్యతిరేకులకు శిక్ష తప్పదు:
    ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం అంతా కలసికట్టుగా మా పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ముందుకు సాగుతున్నాం. టీడీపీ నేతల ఒత్తిళ్లకు లోబడి అధికారులు అక్రమాలకు పాల్పడితే, వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా తప్పనిసరిగా చర్యలు ఉంటాయి.
    ఇప్పటికే పార్టీ తరఫున డిజిటల్‌ బుక్‌ ప్రారంభించి, ఎక్కడెక్కడ ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారో, వైయస్సార్‌సీపీ కార్యకర్తలను ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో అన్ని వివరాలు డిజిటల్‌ బుక్‌లో నమోదు చేస్తున్నాం. ఇది ప్రతీకార రాజకీయం కోసం కాదని, కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అన్నది గుర్తు పెట్టుకోవాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.

Back to Top