తిరుపతి. అనంతపురం. నంద్యాల: చంద్రబాబుతో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ద్రోహం మరోసారి బట్టబయలైందని వైయస్సార్సీపీ రాయలసీమ నేతలు సాకె శైలజానాథ్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వేర్వేరు ప్రెస్‌మీట్లలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నుంచి మీడియాకు వీడియోను రిలీజ్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ రాయలసీమ ప్రాంతం నష్టపోతూనే ఉందని వైయస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చేసుకున్న రహస్య ఒప్పందం వివరాలను వెంటనే ప్రజల ముందుంచాలని భూమన కరుణాకర్‌రెడ్డి, సాకే శైలజానాథ్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమకు చంద్రబాబు ద్రోహంపై ఏయే నేత ఏం మాట్లాడారంటే..: రాయలసీమ ప్రజల కళ్లల్లో చంద్రబాబు కారం కొట్టాడు :భూమన కరుణాకర్‌రెడ్డి. వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. – తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి అసలు కారణం చంద్రబాబు నాయుడే అని స్పష్టమైంది. తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాయలసీమను తాకట్టు పెట్టడానికి కూడా సిద్దపడి పోయాడు. రాయలసీమ ప్రాంతానికి ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు చేసిన ద్రోహానికి ఈ ప్రాంత వాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని నాడు జగన్‌గారు కృషి చేస్తే, పర్యావరణ అనుమతులు లేవంటూ ఇన్నాళ్లూ చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేశారు. కేవలం రేవంత్‌రెడ్డి ప్రయోజనాలు కాపాడటం కోసం రాయలసీమ ప్రజల కళ్లలో కారం కొట్టారు. రాయలసీమ ప్రాంతంలో పుట్టినా, ఏనాడూ ఆ ప్రాంత అభివృద్ధి కోసం చంద్రబాబు ఆలోచన చేయలేదు. రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే దివంగత మహానేత వైయస్సార్ గారి పోరాటాల ఫలితంగానే జరిగింది. గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయంటే అది ఖచ్చితంగా వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారి కృషి ఫలితంగానే. ఆయన వారసుడిగా రాయలసీమ ప్రాంత సాగునీటి రంగానికి వైయస్ జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్‌ను మొదలుపెట్టారు. రాయలసీమ రైతుల కన్నీళ్లను తుడిచే ప్రాజెక్టును వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టిన చంద్రబాబుపై పార్టీలకు అతీతంగా రాయలసీమ వాసులంతా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో రేవంత్‌తో చేసుకున్న ఒప్పందాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి :సాకే శైలజానాథ్. మాజీ మంత్రి – తాను కోరడం వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపేశాడని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడమే కాకుండా నిజనిర్దారణకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఆంధ్రాలో రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఆపేయడంతో పాటు తెలంగాణలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కొనసాగించడానికి ఏపీ నుంచి ఎలాంటి అడ్డు చెప్పకుండా చంద్రబాబుని ఒప్పించానని అర్థం వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారంటే.. వీరి మధ్య కుదిరిన ఆ రహస్య ఒప్పందం ఏంటో తెలుగు ప్రజలకు తెలియాలి. కాబట్టి, ఇప్పటికైనా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాయలసీమ ప్రాంతానికి నష్టమే జరుగుతోంది. రాయలసీమ భవిష్యత్తును చంద్రబాబు కాలరాస్తున్నాడు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబుకి అవగాహనే కాదు, కనీసం ఆసక్తి కూడా లేదు. రాయలసీమను నిట్టనిలువునా ముంచిన వ్యక్తి చంద్రబాబు. కాంట్రాక్టర్లకు డబ్బులు ధారపోయడం తప్పించి రాయలసీమలో కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇచ్చింది లేదు. గాలేరు నగరి నుంచి హంద్రీనీవా లింక్ పూర్తి చేస్తే అనంతపురం జిల్లాకు నీటి కష్టాలకు కొంతమేర పరిష్కారం లభిస్తుందని తెలిసినా చంద్రబాబు మాత్రం పెండింగ్‌లో ఉన్న రెండు మూడు కిలోమీటర్ల పనులు కూడా పూర్తి చేయడం లేదు. రూ.500 కోట్లు ఖర్చు చేస్తే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిసినా 19 నెలలుగా తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఇవన్నీ చేస్తే వైయస్ జగన్‌కి మంచి పేరొస్తుందనే భయంతోనే సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు పూర్తి చేయడం లేదు. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారీ రాయలసీమకు నష్టమే :కాటసాని రాంభూపాల్‌రెడ్డి. వైయస్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు. – తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబే ఆపేశాడని స్పష్టమైపోయింది. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కుమ్మక్కై ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కారు సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడానికి రేవంత్‌తో కుదుర్చుకున్న ఒప్పందమే కారణమని తేలిపోయింది. చంద్రబాబు రాయలసీమలో పుట్టి నాలుగో పర్యాయం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా ఏనాడూ రాయలసీమ ప్రయోజనాల గురించి ఆలోచన చేయకపోగా, ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడమే ధ్యేయం అన్నట్టుగా పనిచేస్తున్నాడు. రోజూ 3 టీఎంసీలు తరలించేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వైయస్ జగన్ గారు శ్రీకారం చుడితే చంద్రబాబు సీఎం అయ్యాక దాన్ని పూర్తిగా పక్కనపెట్టేసి రాయలసీమ ప్రజలకు తీరని ద్రోహం చేశాడు. ఇప్పటికైనా ఈ ప్రాంత టీడీపీ నాయకులు మేల్కొని ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలి.