అనంతపురం: రాయలసీమ ఎత్తిపోతల పథకాలను పూర్తిగా నిలిపివేసి ప్రాంతానికి తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడును మంత్రులు “అపర భగీరథుడు” అంటూ కీర్తించడం ప్రజలను మోసం చేయడమేనని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ విమర్శించారు. రెండుసార్లు శంకుస్థాపన చేసి హంద్రీనీవా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు తగ్గించిన వ్యక్తిని ఎలా గొప్పవాడిగా చెప్పగలరని ప్రశ్నించారు. ఒకప్పుడు హంద్రీనీవానే సాధ్యం కాదని హేళన చేసిన వ్యక్తి చంద్రబాబేనని గుర్తుచేశారు. సోమవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడూ ముఖ్యమంత్రి అయినా రాయలసీమకు నష్టమే జరిగిందని, సాగునీటి ప్రాజెక్టులపై ఆయనకు కనీస ఆసక్తి కూడా లేదని శైలజానాథ్ ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందన్న భయంతోనే తెలంగాణలో తన అనుకూల వర్గాలతో కేసులు వేయించి ప్రాజెక్టును అడ్డుకున్నారని అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు కూడా బలహీన వాదనలు వినిపించి ప్రాజెక్టును నిలిపివేయాలనే కుట్ర చేశారని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టం జరుగుతుందని నాటి సీఎం వైయస్ జగన్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, ఆ ప్రాజెక్టును ఆపాలని తీర్పు వచ్చిందని, భారీ పెనాల్టీ కూడా విధించబడిందని చెప్పారు. అయినా ఆ ప్రాజెక్టు కొనసాగుతున్నా చంద్రబాబు అభ్యంతరం చెప్పకపోవడం వెనుక రహస్య ఒప్పందమేనని అనుమానం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతలకు కేవలం పర్యావరణ అనుమతులు తీసుకోవాలని మాత్రమే ట్రిబ్యునల్ చెప్పినా, చంద్రబాబు పూర్తిగా ఆపేశారని విమర్శించారు. రాయలసీమ నుంచి హైకోర్టు, ఎయిమ్స్, లా యూనివర్సిటీ, గ్రామీణ బ్యాంకును అమరావతికి తరలించి, ఉక్కు పరిశ్రమను అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబేనని శైలజానాథ్ మండిపడ్డారు. గాలేరు–నగరి నుంచి హంద్రీనీవా లింక్ పూర్తి చేస్తే అనంతపురం జిల్లాకు నీటి సమస్యలు తీరతాయని తెలిసినా పెండింగ్ పనులు కూడా పూర్తి చేయడం లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు రూ.500 కోట్లతో పూర్తవుతుందన్నా 19 నెలలుగా పనులు చేయకపోవడం జగన్‌కు పేరు వస్తుందన్న భయమే కారణమన్నారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ ఇచ్చినందువల్లే రైతులు ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారని, ఆ నిర్ణయాన్ని అప్పట్లో వ్యతిరేకించిన చంద్రబాబు నేడు రైతు పక్షపాతి అని చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు. రాయలసీమలో జలకళ కనిపిస్తోందంటే అది వైయస్ఆర్ ఆలోచనల ఫలితమని, వాటిని వైయస్ జగన్ తన పాలనలో కొనసాగించారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి అనంతపురం జిల్లాకు చేసిన ఒక్క మంచి పని అయినా చూపించాలని సాకె శైలజానాథ్ సవాల్ విసిరారు.