అనంతపురం : రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలంలో ఈ నెల 5న జరగనున్న ఎంపీపీ ఎన్నికను సజావుగా నిర్వహించాలని కోరుతూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదివారం ఇన్‌చార్జ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావును కలిశారు. వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు మెట్టు గోవిందరెడ్డి, తలారి రంగయ్య, వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ మాధవ్‌తో పాటు ఇతర వైయస్ఆర్‌సీపీ నాయకులు ఈ సందర్భంగా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. బొమ్మనహాల్ మండలంలో ఎంపీపీ స్థానానికి సంబంధించి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి బీ-ఫారం, ఇతర పత్రాలు సమర్పించేందుకు శనివారం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన పార్టీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి సహా వైయస్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ నాయకులు భౌతిక దాడికి పాల్పడ్డారని వారు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ, సీఐలు అక్కడే ఉన్నప్పటికీ దాడిని అడ్డుకోలేదని, అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు దిగారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నిక జరిగినా అప్రజాస్వామిక పద్ధతిలోనే సాగుతోందని అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఎంపీపీ ఎన్నిక ఉన్న నేపథ్యంలో మా పార్టీ నేతలు బీ-ఫారం ఇవ్వడానికి వెళ్తే టీడీపీ గూండాలు దాడులకు దిగడం దారుణమన్నారు. ఈ నెల 5న జరగనున్న ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని తాము కోరుతున్నామని తెలిపారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులను కలవాలని స్థానిక పోలీసులే సూచించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఎంపీటీసీలను కూడా అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రామగిరి, కదిరి నియోజకవర్గాల్లో ఎంపీపీ ఎన్నికల్లో, అలాగే కళ్యాణదుర్గం మునిసిపాలిటీల్లో కూడా అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని గుర్తు చేశారు. కేవలం నాలుగు నుంచి ఐదు నెలల కాలపరిమితి ఉన్న స్థానాల కోసమే అధికార పార్టీ ఇంత దిగజారడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అవినీతి, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న బొమ్మనహాల్ ఎంపీపీ ఎన్నికను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని వైయస్ఆర్‌సీపీ నేతలు ఇన్‌చార్జ్ అడిషనల్ ఎస్పీని కోరారు.