తిరుపతి: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనకు తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి నాయకత్వం వహించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. నిరసనలో భాగంగా “సీఎం చంద్రబాబు డౌన్ డౌన్” అంటూ భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, సుబ్రమణ్యం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాయలసీమకు జీవనాధారమైన ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం ద్వారా రైతులు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించిన వైయస్ఆర్‌సీపీ నేతలు, తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు.