చంద్రబాబు రైతు ద్రోహి

వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

వైయస్ఆర్ జిల్లా:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రైతు ద్రోహి అంటూ వైయస్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.  రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలపై  ఆయ‌న‌ స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాలరాస్తూ, రాయలసీమతో పాటు నెల్లూరు ప్రాంత రైతుల గొంతు కోసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాయలసీమ, నెల్లూరు రైతులపై జరిగిన ఈ అన్యాయాన్ని దాచిపెట్టేందుకు తప్పుడు కారణాలతో వార్తలు ప్రచురిస్తున్న ఆంధ్రజోతి పత్రిక క‌థ‌నాల‌ను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ‌ప్రసాద్‌రెడ్డి ఆ పత్రిక ప్ర‌తుల‌ను దహనం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు సహించబోమని, రైతుల హక్కుల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

2019 నుంచి 2024 వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూ. 3,850 కోట్ల వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్లిందని రాచమల్లు గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా సీమ రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కీలక పథకాన్ని పూర్తిగా ఎత్తివేసిందని మండిపడ్డారు.  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసిందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆక్షేపించారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను ఆధారంగా తీసుకొని, నిజానిజాలు తేల్చేందుకు కమిటీ వేసి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top