రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకోవడం ద్రోహం

చంద్ర‌బాబు తీరుపై ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తీవ్ర విమర్శలు

వైయ‌స్ఆర్‌ జిల్లా : రాయలసీమ రైతుల త్రాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చేందుకు నాటి సీఎం వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్ర‌బాబు కావాలని అడ్డుకోవడం రైతులకు చేసిన ఘోరమైన ద్రోహమని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ పోరుమామిళ్లలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ రైతుల సంక్షేమం మరియు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే నాటి సీఎం వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కావాలని అడ్డుకుని నిలిపివేయడం చంద్రబాబు నాయుడు చేసిన ఘోరమైన రైతాంగ ద్రోహమని తీవ్రంగా ఖండించారు. చంద్ర‌బాబు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ స్వార్థంతో ఈ ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతార‌ని అన్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని, ఈ పథకం అమలులో ఉంటే గాలేరు–నగరి, తెలుగు గంగ, కేసీ కెనాల్‌ల ద్వారా రాయలసీమకు స్థిరమైన సాగునీరు అందేదని పేర్కొన్నారు. రైతుల హక్కుల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని డీసీ గోవిందరెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రహస్య ఒప్పందాలు చేసుకుని రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని, ఇది కరువు నేలపై రాసిన మరణశాసనంతో సమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి స్వార్థ రాజకీయాల కోసం సొంత రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దేశ చరిత్రలోనే అరుదైన దుర్మార్గ చర్యగా అభివర్ణించారు.

చంద్రబాబు పాలన వల్లే రాష్ట్రం అల్మట్టి రూపంలో శాపాన్ని ఎదుర్కొందని, అలాగే కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం తన చేతుల్లోకి తీసుకుని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చరిత్ర కూడా ఆయనదేనని డీసీ గోవిందరెడ్డి గుర్తు చేశారు. శ్రీశైలం నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు పూర్తి స్థాయిలో నీరు అందాలంటే డ్యాం నీటిమట్టం 875 అడుగులు ఉండాలని, కనీసం 840 అడుగులుంటేనే హంద్రీనీవాకు నీరు చేరుతుందని వివరించారు.

అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల నుంచే నీటిని ఎత్తిపోసేందుకు పలు ప్రాజెక్టులు చేపట్టి, డ్యాం నిండకుండానే విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని ఖాళీ చేస్తుండటంతో రాయలసీమకు తాగునీరు, సాగునీటి కొరత తీవ్రంగా మారిందని అన్నారు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రయోజనాలు, రాయలసీమ హక్కులను కాపాడేందుకు రూ.3,600 కోట్లతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించి, శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించేలా పనులు వేగంగా చేపట్టారని తెలిపారు.

ఈ పథకం పూర్తయితే గాలేరు–నగరి, తెలుగు గంగ, కేసీ కెనాల్‌ల ద్వారా రాయలసీమ రైతులకు స్థిరమైన సాగునీరు అందడంతో పాటు ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడేదని చెప్పారు. అయితే జగన్ గారికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కేసులు వేయించి పనులు అడ్డుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయడం తీరని ద్రోహమని మండిపడ్డారు.

ఇప్పటికే వేల కోట్ల రూపాయల పనులు పూర్తై, వందల కోట్ల బిల్లులు చెల్లించినప్పటికీ ప్రాజెక్టును ఆపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దీనిని తెలంగాణ శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించడం ద్వారా నిజం బయటపడిందన్నారు. రాయలసీమ రైతులకు మేలు చేయలేని చంద్రబాబు, వారి హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టి రాజకీయ స్వార్థానికి పనిచేశారని, ఈ రైతాంగ ద్రోహాన్ని రాయలసీమ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి స్పష్టం చేశారు.

Back to Top