వైయ‌స్‌ జగన్‌కు మంచి పేరు వస్తోందనే చంద్ర‌బాబుకు అసూయ

అందుకోస‌మే సీమ ఎత్తిపోతల పథకాలన్ని అడ్డుకున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫైర్

నంద్యాల జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సీఎం నారా చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో మంచి పేరు వస్తోందనే అసూయతోనే చంద్రబాబు రాయలసీమకు ఎంతో కీలకమైన ఎత్తిపోతల పథకాన్నిఅడ్డుకుంటున్నారని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాయలసీమ ప్రజల త్రాగునీటి, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకాలను కావాలని నిలిపివేసి సీమను మళ్లీ కరువులోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు. ఇది రాయలసీమ అభివృద్ధికి వ్యతిరేకంగా తీసుకున్న దుర్మార్గపు నిర్ణయమని, ప్రజల జీవనాధారాలపై దాడితో సమానమని వ్యాఖ్యానించారు. బనగానపల్లె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సోమ‌వారం త‌న స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీఎం నారా చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయలసీమకు సంబంధించిన కీలక అంశాల్లో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు తీరని ద్రోహానికి నిదర్శనమని ఆయన ధ్వ‌జ‌మెత్తారు.

సీమ ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టే ఆధికారం ఎవ‌రిచ్చారు?
రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టుపెట్టే అధికారం చంద్ర‌బాబుకు ఎవ‌రిచ్చార‌ని కాట‌సాని రామిరెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. సీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాజకీయ కక్షతో వ్యవహరించడం సరికాదని హెచ్చరించిన ఆయన, ఈ వైఖరిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాయలసీమ హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజల తరఫున చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాటసాని రామిరెడ్డి స్పష్టం చేశారు.

చీకటి ఒప్పందాల ద్వారా రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని, ఇది సీమ ప్రజలపై చేసిన ఘోరమైన అన్యాయమని కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు. వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తోందనే అసూయతోనే సీమ ఎత్తిపోతల పథకాలపై చంద్రబాబుకు అక్కసు పెరిగిందని విమర్శించారు.  విద్యుత్ పేరుతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ను తెలంగాణ ఖాళీ చేస్తుంటే కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదని, ఇది రాష్ట్ర ప్రయోజనాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆక్షేపించారు.  చంద్రబాబు పాలన రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమకు వెన్నుపోటు లాంటిదని, కరువు నేలకు మరణ శాసనం రాస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురుదక్షిణ ఇవ్వాల్సిన శిష్యుడే గురువుకే పంగనామాలు పెట్టినట్లుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు వ్యవహారం ఉందని ఆరోపించారు. రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం అయినా ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని కాటసాని రామిరెడ్డి సూచించారు. సీమ హక్కుల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండం సూర్య ప్రకాశ్ రెడ్డి, సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, అంబటి రవికుమార్ రెడ్డి, సన్నల జనార్దన్ రెడ్డి, లక్కిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top