తాడేపల్లి: సీఆర్‌డీఏ ప్రాంతంలో మరో ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పేదల ఇళ్ల కార్యక్రమానికి టీడీపీ అడ్డంకులు సృష్టించిందని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందన్నారు.పేదల ఆవేదన తెలిసిన వ్యక్తిగా వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు సైతం సమర్ధించాయన్నారు. ఇవాళ వేలాది మందికి ఇళ్ల మంజూరు పత్రాలు సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా అందించామన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఏమన్నారంటే.. అక్కడ ఇళ్లు కాదు. ఊళ్లు: – అన్ని సామాజిక వర్గాలు కలిసి కట్టుగా ఉండాలనే ఆలోచన ఏనాడూ టీడీపీ ప్రభుత్వం చేయలేదు. – ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నా.. అన్నింటినీ ఆ పార్టీ కేవలం ఓటు బ్యాంక్‌గానే పరిగణిస్తుంది. – దానికి భిన్నంగా జగనన్న ప్రభుత్వం అమరావతిలో ఇళ్లు కాదు.. ఏకంగా ఊళ్లు నిర్మిస్తోంది. – రెండు నెలల క్రితమే అక్కడ ఇంటి పట్టాలిచ్చాం. ఈరోజు ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాం. – ఆరు నెలల్లో అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి చూపుతాం. – రాష్ట్ర వ్యాప్తంగా 17వేల జగనన్న లేఅవుట్లు, 71,811 ఎకరాలు, 30.65 లక్షల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఉచితంగా అందించాం. – మార్కెట్లో దాని విలువ 76 వేల కోట్ల నుంచి 80 వేల కోట్ల వరకు ఉంటుంది. – సుమారు 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని పేదలకు అందించగలిగాం. – దేశంలోనే ఏపీ ఈ విషయంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. సింగపూర్ కంపెనీకి ధారాదత్తం: – ఇక్కడున్న దళిత, బడుగు బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చంద్రబాబుకు నాడు మనసు రాలేదు. కానీ సింగపూర్ కంపెనీకి మాత్రం భూములు కట్టబెట్టారు. – ఈ మహాయజ్ఞాన్ని ముందు తీసుకెళుతున్న క్రమంలో అడుగడుగునా టీడీపీ వారు రైతుల ముసుగులో అడ్డంకులు సృష్టించారు. – ఇక్కడ పెత్తందార్లు మాత్రమే ఉండాలి.. పేదలకు భూములిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందంటూ దుర్మార్గమైన ఆలోచన చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా..: – పేదలందరికీ మంచి జరగాలని, వారి భవిష్యత్తు బాగుండాలని రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. – ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి, రాజధానిలో పేదలకు పెద్ద పీట వేశారు. – అమరావతిలో కేవలం పెత్తందార్లే ఉండాలన్న దుష్ట సంకల్పాన్ని ఛేదిస్తూ నేడు పట్టణ ప్రాంత అక్క చెల్లెమ్మల ఇళ్ల నిర్మాణ పండుగ జరిగింది. – జగనన్న మంచి సంకల్పం ముందు దుష్టశక్తులు ఎల్లోమీడియా.. దుష్ట చతుష్టయం ఎన్ని పన్నాగాలు పన్నినా నిలువలేకపోయారు. – పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఈ రోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశం. – సీఆర్డీఏ పరిధిలో ఆర్–5 జోన్ ఏర్పాటు చేసి 1400 ఎకరాల భూములను పేద బడుగు బలహీన దళిత వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చట్టంలో పొందుపరిచాం. – ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆనాడు చంద్రబాబు ఏ మాత్రం ఆలోచించలేదు. జగన్‌గారి సంకల్పబలం ముందు..: – అమరావతిలో పేదలకు సెంటు భూమిని ఇస్తాం అంటే టీడీపీ సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. – ధర్నాలు చేశారు.. ఎల్లో మీడియాలో రకరకాల కథనాలు రాయించారు. విపరీతంగా దుష్ప్రచారం చేశారు. – వాస్తవాలను వక్రీకరిస్తూ కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. – కానీ కోర్టులు కూడా పేదల పక్షాన నిలిచిన విషయం గుర్తుంచుకోవాలి. – ప్రతి ఒక్కరికీ ఇళ్లుండాలి అనేదే జగన్ గారి ఆకాంక్ష. పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తికే ఇంటి నిర్మాణం విలువ తెలుస్తుంది. – జగన్‌గారు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కూడా సమర్ధించింది. పూర్తి మౌలిక వసతులతో కొత్త గ్రామాలు: – ఆర్–5 జోన్‌లో 25 లేఅవుట్లలో 50వేల పైచిలుకు పట్టాలను ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని పేదలకు పట్టాలుగా పంపిణీ చేశాం. – ఒక్కొక్కరికి వారి సెంటు భూమిలో ఇళ్లు కట్టిస్తాం.. అంటే చంద్రబాబు సెంటు భూమిలో సమాధులు కట్టించుకోండి అన్నాడు. – అన్ని మౌలిక వసతులు సమకూరుస్తూ.. 25 లేఅవుట్లలో ఇళ్లు నిర్మించేలా ఈరోజు భూమిపూజ, శంకుస్థాపన చేశాం. – దీన్ని అడ్డుకోవాలని నిన్న రాత్రి వరకూ దుష్టశక్తులు ప్రయత్నించాయి. కానీ జగన్ గారి సంకల్పం గొప్పది కాబట్టి ఈరోజు ఒక పండుగ జరిగింది. – కేవలం 5 రోజుల్లోనే షియర్ టెక్నాలజీతో నిర్మించిన ఇంటిని మొదటి లబ్ధిదారునికి జగన్‌గారు అందించారు. – ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు పడుతున్న అడుగులు ప్రజలంతా గమనించాలి. – మరో ఆరు నెలల్లో రాజధాని ప్రాంతంలో పూర్తి మౌలిక వసతులతో కొత్త గ్రామాలు రాబోతున్నాయి. ఆయన సినిమాల్లోనే హీరో..: – దీంతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు. అందుకే విష ప్రచారం చేస్తూ వ్యవస్థల మీద పడుతున్నారు. – గంతకు తగ్గ బొంతలా పవన్‌కల్యాణ్ చేస్తున్న అర్ధరహిత వాదనలు చేస్తున్నాడు. – డేటాను దొంగిలిస్తున్నారంటూ పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు. – దానిపై అవగాహన లేక, ఎవరో చెప్పింది విని ఏదో రకంగా బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. – సినిమాల్లోనే ఆయన హీరో. కానీ రాజకీయాల్లో ఒక కమెడియన్. – ఈ కామెడీ రోల్ రేపు ఒక పిచ్చిగా మారే అవకాశం కూడా ఉంది. – రాజకీయ పార్టీ అంటే దానికి కొన్ని సిద్దాంతాలు ఉంటాయి. – కానీ, పవన్ పార్టీకి అవేవీ లేవు. చంద్రబాబు చెప్పిందే ఆయన చేస్తున్నారు. టిడ్కో ఇళ్లపై అసత్య ప్రచారం: – టిడ్కో ఇళ్లపై సెల్ఫీ ఛాలెంజ్ అంటారు. తామే నిర్మించాం అంటారు. – నిజానికి ఆ ఇళ్లకు ఆనాడు కేంద్రం ఇచ్చిన నిధులన్నీ వాడేసుకుని చివరికి వెళ్లేప్పుడు రూ.1800 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారు. – అరకొర నిర్మాణాలు చేసి, మౌలిక వసతులు కూడా లేకుండా పనులు చేశారు. అయినా తామే కట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు. – మా ప్రభుత్వం వచ్చాక 2.63 లక్షల ఇళ్లు పూర్తి చేసి అందిస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే 70 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందించాం. – వచ్చే నెలాఖరుకి లక్ష ఇళ్లు పూర్తవుతాయి. – టిడ్కో ఇళ్ల వద్ద పరిపూర్ణంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. – టీడీపీ గెల్చిన చోట కూడా టిడ్కో ఇళ్లు ప్రారంభించాం. రాజధానిలో ఒక్కొక్కరికి రూ.12 లక్షల ఆస్తి: – వెంకటపాలెంలో ఇచ్చిన స్థలం విలువ పది లక్షల వరకు ఉంటుంది. అక్కడ ఇళ్లు నిర్మాణంతో కలిపితే 12 లక్షల నుంచి 15 లక్షల విలువైన ఆస్తి పేదలకు అందిస్తున్నాం. – ప్రతిపక్షాలకు మాత్రం పేదల ఆనందం నచ్చడం లేదు. ఇప్పటికే ఈ ఇళ్ల మీద సుమారు 18 కేసులు నడుస్తున్నాయి. – రేపటి నుంచి దీనిపై మళ్లీ ఎన్ని కేసులు ఫైల్ చేస్తారో చూడండి. – టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇళ్లు కట్టారు? మూడేళ్లు ఒక్క ఇళ్లు నిర్మించకుండా చివర్లో పది లక్షల ఇళ్లు అంటూ ప్రచారం చేసుకున్నారు. – కచ్చితంగా రాజధానిలో ఈ ఇళ్లన్నీ పూర్తి చేసే మేం ఎన్నికలకు వెళ్తాం.. – ఇలాంటి మంచి చేసే ప్రభుత్వానికి మరింత మేలు చేసే అవకాశాన్ని ప్రజలు తప్పకుండా ఇస్తారు. – రాష్ట్ర ప్రజలంతా మా నమ్మకం.. మా భవిష్యత్తు నువ్వే జగన్ అంటూ గొంతెత్తి చాటుతున్నారు.