టీడీపీ సభ్యులు.. చరిత్రహీనులు

సంఖ్యాబలం ఉందని బిల్లులు అడ్డుకునేందుకు కుట్ర

విధ్వంసం సృష్టిస్తామని యనమల సభలో మాట్లాడారు

ద్రవ్య వినియమ బిల్లు ఆమోదం పొందకుండా కుట్రలు

తప్పు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. లేకపోతే మీరు రాజీనామాకు సిద్ధమా..?

టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌

అమరావతి: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బిల్లులను మండలిలో అడ్డుకున్న టీడీపీ సభ్యులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. సంఖ్యాబలం ఉందని ప్రభుత్వ బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేసిందని ధ్వజమెత్తారు. మండలిలో ఇష్టానుసారంగా విధ్వంసం సృష్టిస్తామని యనమల రామకృష్ణుడు మాట్లాడాడని, సభా నియమాలకు విరుద్ధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారని మండిపడ్డారు. శాసనమండలిలో నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. రూల్‌ 90 నోటీసు ఒక రోజు ముందివ్వాలని చెప్పినా వినలేదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 

శాసనమండలిలో తాను అసభ్యకరంగా ప్రవర్తించానని టీడీపీ విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సభలో జిప్‌ విప్పానంటూ లోకేష్, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, బాబు రాజేంద్రప్రసాద్‌  దుష్ప్రచారం చేస్తున్నారని, ఛైర్మన్‌ దగ్గరకు వెళ్లి వీడియోలు బయట పెట్టమని అడుగుదామన్నారు. తాను తప్పు చేసినట్లు తేలితే రాజీనామా చేస్తానని, లేకపోతే మీరు రాజీనామాకు సిద్ధమా..? అంటూ టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌ విసిరారు.

సభలో ఫొటోలు, వీడియోలు తీయొద్దని చైర్మన్‌ చెప్పినా లోకేష్‌ వినిపించుకోలేదని, ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిపై లోకేష్‌ దాడి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందబలం ఉందని బిల్లులను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని టీడీపీ యత్నించిందని ధ్వజమెత్తారు. అర్ధరాత్రి వరకు సమావేశాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని, అయినా మండలిని నిరవధిక వాయిదా వేసి వెళ్లిపోయారని మంత్రి అనిల్‌కుమార్‌ మండిపడ్డారు.  

సంప్రదాయం ప్రకారం ద్రవ్యవినిమయ బిల్లు చివరిలో ఆమోదిస్తారని, కానీ టీడీపీ విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. బిల్లులు ఆమోదంపై మిగతా పార్టీల అభిప్రాయం తీసుకోమన్న డిప్యూటీ చైర్మన్‌ వినిపించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ద్రవ్యవినియమ బిల్లు ఆమోదం పొందకుండా కుట్రలు చేశారని మండిపడ్డారు. మండలిలో ఎక్కడ బూతులు మాట్లాడమో టీడీపీ నిరూపించాలన్నారు. సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది టీడీపీ సభ్యులేనన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకొని టీడీపీ సభ్యులు చరిత్రహీనులుగా నిలిచిపోయారని ధ్వజమెత్తారు.
 

Back to Top