దత్తపుత్రుడు అనే సినిమా తీయాలని ఉంది

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

ఈ సినిమాకు అయిదారుగురు హీరోయిన్లు కావాలి. నిర్మాత దొరకడం లేదు
 
చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రతిపక్షం ఓట్లు చీలుస్తాడు

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే విపక్షమంతా కలిసి వెళ్దామంటాడు

ఇదీ పవన్‌కళ్యాణ్‌ నైజం. బాబు కోసమే పవన్‌ ఆరాటం

చంద్రబాబు చేతిలో ‘పావు’ పవన్‌కళ్యాణ్‌

మంత్రి శ్రీ అంబటి రాంబాబు స్పష్టీకరణ

దత్తపుత్రుడు అంటే సహించనంటావు

కాకపోతే ఎందుకు చాకిరీ చేస్తున్నావు?

కాపులందరినీ చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టే ప్రయత్నం

అంతేతప్ప అధికారంలోకి రావాలన్న ఆలోచన ఉందా? 

అసలు పోటీ చేయాలని అయినా ఉందా? 

అప్పుడే పొత్తులపై ఎందుకు ఆలోచిస్తున్నారు?

సూటిగా ప్రశ్నించిన మంత్రి శ్రీ అంబటి రాంబాబు

ఒక్క మాట చెప్పండి. మీకు ఆవగింజ అంత ధైర్యమున్నా..

ఎవరితోనూ పొత్తు పెట్టుకోను. ఒంటరిగా పోటీ చేస్తా

సింగిల్‌గానే వెళ్తాను ప్రజలు ఆశీర్వదించండి

అనే ధైర్యం ఉందా. ఆ దమ్ముందా. ఉంటే చెప్పండి

తాడేపల్లి: దత్తపుత్రుడు అనే సినిమా తీయాలని ఉంద‌ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 

ఇది రైతు పక్షపాత ప్రభుత్వం:
    రైతు భరోసా యాత్ర పేరుతో తిరుగుతున్న పవన్‌కళ్యాణ్‌ నిన్న చింతలపూడిలో సుదీర్ఘ ప్రసంగం చేసి, జగన్‌గారిపై విమర్శలు గుప్పించారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో రైతులకు అన్యాయం జరిగినా ఏనాడూ వారి తరపున మాట్లాడలేదు. రైతుల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి, ఎగ్గొట్టినా పవన్‌కళ్యాణ్‌ నోరెత్తలేదు.
    కానీ రైతుల పక్షపాతి అయిన జగన్‌గారు, వారి కోసం ఎన్నో చేస్తున్నా పవన్‌కళ్యాణ్‌ విమర్శలు చేస్తున్నారు. కౌలు రైతులకు కూడా మా ప్రభుత్వం అన్ని పథకాలు ఇస్తోంది. పెట్టుబడి సాయం రూ.13,500 చొప్పున కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులకు కూడా ఇస్తున్నాం. అలాగే ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నాం.

చంద్రబాబు చేతిలో ‘పావు’:
    కానీ ఇవన్నీ పవన్‌కళ్యాణ్‌కు కనిపించవు. ఎందుకంటే ఆయన చంద్రబాబు చేతిలో పావు. ఆయన పవన్‌కళ్యాణ్‌ కాదు. చంద్రబాబు చేతిలో పావు కళ్యాణ్‌. చంద్రబాబు కోసమే ఉద్భవించిన రాజకీయ పక్షం జనసేన.
    చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రతిపక్షం ఓట్లు చీలుస్తాడు. 
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే విపక్షమంతా కలిసి వెళ్దామంటాడు.
ఇదీ పవన్‌కళ్యాణ్‌ నైజం. బాబు కోసమే పవన్‌ ఆరాటం.

చంద్రబాబు ‘ఎర’ పవన్‌కళ్యాణ్‌:
    నేను ఒకటే చెబుతున్నాను. రాష్ట్రంలో కాపు, ఒంటరి, బలిజ, మున్నూరుకాపు, తెలుగుకాపు అయిన బలమైన సామాజిక వర్గం ఎప్పుడూ తెలుగుదేశంకు వ్యతిరేకంగా లేరు. కానీ వంగవీటిరంగా హత్య, ఆ తర్వాత, ఇటీవల ముద్రగడ పద్మనాభం అరెస్టు వ్యవహారాల తర్వాత వారు వ్యతిరేకమయ్యారు. వారిని తిరిగి తమవైపు మళ్లించడం కోసం చంద్రబాబు వేసిన గాలానికి ఎర పవన్‌కళ్యాణ్‌. 
    అందుకే ఆయన చెబుతున్నాడు. తాను సీఎం కావాలని అనుకోవడం లేదంటున్నాడు. ఎందుకంటే చంద్రబాబు సీఎం కావాలని ఆయన కోరుకుంటున్నాడు.
    పవన్‌కళ్యాణ్‌ పార్టీ ప్రస్థానం ఒకసారి చూస్తే, 2014లో టీడీపీతో కలిసి పోటీ చేశారు. 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీలిపోవాలని చెప్పి విడివిడిగా పోటీ చేశారు.
    ఇక ఇప్పుడు ఏం చేయబోతున్నాననేది మొన్ననే చెప్పాడు. ఏం చెప్పాడు. జగన్‌మోహన్‌రెడ్డిగారి వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడతాను తప్ప, ఈ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి కావాలనో, తన పార్టీ అధికారంలోకి రావాలనో, ఈ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం తనకు లేదు. అని చెప్పాడు. దీన్ని బట్టి అర్ధం అవుతున్నది ఏమిటి. ఎర కాదా ఈయన. 

అవన్నీ సెటైర్లు కావా?:
    ఇంకా ఏమంటాడు. తాను వ్యక్తిగతంగా దూషించనని, కానీ వైసీపీ వాళ్లు ఆ పని చేస్తున్నారని అన్నాడు. అలాగే సెటైర్లు వేయనన్నాడు. కానీ అప్పటి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌ను అల్లం వెల్లుల్లి అని, అవంతి శ్రీనివాస్‌ను బంతి, చామంతి, గోడకు కొట్టిన బంతి అని, నన్ను కూడా రాంబో రాంబాబు అన్నారు. అవన్నీ గుర్తు లేవా?
    అంటే అవన్నీ విమర్శలా? సెటైర్లు కావా? మీరైతే సెటైర్లు వేయొచ్చు. ఆ హక్కు దత్తపుత్రుడైన పవన్‌కళ్యాణ్‌కు ఉంటుంది. ఇండిపెండెంట్‌గా వ్యవహరించే మాకు మాత్రం ఉండవా. మీరు మరో మాట కూడా అన్నారు. స్క్రీన్‌ప్లే రాయొచ్చు అన్నారు. రాయండి మాకు అభ్యంతరం లేదు.

మేము సినిమానే తీయగలం:
    అయితే మీకు అదే వచ్చు. కానీ మాకు సినిమా కూడా తీయడం వచ్చు. దత్తపుత్రుడు సినిమా తీద్దామనుకుంటున్నాం. నిర్మాత కోసం చూస్తున్నాం. నారావారి దత్తపుత్రుడు లేదా బాబుగారి దత్తపుత్రుడు అని టైటిల్‌ పెట్టుకుని సినిమా తీద్దామనుకుంటున్నాం. కాకపోతే ఒక హీరోయిన్‌ చాలదు. అయిదారుగురు హీరోయిన్లు కావాలి. అందుకే నిర్మాతలు దొరకడం లేదు.

మరి ఎందుకీ చాకిరి?:
    దత్తపుత్రుడు అంటే సహించడట. మరి కాకపోతే ఎందుకు చాకిరీ చేస్తున్నావు. కాపులందరినీ కట్ట కట్టుకుని చంద్రబాబుగారి కాళ్ల దగ్గర పెట్టే ప్రయత్నం తప్ప, నువ్వు అధికారంలోకి రావాలన్న ఆలోచన ఉందా? పోటీ చేయాలని ఉందా? అప్పుడే పొత్తుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు?
ఒక్క మాట చెప్పండి. మీకు ఆవగింజ అంత ధైర్యమున్నా, ఈ రాష్ట్రంలో పోటీ చేసే ధైర్యమున్నా, ఎవరితోనూ పొత్తు పెట్టుకోను. సింగిల్‌గానే వెళ్తాను ప్రజలు ఆశీర్వదించండి. అనే ధైర్యం ఉందా. ఆ దమ్ము లేదు. 

కామెడీ మాటలు–ప్యాకేజీలు:
    అదేమంటే చాలా కామెడీగా మాట్లాడాడు. ‘జగన్‌గారి మాదిరిగా లక్షల కోట్లు, సిమెంటు ఫ్యాక్టరీ లేదు.. ఏదో సినిమాలు చేసుకుంటూ బతుకుతున్నాను’. అని ఎలా చెప్పాడండి. ఏదో చెట్టు కింద బజ్జీలు వేసుకుని బతుకుతున్నట్లు మాట్లాడాడు. అసలు మీ రెమ్యునరేషన్‌ ఎంతండి? ఎన్ని కోట్లు అండి మీ రెమ్యునరేషన్‌. ఇవనీ కాకుండా మీకో మిషన్‌ ఉంది కదా. చంద్రబాబునాయుడి గారి డబ్బులు గుద్దే మిషన్‌. ఆయన అక్రమాలు చేసి సంపాదించిన కోటానుకోట్లు. మీరు ప్యాకేజీ తీసుకుని మమ్మల్ని తిట్టే కార్యక్రమం. 

అది మీ తరం కాదు:
    ఇదే కాకుండా ఆయనకు నర్సాపురం ఎంపీ సలహాలు ఇస్తున్నారట. ఆహా మంచి డైరెక్షన్‌లో ఉన్నారండి. రఘురామకృష్ణంరాజు దర్శకత్వంలో, చంద్రబాబు ధన సహాయంతో మీరు ఇవాళ యాత్రలు చేస్తూ, మామీద విమర్శలు చేస్తూ మమ్మల్ని గద్దె దించాలనుకుంటున్నారా? అది మీ వల్ల కాదు. అంతేకాదు మిమ్మల్ని నడిపిస్తున్న చంద్రబాబు వల్ల కూడా కాదు.
    ఎక్కడా అవినీతికి తావు లేకుండా, అందరి బాగు కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఇది. ఒక చక్కటి పరిపాలన. రైతులకు మేలు చేస్తున్న, ఆ తాపత్రయంతో పని చేస్తున్న ప్రభుత్వం తప్ప, ప్యాకేజీల కోసమో, అక్రమ సంపాదన కోసమో పని చేస్తున్న ప్రభుత్వం మాది కాదు.

జగన్‌గారి కాలిగోటికి కూడా..:
    మిమ్మల్ని దత్తపుత్రుడు అంటే, జగన్‌గారిని సీబీఐ దత్తపుత్రుడు. చంచల్‌గూడా షటిల్‌ టీమ్‌ అంటాడంట. జగన్‌గారు తనపై కాంగ్రెస్, టీడీపీ కుట్ర చేసి జైలుకు పంపినా, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పార్టీని వదిలి పారిపోలేదు. మొక్కవోని ధైర్యంతో ఉన్నారు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. చిత్తశుద్ధి కలిగిన నాయకుడు జగన్‌గారు. ఆయన కాలిగోటికి కూడా మీరు సరికారు. ఆ విషయం గుర్తు పెట్టుకొండి. 

కుట్రలు–కుతంత్రాలు:
    అసలు పవన్‌కళ్యాణ్‌కు అరెస్టుకు. కన్విక్షన్‌కు తేడా తెలియదు. ఎవరినైనా అరెస్టు చేస్తారు. విచారణ తర్వాత నేరం రుజువైతే కన్విక్ట్‌ అవుతారు. కానీ రెండింటికీ తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు.
    ఒక్క పవన్‌కళ్యాణే కాదు. ఆయనతో పాటు, ప్రతి విషయంలోనూ చంద్రబాబుగారు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5 రోజూ కుట్రలు పన్ని వండి వారుస్తుంటారు. వార్తలు రాస్తుంటారు.
    నేను ఒకటి మనవి చేస్తున్నాను. 480 మంది రైతులు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటే, వారికి కూడా పరిహారం ఇచ్చిన ప్రభుత్వం జగన్‌గారిది. 

సీపీఎస్‌పై రెచ్చగొట్టే ప్రయత్నం:
    ఇవాళ మరొకటి ఈనాడులో రాశారు. సీపీఎస్‌ గురించి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దీని గురించి ఎప్పుడైనా అడిగారా. వార్త రాశారా. కానీ మా ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధితో పని చేస్తోంది. దీనిపై ఇప్పటికే కమిటీ పని చేస్తోంది. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయినా ప్రజలను, ఉద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు.
    కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలను, ఇలాంటి దత్తపుత్రుడి వేషాలను ప్రజలు ఒప్పుకోరు. వ్యతిరేకిస్తారు తప్ప అనుకూలంగా వ్యవహరించరని పవన్‌కళ్యాణ్, చంద్రబాబు గుర్తుంచుకుంటే మంచిది.. అని మంత్రి శ్రీ అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
[

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top