విదేశీ పెట్టుబడులే లక్ష్యం దుబాయ్‌ ఎక్స్‌పో–2022

11 నుంచి 17 వరకు దుబాయ్‌ ఎక్స్‌పో–2022 

 మంత్రి గౌతమ్‌రెడ్డి 

 అమరావతి: విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్‌ ఎక్స్‌పో–2022లో ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ప్రతి అంశంలో ఏపీ ప్రత్యేకత కనిపించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 11 నుంచి 17 వరకు దుబాయ్‌లో జరగనున్న ఎక్స్‌పోకి ఏర్పాట్లపై అధికారులతో గౌతమ్‌ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ ఎక్స్‌పోకి ప్రభుత్వం తరఫున మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ అధికారుల బృందం హాజరవనుంది. పలు ఆహార, సరకు రవాణా కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చాయి.

ఈ నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ తెలిపారు. ఎక్స్‌పోలో ఏపీ పెవిలియన్‌ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది మంత్రికి వివరించారు. ఏపీ పెవిలియన్‌లో ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఫిషింగ్‌ హార్బర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, ఐటీ, పోర్టులు సహా పలు రంగాలపై ఏపీ ప్రత్యేకతను చాటేందుకు తీసుకున్న చర్యలపై ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు.

పర్యటన ఇలా.. 
ఈ నెల 13న 100 మంది సభ్యులతో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 14న పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం, రోడ్‌ షో నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం 250 మందికి పైగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో మంత్రి నేతృత్వంలో భారీ సమావేశం ఉంటుంది. 15న ప్రపంచ స్థాయి సకల సదుపాయాలతో కూడిన డీపీ వరల్డ్‌  ఫెసిలిటీ సైట్‌ విజిట్‌లతోపాటు వివిధ ఎమిరేట్‌ కంపెనీలతో బీ2జీ సమావేశానికి ప్రణాళిక సిద్ధం చేసింది. 16న ‘ముబదల’ పెట్టుబడుల కంపెనీతో మంత్రి సమావేశమై ఏపీ గురించి చర్చిస్తారు. 

Back to Top