ఇల్లు మునిగిపోతుందన్న భయంతోనే బాబు పరార్‌ 

 మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఇప్పటికైనా చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయాల్సిందే 
 
చంద్రబాబు నివాసం వద్ద పర్యటించిన ఎమ్మెల్యే ఆర్కే

అమరావతి : ఇల్లు మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు ఇంటిని వదిలి హైదరాబాద్‌కు పారిపోయారని  మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి భారీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయాలని ఆయన సూచించారు. ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను పరిశీలించారు.  కృష్ణా నదీగర్భంలో అక్రమంగా నిర్మించిన నివాసాన్ని చూసి అక్కడి పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎగువన గల పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తోందని, చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. 

అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు లారీలతో ఇసుకను తరలిస్తున్నారని, ఇల్లు మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు ఇంటిని వదిలి హైదరాబాద్‌కు పారిపోయారని ఆర్కే ఎద్దేవా చేశారు. కాగా చంద్రబాబు అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. ఇంట్లోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణా వరదను ముందే ఊహించిన చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు చెందిన వాహనాలను ముందే హ్యాపీ రిసార్స్‌కు తరలించారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సరైన వర్షాలు పడక, వరదలు రాలేదు కనుకే ఆయనకు ఇక్కడి పరిస్థితి అర్థంకాలేదని ఆర్కే అన్నారు. ఇప్పుడు కాకపోయిన భవిష్యత్తులోనైనా చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడాన్ని ఖాళీచేయక తప్పదని ఆయన హెచ్చరించారు.

 
 
 
 

Back to Top