బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించండి 

అఖిలపక్ష సమావేశంలో వైయస్‌ఆర్‌ సీపీ వినతి 

న్యూఢిల్లీ: బీసీలకు చట్ట సభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరింది. సోమవారం నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అధ్యక్షతన  అఖిలపక్ష సమావేశం జరిగింది.  ప్రధాని మోదీ సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లతోపాటు వైయస్‌ఆర్‌సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌ సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాల్గొని పలు ప్రతిపాదనలు లేవనెత్తారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్‌ చేయాలని, సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు లేని జిల్లాలకు కొత్తవి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు 2017–18, 2018–19 సంవత్సరాలకు రూ.700 కోట్లు విడుదల చేయాలని, ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ప్రకారం రూ.24 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్న విషయాన్ని సమావేశంలో లేవనెత్తినట్టు విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. ఉభయ సభల్లో వివిధ అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొనేందుకు ప్రతి పార్టీకి కనీసం 10 నిమిషాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. 

 

Read Also: సీజన్ లాంటోండిని అంటున్న పవన్ నాయుడు

Back to Top