కూటమి ప్రభుత్వంలో దళితులు, గిరిజనులకు రక్షణ కరువు

సామూహిక లైంగిక దాడికి గురైన బాలికకు న్యాయం చేయాలి

బిడ్డకు జన్మనిచ్చిన బాలికను పరామర్శించేందుకు అనుమతివ్వరా?

హత్యకు గురైన గిరిజన విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలి

మడకశిర నియోజకవర్గం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త  ఎస్ ఎల్ ఈరలక్కప్ప  డిమాండ్‌

అనంత‌పురం:  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మడకశిర నియోజకవర్గం సమన్వయకర్త ఎస్ ఎల్ ఈరలక్కప్ప మండిప‌డ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఏడుగుర్రాలపల్లిలో సామూహిక లైంగిక దాడికి గురైన దళిత బాలికను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రామగిరి మండలంలోని ఏడుగుర్రాలపల్లిలో సామూహిక లైంగిక దాడికి గురైన దళిత బాలిక మూడు రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో మడకశిర పర్యటనకు వస్తున్న హోం మంత్రి అనితకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న మడకశిర నియోజకవర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్ ఎల్ ఈరలక్కప్పను కదిరేపల్లి క్రాస్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.  రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న అనిత దళితురాలై ఉన్నా తమ వర్గానికి న్యాయం జరగడం లేదని అన్నారు. ఇటీవల మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ జిల్లాకు వచ్చి వెళ్లినా దళిత బాలికకు న్యాయం జరగలేదన్నారు. ఇప్పుడు ఆ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు. తల్లీబిడ్డ సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలన్నారు. బాధిత బాలికకు న్యాయం చెయ్యాలని వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే తమను అడ్డుకోవడం దారుణమన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అంటూ ధ్వజమెత్తారు. అలాగే అనంతపురంలో ఇంటర్‌ చదువుతున్న గిరిజన విద్యార్థిని తన్మయిని హత్య చేసినా ఆ కుటుంబాన్ని ఆదుకున్న దాఖలా లేదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణి ఎమ్మెల్యేలుగా గెలిచినా దళితుల సంక్షేమం గురించి ఆలోచించడం లేదన్నారు. దళిత సంఘాల ద్వారా రాజకీయంగా ఎదిగిన ఎంఎస్‌ రాజు అదే దళితులకు అన్యాయం జరిగుతుంటే నోరుమెదపట్లేదని మండిపడ్డారు. ఏడుగుర్రాలపల్లిలో దారుణ ఘటన జరిగితే బాధిత బాలికను పరామర్శించే ఓపిక హోం మంత్రి అనితకి లేదా? అని ప్రశ్నించారు. బాధితుల తరఫున వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

Back to Top