కర్నూలు: కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించాలనే కూటమి కుట్రలకు చెక్ పెట్టేందుకు వైయస్ఆర్‌సీపీ చేపట్టిన రచ్చబండ – కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతం చేసేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం కర్నూలు నగరంలోని 1వ వార్డు కండేరి ప్రాంతంలో వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి ఆధ్వర్యంలో తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రజా వైద్య వ్యవస్థను ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లనివ్వకూడదు. రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణను మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలుపునిచ్చారు. ప్రజా వైద్యాన్ని బలహీనపరచడం, ప్రైవేట్ కాపిటలిస్టుల చేతుల్లోకినెట్టడం చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండకట్టాలి. అధికారం కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇచ్చిన హామీలను అరకొరగా నెరవేర్చుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ కమిటీల ద్వారా వైయస్ఆర్‌సీపీ క్రమబద్ధంగా ముందుకు సాగుతుంది. ప్రతి నాయకుడు, కార్యకర్త తమ గ్రామాన్ని బాధ్యతగా తీసుకుని ప్రజలతో కలసి ఉద్యమాన్ని విజయవంతం చేయాలి,” అని ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య, ఒకటో వార్డు కార్పొరేటర్ పి షాషావలి, నగర వార్డు కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వైయస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.