కృష్ణా జిల్లా: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నైట్ బీట్ డ్యూటీలో ఉన్న హోంగార్డును జనసేన నాయకుడు చావచితక్కొట్టాడు. అదేమని అడిగిన కానిస్టేబుల్‌ను దుర్భాషలాడాడు. జనసేన నాయకుడి చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు మోహనరావును వైయస్ఆర్‌సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కృష్ణమూర్తి పరామర్శించారు. విధుల్లో భాగంగా ఆదివారం రాత్రి విశ్వబ్రాహ్మణ కాలనీలోని బీట్ పాయింట్‌లో ఉన్న పుస్తకంలో సంతకం చేసేందుకు హోం గార్డు మోహనరావు వెళ్ళారు. కానిస్టేబుల్ నోట్ బుక్ లో సంతకం పెడుతుండగా, మోహనరావు పక్కన ఉన్న బల్లపై కూర్చున్నాడు. అదే సమయంలో జనసేన పార్టీ ఎనిమిదో డివిజన్ ఇన్‌ఛార్జ్, జనసేన నాయకుడు కర్రి మహేష్ బైక్ వచ్చి అక్కడ ఆగాడు. ‘‘ఏంట్రా నన్ను చూసి కూడా నిలబడటంలేదంటూ’’ మోహనరావును ఏక వచనంతో సంబోధిస్తూ తన అహంభావాన్ని ప్రదర్శించాడు. ‘‘నేను వచ్చాక కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా’’ అంటూ ఆగ్రహంగా హోంగార్డును దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ బాషా... జనసేన నేత దుశ్చర్యను అడ్డుకొని పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించాడు. పూటుగా మద్యం సేవించి ఉన్న కర్రి మహేష్ కానిస్టేబుల్‌ను సైతం దుర్భాషలాడి పక్కకు తోసి, హోంగార్డుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన హోంగార్డును కర్రి మహేష్ బారి నుంచి తప్పించిన కానిస్టేబుల్, చికిత్స నిమిత్తం ఆయనను హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించాడు. కాగా, ఈ ఘటనపై మోహనరావు ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు మహేష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇదిలావుండగా, కర్రి మహేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది.