కోట ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ దిగజారుడు రాజకీయాలు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్‌

నెల్లూరు:  కోట మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఉప ఎన్నికలో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నేత కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కోట ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైయ‌స్ఆర్‌సీపీ బీఫామ్‌పై గెలిచిన ఎంపీటీసీ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి, టీడీపీ కండువాలు కప్పి తమవైపు తిప్పుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. కోట మండలంలో వైయ‌స్ఆర్‌సీపీ తరఫున 14 మంది ఎంపీటీసీలు గెలవగా, టీడీపీ తరఫున కేవలం నలుగురు మాత్రమే గెలిచారని గుర్తు చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ బలంతో గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలు, ఒత్తిళ్లతో పార్టీ మార్పించడం వెన్నుపోటు రాజకీయాలకు నిదర్శనమని కాకాణి మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలు చేయడం టీడీపీకి మొదటి నుంచే అలవాటేనని ఆరోపించారు.  పార్టీకి నమ్మకద్రోహం చేసి, ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీటీసీలకు భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. పార్టీ కోసం అంకితభావంతో నిలబడ్డ ఎంపీటీసీ సభ్యులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

నాలుగు నెలల పాటు మాత్రమే ఉండే ఎంపీపీ పదవి కోసం రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ అధికార పార్టీ వ్యవహరించిందని కాకాణి విమర్శించారు. ప్రజల మద్దతుతో నేరుగా గెలిచే ధైర్యం లేక అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి  ప్రోత్సాహంతోనే ఈ తరహా రాజకీయాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, భవిష్యత్తులో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
 

Back to Top