తాడేపల్లి: మా కుమారుడు జయవర్థన్‌రెడ్డి మరణంపై తప్పుడు కథనాలు వద్దని ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన్ను చూడడానికి వచ్చి, గుండెపోటుతో మరణించిన అభిమాని, సత్తెనపల్లికి చెందిన పి.వెంకట జయవర్థన్‌రెడ్డి తల్లిదండ్రులు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రిని కలిశారు. వెంకట జయవర్థన్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, తల్లి సావిత్రి, సోదరుడు మణికంఠరెడ్డి.. వైయస్ జగన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భాస్కర్‌రెడ్డి ఏమన్నారంటే..: తప్పుడు కథనాలు రాయొద్దు: మా బాబుకు జగనన్న అంటే పిచ్చి ప్రేమ. అందుకే ఆయన పల్నాడు జిల్లా పర్యటనకు వస్తుండగా, చూడడానికి వెళ్లాడు. అందు కోసం సత్తెనపల్లి వెళ్లిన మా బాబు వెంకట జయవర్థన్‌రెడ్డి, తీవ్రంగా అలిసిపోయి ఒకచోట విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత కాసేపటికి జగనన్న వస్తున్నాడని తెలుసుకుని, చూద్దామని లేచి ఒకేసారి ఉద్వేగానికి లోనయ్యాడు. దాంతో కిందపడిపోయి గుండె ఆగి తుదిశ్వాస విడిచాడు. ఇది ఎవరి తప్పిదం కాదు. నా కొడుకు మరణానికి ఎవరూ బాధ్యులు కాదు. అందుకే దయచేసి తప్పుడు కథనాలు రాయవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నాను. జగనన్న ఎంతో భరోసా ఇచ్చారు: మా కుటుంబంలో మా బాబు అందరికీ సాయం చేస్తూ కలుపుగోలుగా ఉండేవాడు. అలాంటి వాడిని మేం పోగొట్టుకున్నాం. ఇదంతా తెలుసుకున్న జగనన్న మమ్మల్ని పిలిపించి మాట్లాడారు. ‘మీరు ఏ మాత్రం అధైర్యపడొద్దు. మీకు ఏ సమస్య వచ్చినా, మీ కుటుంబానికి అండగా ఉంటాము’ అని ఎంతో ధైర్యం చెప్పారు. భరోసా ఇచ్చారు. అలాగే భార్గవ్‌రెడ్డిగారు కూడా మా కుటుంబానికి అండగా నిల్చారు. ఇంకా పార్టీ జిల్లా నాయకులంతా వచ్చి తమకు ధైర్యం చెప్పి ఓదార్చారంటూ, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు భాస్కర్‌రెడ్డి చెప్పారు.