ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలారు

జగ్గయ్యపేట నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఫైర్‌

జగ్గయ్యపేట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని జగ్గయ్యపేట నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు విమర్శించారు. జగ్గయ్యపేట పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలోని ఎలక్ట్రికల్ యూనియన్ కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలు, రైతులు, యువత, పేదల అభ్యున్నతే లక్ష్యమని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు పెరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో, పంట నష్టాలకు తగిన పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పాలకులు స్పందించడం లేదన్నారు.  గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రజల సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి రెండింటిలోనూ ప్రభుత్వం విఫలమైందని, సంక్షేమ పథకాల గురించి ప్రశ్నిస్తే అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపిస్తూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశం పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ, బీసీ ఉద్యమ నాయకుడు తుమ్మాటి కృష్ణమాచార్యులు, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు నంబూరు చలపతిరావు, కాంగా వెంకటేశ్వరరావు, దర్శి వెంకటేశ్వర్లు, హఫీజున్నిసా, బూడిద నరసింహారావు, చల్లా వైకుంఠరావు, మండల శ్రీనివాస్ గౌడ్, చింతకుంట్ల వెంకటరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Back to Top