తాడేపల్లి: విజయవాడ, శ్రీశైలంలో జరిగే శ్రీలక్ష్మీమహాయజ్ఞం, మహాకుంభాభిషేక మహోత్సవాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వేదపండితులు ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం ఆహ్వానపత్రికలు అందజేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 12 నుంచి 17 వరకు ఏపీ ప్రభుత్వం–దేవదాయ ధర్మదాయ శాఖ నిర్వహణలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహించనున్నారు. విజయవాడలో జరగనున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, వేద పండితులు ఆహ్వానించారు. అదే విధంగా శ్రీశైలంలో ఈనెల 25 నుంచి 31 వరకు జరగనున్న మహారుద్ర శతచండీ వేదస్వాహాకార పూర్వక మహాకుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్థానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఈవో లవన్న, వేద పండితులు ఆహ్వానించారు. అనంతరం సీఎం వైయస్ జగన్‌కు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదమంత్రాలతో వేదపండితులు ఆశీర్వదించారు.