గుంటూరు : గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఓ మహిళపై జరిగిన దాడి, ఆమెను వివస్త్రను చేసిన ఘటన రాష్ట్రంలో మహిళల భద్రత పూర్తిగా క్షీణించిందనే విషయాన్ని రుజువు చేస్తోందని వైయస్ఆర్‌సీపీ మహిళా నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనపై సిగ్గుపడాలని, నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి విడదల రజిని, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తదితరులు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ, మహిళపై జరిగిన దాడి రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. బాధిత కుటుంబం పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా చర్యలు తీసుకోలేదని, వీడియోలు బయటకు వచ్చిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని విమర్శించారు. వరుదు కళ్యాణి మాట్లాడుతూ, ఈ ఘటన ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చిందన్నారు. మహిళలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు నిర్వహిస్తామని ప్రకటించారు. షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ, మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం లభించగా, ప్రస్తుతం మహిళలు భయంతో జీవించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఉప్పాల హారిక స్థానిక ఎమ్మెల్యే ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేయగా, రాయన భాగ్యలక్ష్మి బాధిత మహిళకు తక్షణ న్యాయం చేసి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని కోరారు. కాకాణి పూజిత మాట్లాడుతూ, కావలి ఘటనలోనే ప్రభుత్వం కఠినంగా స్పందించి ఉంటే గుంటూరులో ఈ దారుణం జరిగేది కాదని, మహిళలకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.