గుంటూరు: ఓవైపు పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చి, మరోవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, టీడీపీ నేతలు డిన్నర్లు చేయడం ద్వారా చంద్రబాబు మరోసారి తన ఊసరవెల్లి రాజకీయాన్ని బయట పెట్టుకున్నారని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. 12 ఏళ్లుగా అంతులేని కథగా సాగుతున్న అమరావతికి బదులు జగన్‌గారు చేసిన ఆచరణాత్మక మావిగన్ ప్రతిపాదనపై జనం సానుకూలంగా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం కూడా అమరావతిలో దోపిడీకి అడ్డుకట్ట వేసి, మావిగన్ ప్రతిపాదనను అమలు చేయాలని కోరారు. చంద్రబాబు జర్నలిస్టులు, రాజకీయ నేతల అరెస్టులతో మరింత దిగజారుతున్నారని గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ఆక్షేపించారు. ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే..: చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయం: చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు అన్న విషయం మరోసారి రుజువైంది. ఎన్డీఏలో ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం పంచుకుంటున్న టీడీపీ నేతలు, కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డితో డిన్నర్ చేస్తున్నారు. కలిసి మంతనాలు చేస్తూ ఫోటోలు దిగుతున్నారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు ప్రజలు కూడా గమనించాలి. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్లకు పూర్తిగా అండగా నిలిచినట్లు నటించిన టీడీపీకి చెందిన నేతలు.. బయటికి వచ్చి అదే బిల్లును వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి తో కలిసి ఎలా డిన్నర్లు చేస్తారు. గతంలోనూ బీజేపీతో కలిసి పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత మోడీ, అమిత్ షా పై విమర్శలు చేసి ఎన్డీయే నుంచి బయటికి వచ్చారని, ఇప్పుడు కూడా చంద్రబాబు తీరు చూస్తుంటే ఆయన ఊసరవెల్లి రాజకీయం మరోసారి పడగవిప్పినట్లు కనిపిస్తోంది. అంతులేని అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 12 ఏళ్లు దాటిపోయిన కనీస స్ధాయిలో రాజధాని ఏర్పాటు చేసుకోకపోవడం దురదృష్టకరం. దీనికి ప్రధాన కారణం రాష్ట్రం ఏర్పడగానే తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబే. రాష్ట్రం విడిపోతే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు కట్టుకోవడానికి కేంద్రం నిధులు కూడా ఇచ్చింది. కానీ చంద్రబాబు ఇవేవీ కట్టకుండా.. స్వార్ధం, అతితెలివి, అవినీతితో ఓ పెద్ద నగరం నిర్మిస్తానని ముందుకు వచ్చారు. తన హయాంలో ఏదీ నిర్మించకుండా అన్నీ తాత్కాలికం చేసుకున్నాడు. గతంలో చేయకపోగా ఇప్పుడు మరోసారి అమరావతి చుట్టూ తిరుగుతున్నారు. అమరావతి ఓ అంతులేని కథ. అది జీవితకాలంలో పూర్తి కాదు. చంద్రబాబు దాన్ని ఎందుకు పెట్టారంటే కేవలం అవినీతి కోసం. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇప్పించడానికి, తన బినామీలకు భూములిప్పించడానికే తప్ప ఓ మంచి రాజధాని కట్టాలన్న సంకల్పం లేదు. సంపద సృష్టిస్తానంటున్న చంద్రబాబు తన తాబేదారుల కోసమే దాన్ని సృష్టించడానికి అమరావతి నిర్మాణం మొదలుపెట్టారు. అమరావతి అసాధ్యమనే జగన్ మావిగన్ ప్రతిపాదన: హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో ఏదైనా ఓ నిర్మాణం చేపట్టాలంటే గరిష్టంగా చదరపు అడుగుకు రూ.4500 ఖర్చవుతుంది. తాడేపల్లి, గుంటూరు వంటి చోట్ల కట్టినా చదరపు అడుగుకు రూ.2500 అవుతుంది. పైస్టార్ హోటల్ లెక్కన కట్టినా చదరపు అడుగుకు విజయవాడ, గుంటూరుల్లోనూ రూ.3500 కంటే ఎక్కువ కాదు. కానీ అమరావతిలో మాత్రం చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలు ఖర్చు పెట్డడం దోపిడీ కాదా ? అనేక సందర్భాల్లో ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పలేకపోతోంది. మేం దోచుకుంటాం, మీరు చూస్తూ ఉండండి అంటున్నారు. అమరావతిలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్ధితి. ఇంత భయంకరమైన దోపిడీకి చంద్రబాబు అమరావతి పేరుతో తెర దీశారు. ఇప్పటికే రూ.75 వేల కోట్లు ప్రాథమిక వసతుల కోసం ఖర్చు పెట్టాలని అనుకున్నారు. ఇందులో రూ.45 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారు. ఆర్ధికంగా దెబ్బ తిన్న రాష్ట్రానికి లక్షల కోట్లు అప్పు తెచ్చి అమరావతి నిర్మించాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చారు. దీంతో చంద్రబాబు గుండెల్లో రాయిపడినట్లయింది. దీనిపై జనం ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకే మావిగన్ మీద బూతులతో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇవాళ అంతా రివర్స్ అయింది. వాళ్ల వాదన తప్పని తేలిపోయింది. మావిగన్ పై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. మావిగన్ డైవర్షన్ యత్నాలు విఫలం: 2050కి 35 లక్షల నుంచి 50 లక్షల మంది అమరావతిలో నివసిస్తారని చంద్రబాబు చెప్తున్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నది వేల మంది మాత్రమేనని అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ లో ఇప్పటికే 35–45 లక్షల మంది నివసిస్తున్నారు. విమానాలు దిగడానికి వీలుగా ఎయిర్ పోర్టు, ఆస్పత్రులు, రోడ్లు అన్నీ ఉన్న వడ్డించిన విస్తరి మావిగన్ ను వదిలేసి, ఇప్పుడు అన్నీ వండుతానని చంద్రబాబు చెప్పడం దోచుకోవడానికే. అమరావతిలో చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలు ఎందుకు ఖర్చవుతుందో ఇప్పటికైనా చంద్రబాబు, టీడీపీ నేతలు జనానికి చెప్పాలి. రాష్ట్రమంతా మావిగన్ పై చర్చ జరుగుతోంది. దీన్ని డైవర్ట్ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. అమరావతిలో దోపిడీ లేదని చంద్రబాబు, ఆయన తాబేదారులు నిరూపించాలి. టీవీ సీరియల్స్ తరహాలో అమరావతి రాజధాని కూడా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్ధితి ఉంది. 12 ఏళ్లలోనే అమరావతి సరైన నిర్ణయం కాదని ప్రజలందరికీ అర్దమైంది. మావిగన్ దీనికి ప్రత్యామ్నాయం అని కూడా అర్ధమైంది. చంద్రబాబు ఎన్ని డైవర్షన్ లు చేసినా ఫలించే పరిస్ధితి లేదు. జర్నలిస్టులు, రాజకీయ నేతల అరెస్టులేంటి ?: లోకేష్ వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తూ మావిగన్ అంటే బూతు మాట అని భారీ ఎత్తున ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. మంచి చేసే మావిగన్‌పై ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిసి, చంద్రబాబు తిరిగి డైవర్షన్ రాజకీయాలు మొదలుపెట్టారు. సీనియర్ జర్నలిస్టు అయిన వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి వంటి వారి అరెస్టులే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో కేవీఆర్ అనే ఓ జర్నలిస్టు ఇంటికి ఆంధ్రా పోలీసులు అర్ధరాత్రి వెళ్లి ఆయన వచ్చే వరకూ వెళ్లమని చెప్పారు. జర్నలిస్టులు, రాజకీయ నాయకుల మీద పోలీసుల్ని వాడాలనే పరిస్ధితికి చంద్రబాబు దిగజారారు. పైవాళ్లు చెప్పారని పోలీసులు ఇలాంటి పనులు చేస్తే మీరే ఇరుక్కుపోతారు. మీరు చట్టప్రకారం వెళ్లడం లేదని తెలిస్తే ప్రజలే తిరగబడతారు. టీడీపీకి అనుకూలంగా, అధర్మంగా వ్యవహరిస్తే ప్రజలు తిరగబడే పరిస్ధితి వస్తుందని, కాబట్టి ఆ పరిస్ధితి తెచ్చుకోవద్దని అంబటి రాంబాబు పోలీసులకు హితవు చెప్పారు.