శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకుని పౌర హక్కులను హరిస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి అరాచక పాలనను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కలిసి 'రెడ్ బుక్' రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్సార్సీపీ మీడియా విభాగం జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరిని అరెస్టు చేసిన తీరును ఆయన దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, తీవ్రవాదులను వేటాడినట్టు ఒక సీనియర్ జర్నలిస్టును భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు. అధికారం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని, కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదేనని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మాని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ధర్మాన హెచ్చరించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... ప్రపంచంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యం ప్రజలకు ఉత్తమమైన ఫలితాలివ్వాలంటే ఆ ప్రభుత్వంలో ఏర్పాటైన వ్యవస్థలన్నీ నిష్పాక్షికంగా పనిచేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రజాస్వామ్యం నెలకొని కాలం గడుస్తున్న కొద్దీ మరింతగా ప్రజలకు రకరకాల హక్కులు, బావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు నిర్భయంగా జీవించే వాతావరణం, తన ఆవేదనను చెప్పుకునే వాతావరణం, తాను చూసిన దాన్ని పది మందికీ తెలియజేసే స్వేచ్ఛ లభిస్తాయి. ప్రజాస్వామ్యంలో అప్పుడేవ్యవస్ధలన్నీ ముందుకు నడుస్తాయి. - ఏపీలో తిరోగమనంలో ప్రజాస్వామ్యం... 80 ఏళ్ల తర్వాత మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే మనం వెనక్కి వెళ్తున్నామనిపిస్తోంది. పౌరుల హక్కులను హరించే కార్యక్రమం జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పనిచేయకూడదనే వాతావరణం, ప్రజలకు ఏమీ తెలియకూడదనుకునే పాలకులు ప్రజలకు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇందులో భాగంగా అధికారంలో ఉన్నవాళ్లు వ్యవస్థలను తమ చేతుల్లోకి లాక్కుంటున్నారు . ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను స్వతంత్ర్యంగా పనిచేయనివ్వకపోవడం వంటి తిరోగమన చర్యలే నేడు మన రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. దాదాపు 40 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న మాలాంటి వాళ్లకి... ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యం రోజురోజుకీ ఆధ్వాన్న స్ధితిలోకి జారిపోతున్నట్టనిపిస్తోంది. - దేశంలోనే అధ్వాన్న పరిపాలన... సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లు మొత్తం పరిపాలన అంతటినీ కేవలం వారి కుటుంబాని ఆపాదించుకుని, వారి వ్యతిరేకులందరినీ హింసిస్తాం, నోరెత్తకుండా చేస్తామన్నట్టు వ్యవహరిస్తున్నారు. చివరకు ప్రధాన ప్రతిపక్షంలో పనిచేస్తున్న వారందరినీ అల్లరి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ నేరుగా రెడ్ బుక్ అనేది పెట్టుకున్నాం, అందులో ఉన్నవారందరినీ వేధిస్తున్నాం. ఇదే మా పరిపాలన అనే ఓపెన్ గానే చెబుతున్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ లాంటి 29 రాష్ట్రాలున్నాయి. ఎక్కడైనా ఇలాంటి పరిపాలన ఉందా? మీకు మీరు ప్రశ్నించుకొండి? ప్రజాస్వామ్యంలో ఇది తగునా? 80 ఏళ్ల ప్రజాస్వామ్యంలో దిగజారిపోతున్నట్టు అనిపించడం లేదా? మీకు వ్యతిరేకులు మాట్లాడకూడదా? ఈ రాజ్యంగం కల్పించిన స్వేచ్ఛ వారికి లేదా? నేరుగా బహిరంగ వేదికల మీద మీరే చెబుతున్నారు, ఆ రకంగానే చర్యలు కూడా ఉంటున్నాయి. ఇదే జరిగితే వ్యవస్దలన్నీ తప్పు దారి పట్టడం ఖాయం. స్వతంత్రత కోల్పోయి దుర్వినియోగం అయ్యే పరిస్థితి దాపురించింది. - పూడి శ్రీహరి అరెస్టు అప్రజాస్వామికం... ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైస్.జగన్ కార్యాలయంలో పార్టీ జనరల్ సెక్రటరీ (మీడియా విభాగం) గా ఉన్నపూడి శ్రీహరిని అరెస్టు చేశారు. అరెస్టులో మీరు అనుసరించిన విధానం చాలా దుర్మార్గం. కనీసం నోటీసు ఇవ్వలేదు. సాక్ష్యాధారాలు సేకరించకుండా.. పోలీసులు రెక్కీ నిర్వహించిన తీవ్రవాదులను వెంటాడినట్టు వేటాడి, భయబ్రాంతులకు గురిచేశారు. ఇళ్లలో కనీసం వారెంటు కూడా లేకుండానే తనిఖీలు చేపట్టారు. వారి వద్దనున్న సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లాక్కొని అందులో సమాచారం కోసం మీరు పడుతున్న తాపత్రయం అంతా మంచిదేనా? గత గ40 ఏళ్లలో చూస్తే... శ్రీకాకుళం ప్రాంతంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండేది. అప్పట్లో నేను ఒక్కడినే ఉంటే... 10 మంది హేమాహేమీలైన నేతలు అధికారంలో ఉండేవాళ్లు. నేను ఎప్పుడు విమర్శలు చేసినా... ఇప్పుడున్నంత ఘోరంగా వ్వవస్ధలను చేతిలో తీసుకుని రాజ్యాంగ విరుద్ధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసించడం చూడలేదు. చంద్రబాబు, ఆయన కుమారుడు వచ్చే తరానికి పాలన ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం సందేశం ఇస్తున్నారు? ఇదేనా పరిపాలన? దీనివలన మెజారిటీ ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉందా? ఇలాంటి పాలన చేసి ఎవరైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? రానున్న తరాలకి మీరు తప్పుడు సందేశం ఇస్తున్నారు. ప్రపంచంలో అన్ని రకాల ఘటనలను చూసిన మీరు ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన చేయాలి. అలాంటి ప్రభుత్వాలే మనగలుగుతాయి. అలా కాకుండా మీలా అధికార దుర్వినియోగం చేసిన వాళ్లు ప్రజల మన్ననలు మళ్లీ పొందుతారని నేను భావించడం లేదు. సీఎం చంద్రబాబు తన కుమారుడుకు చెప్పలేక ఆయన చేసిన పనులన్నింటికీ జెండా ఊపుతున్నారో, లేక ఆయన కూడా చివర దశలో ఇలాంటివి చేయడం ద్వారా అధికారం నిలబడుతుందన్న తప్పుడు ఆలోచన లు చేస్తున్నారా అర్ధం కావడం లేదు. - న్యాయవ్యవస్థ ఆదేశాలను బేఖాతరు చేస్తూ... ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన జనరల్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్టును పోలీసులు బలవంతంగా తీసుకెళితే ఈ దేశంలో న్యాయవ్యవస్థ లేదనుకుంటున్నారా? న్యాయవ్యవస్థ ఉంది. ఆ చట్టాలకు అనుగుణంగా తీర్పులు వస్తాయి. మీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖకు కోర్టు ఏం హెచ్చరించిందో మీరు చూశారు. పరిపాలన అనుభవం ప్రజలకు మరిన్న హక్కులు కల్పించడంతో పాటు స్వేచ్ఛనివ్వాలి. అంతే తప్ప కుటుంబపరిపాలన మాదరిగా ద్వేషించి, హింసించి పాలన అంటే ఒకటి రెండు కుటుంబాలకు సంబంధించిన అంశంగా దిగజార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరిధిలో శిక్షించండి. దానికి కొన్ని విధానాలుంటాయి. దాన్ని అనుసరించాలి. న్యాయవ్యవస్థలను గౌరవించాలి. అలా కాకుండా చట్టాన్ని అధిగమించి చేస్తే ఏదో ఒక రోజు ఆ దుర్మార్గాలకు పాల్పడ్డవారు దానికి బలవ్వక తప్పదు. మిగిలిన రాష్ట్రాలలో జరుగుతున్న పాలనను గమనించి నేర్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. - ప్రజా క్షేత్రంలో పరాభవం తప్పదు... ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే ప్రధాన కేంద్రమని, దానిని అణిచివేయాలని చూడటం పాలకుల అవివేకమని ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. కేవలం రెండేళ్ల కాలంలోనే ప్రభుత్వం ఇంత వేగంగా ప్రజాదరణ కోల్పోవడానికి రెడ్ బుక్ పేరుతో సాగిస్తున్న దమనకాండ మరియు అక్రమ మైనింగ్ మాఫియాలే కారణమని విమర్శించారు. నేడు పోలీసులను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలు వ్యవస్థలను శాశ్వతంగా దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను వీడి, న్యాయవ్యవస్థను గౌరవిస్తూ పాలన సాగించాలని.. లేనిపక్షంలో అణిచివేతను ఎదురించి ఉప్పెనలా రాబోయే ప్రజాక్షేత్రంలో పాలకులకు పరాభవం తప్పదని ధర్మాన గట్టిగా హెచ్చరించారు." - అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ... నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఉండి ఇరవై ఏళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఈ విధంగా ప్రభుత్వాన్ని నడపడం సరికాదు. ఇవాళ నీ అవసరాల కోసం వ్యవస్ధలో ఉన్న అధికారులు ఇవాళ నీకు అనుకూలంగా పనిచేస్తే... అది నీ ఒక్కడితో ఆగిపోదు. నీకు అవసరం లేకపోయినా వాళ్లు ప్రజల విషయంలో ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. నీ అవసరం కోసం ఒక సందర్భంలో చట్టానికి వ్యతిరేకంగా ఒక అధికారికి పనిచేయడానికి అవకాశం ఇస్తే... అదే వ్యవస్థతో అలాంటివి వేలాది ఘటనలు చేసే ప్రమాదం ఉంది. ప్రతిపక్షం ఉండకూడదని భావిస్తున్నారా? అలాంటి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందా? ఇలాంటి అరెస్టుల ద్వారా ప్రతిపక్షం లేకుండా పోతుందని భావిస్తే అది ఒట్టి భ్రమ మాత్రమే. ప్రతిపక్షమే ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ప్రధాన కేంద్రం. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించారు కాబట్టే ఇవాళ రెండేళ్లలోనే ప్రజలు 50 శాతానికి పైగా వైయస్.జగన్ ని సమర్థిస్తున్న పరిస్థితి. కేవలం రెండేళ్లలోనే ఇంత వేగంగా ప్రజాదరణ కోల్పోయిన ప్రభుత్వం గతంలో లేదు. కారణం రెడ్ బుక్ పేరుతో వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేయడం, అక్రమ మైనింగ్, ఇసుక, మట్టి మాఫియా ఇవన్నీ ఒక ఉదాహరణ మాత్రమే. వీటి ద్వారా ప్రజలకు ఊహించని నష్టం జరుగుతుందని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు.