తాడేపల్లి: ఏపీ టూరిజంలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఆంధ్రప్రదేశ్-ఏఐటీయూసీ) ప్రతినిధుల బృందం వైయస్ జగన్‌ను కలిసింది. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ ముఖ్యమంత్రి దృష్టికి ప్రతినిధుల బృందం సభ్యులు తీసుకెళ్లారు. జీవో నంబర్ 23ను అడ్డుకోండి సర్ ఏపీ పర్యాటక అభివృద్ది సంస్ధలోని 22 హోటల్స్, రిసార్ట్స్‌లను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు వీలుగా ఇచ్చిన జీవో నెంబర్ 23ను అడ్డుకోవాలని వైయస్ జగన్‌ను టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఆంధ్రప్రదేశ్-ఏఐటీయూసీ) ప్రతినిధుల బృందం విజ్ఞప్తి చేసింది. గడిచిన పాతికేళ్ళుగా టూరిజం సంస్ధలో కాంట్రాక్ట్ పద్దతిలో 504 మంది, ఔట్‌సోర్సింగ్‌లో 488 మంది ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేశారని, టూరిజం ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. టూరిజం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, తన దృష్టికి తీసుకొచ్చిన విషయాలను పరిశీలించి ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషిచేస్తానని వైయస్ జగన్ భరోసా కల్పించారు.