సోము వీర్రాజు వెంటనే క్షమాపణ చెప్పాలి

కడుపు మాడ్చుకొని మరొకరికి అన్నం పట్టే సంస్కృతి రాయలసీమది

రాయలసీమ సంస్కృతి గురించి తెలియకపోతే చరిత్ర చదవండి

బ్రిటీష్‌ కాలంలోనే కడపలో ఎయిర్‌పోర్టు ఉంది

సినిమాల్లో లాభాలు, ఇమేజ్‌ పెంచుకోవడం కోసం రాయలసీమపై దుష్ప్రచారం

పద్ధతి మార్చుకోకపోతే మా ప్రాంతానికి వచ్చే హక్కును కోల్పోతారు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరిక

సచివాలయం: మా ప్రాంత ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెంటనే కడప వాసులకు క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఒక మనిషి ఆకలితో ఉంటే భరించలేని సంప్రదాయం, తన కడుపు మాడ్చుకొని మరొకరికి అన్నం పట్టే సంస్కృతి, పేదరికంలో నలుగుతూ ఇతర ప్రాంతాలు బాగుండాలని కోరుకునే ప్రాంతంపై ఇంత నీజంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బ్రిటీష్‌ కాలంలోనే కడపలో ఎయిర్‌పోర్టు ఉందని గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఇంకోసారి రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించొద్దని, పద్ధతి మార్చుకోకపోతే మా ప్రాంతానికి వచ్చే హక్కును కూడా కోల్పోతారని సినిమా వాళ్లు, రాజకీయ నాయకులను గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. 

సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోము వీర్రాజు రీతిలోనే ఇంతకుముందు చంద్రబాబు కడప గూండాలు, కడప రౌడీలు, పులివెందుల పంచాయితీ అని మాట్లాడేవాడని, సీమ ప్రాంతంలో వారి పార్టీ జెండా పట్టుకొని తిరిగే మనుషులు కూడా ఉన్నారని, ఆ జెండాలు పట్టుకొని తిరిగే వారికైనా సిగ్గుండాలి.. మాట్లాడుతున్నందుకు వీర్రాజు, చంద్రబాబులకైనా సిగ్గుండాలని చురకంటించారు. ఒక ప్రాంత మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే సహించబోమన్నారు. 

రాయలసీమ సంస్కృతి గురించి తెలియకపోతే చరిత్ర చదవండి అని సూచించారు. సినిమాల్లో లాభాల కోసం, ఇమేజ్‌ పెంచుకోవడం కోసం రాయలసీమ పేరు, కులమతాల మధ్య చిచ్చుపెట్టడం, కొన్ని పేర్లు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని చీఫ్‌ విప్‌ గడికోట ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో చిత్తూరులో పట్టపగలు ఒక మేయర్‌ చంపేసిన విధానం, ఏలూరులో జరిగిన హత్యలు ప్రజలందరికీ గుర్తున్నాయన్నారు. రాయలసీమలో మనుషులను చంపుకునే సంస్కృతి లేదని,  ఉన్నది ఉన్నట్టు మాట్లాడే సంస్కృతి, అందరినీ గౌరవించే పద్ధతి అక్కడి మనుషుల సొంతమన్నారు. 

సోము వీర్రాజు మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ కోరితే విజ్ఞులు అవుతారని, లేదంటే అసభ్యంగా మాట్లాడేవారి లిస్ట్‌లో సోము వీర్రాజు పేరు చిరస్థాయిగా మిగిలిపోతుందన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తరువాత వారి పబ్బం కోసం ఫ్యాక్షన్‌ లేపారని, మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఫ్యాక్షన్‌ వద్దు.. ఫ్యాషన్‌ ముద్దు నినాదాన్ని తీసుకొచ్చారన్నారు. పరిటాల రవి చనిపోయిన వెంటనే ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పుల్‌స్టాప్‌ పడాలని ఫ్యాక్షనిస్టు ఫ్యామిలీలకు టికెట్‌ ఇవ్వం.. మీరూ ముందుకురండి అని ఆరోజునే వైయస్‌ఆర్‌ పిలుపునిచ్చాడని గుర్తుచేశారు. ఆ విధంగానే మద్దెలచెరువు సూరికి టికెట్‌ నిరాకరించారని చెప్పారు. సీమ ప్రజల వ్యక్తిత్వం సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుందని, స్వార్థం, పబ్బం కోసం ఏదైనా చేసే సంస్కృతి మీదని సోము వీర్రాజు, చంద్రబాబులపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు.  
 

తాజా ఫోటోలు

Back to Top