మీ ముగ్గురిలో సీఎం అభ్యర్థి ఎవరో తేల్చుకొని రండి

మీరంతా కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధమే

పవన్‌ కల్యాణ్‌ రిమోట్‌ చంద్రబాబు చేతిలో ఉంది..

బాబు కుట్రలో భాగంగానే నాపై పవన్‌ కల్యాణ్‌ విషప్రచారం

సబ్‌ప్లాన్‌ దుర్వినియోగం ఆరోపణలపై పవన్‌ వద్ద ఆధారాలున్నాయా..?

జనం అంటే చంద్రబాబుకు చులకన.. అబద్ధాలతో ప్రజలను మోసగించాలని కుట్ర

సీఎం వైయస్‌ జగన్‌ పాలన పట్ల ప్రజల్లోని విశ్వాసం రెట్టింపయ్యింది

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: ‘వచ్చే ఎన్నికల్లో మీ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేషా, చంద్రబాబు నాయుడా..? పవన్‌ కల్యాణా..? ముందు ఆ అంశాన్ని తేల్చుకోండి. సీఎం అభ్యర్థి ఎవరనేది ముందు క్లారిటీకి రండి.. విడివిడిగా వచ్చినా, అంతా కలిసి పొత్తుపెట్టుకొని మాపై పోటీకి వచ్చినా వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధమే’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ గురించి పవన్‌ కల్యాణ్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నాడో, ఏ మేరకు సమాచారం ఉందో అర్థం కావడం లేదన్నారు. కుట్రలో భాగంగానే తనపై విషప్రచారం చేస్తున్నారన్నారు. పవన్‌ కల్యాణ్‌ రోల్‌ ఏంటో అందరికీ తెలుసని, చంద్రబాబు రిమోట్‌ నొక్కితే పవన్‌ కల్యాణ్‌ ఏపీకి వచ్చి మాట్లాడుతాడన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..

సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఎక్కువ శాతం ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారే ఉన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 33 వేల కోట్లు మాత్రమే ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ మూడున్నరేళ్ల పాలనలో 48 వేల కోట్ల ఖర్చు చేశారు. అంతేకాకుండా డీబీటీ ద్వారానే 30 వేల కోట్లు ఎస్సీలకు అందించారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఖర్చు చేసింది 33 వేల కోట్ల రూపాయలు మాత్రమే. చంద్రబాబు అన్న క్యాంటీన్లు, చంద్రన్న కానుకలు వంటి కార్యక్రమాలకు సైతం ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులనే మళ్లించారు.

అట్టడుగున ఉన్న వర్గాలను పైకి తీసుకురావాలని సీఎం వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారు. అయినా ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఒక అజెండా ఫిక్స్‌ చేసి చంద్రబాబుకు ఇస్తున్నారు. దాన్ని చంద్రబాబు, లోకేష్‌ ఆ తరువాత గెస్ట్‌ ఆర్టిస్టులా పవన్‌ అందుకొని మాట్లాడుతున్నారు. ఆ తరువాత సీపీఐ రామకృష్ణ లాంటి వారు కూడా వచ్చి చంద్రబాబు రాగమే అందుకుంటారు.

చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఏం చేశాడో వాస్తవాలు చెప్పారు. తన పాలన కంటే తగ్గిందా..? వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కంటే మెరుగ్గా చేశావని వాస్తవ లెక్కలతో చంద్రబాబు జనం ముందుకు వస్తే బాగుంటుంది. ఉద్యోగాల్లో, రాజకీయ పదవులు, క్యాబినెట్‌లో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైయస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 87 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సెలక్ట్‌ అయ్యారు. రిజర్వేషన్‌ పరిధిని కూడా దాటేశాం. 1.30 లక్షల ఉద్యోగాల్లో ఎస్సీలు మాత్రమే 47–50 వేల మంది సెలక్ట్‌ అయ్యారు. ఇది వాస్తవం. దీన్ని వక్రీకరిస్తూ విషప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి.. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పచ్చ పత్రికలు, గెస్ట్‌ ఆర్టిస్టు పనిచేస్తున్నాడు.

చంద్రబాబు విష ప్రచారంలో భాగంగానే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 2104–19 మధ్య ఎంత అరాచకం జరిగిందో.. చీకటి పాలనలో రాష్ట్రం ఎలా నడిచిందో ప్రజలందరికీ తెలుసు. ప్రజలు పూర్తిగా టీడీపీని రిజక్ట్‌ చేశారు. 2019లో వైయస్‌ జగన్‌ మీద నమ్మకంతో ప్రజలు 151 సీట్లను అందించారు. అందుకు తగ్గట్టుగానే సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన సాగిస్తున్నారు. పరిపాలనతో ప్రజలకు తనపై ఉన్న నమ్మకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ రెట్టింపు చేసుకున్నారు.

పాతాళంలో ఉన్న నేనే గొప్ప వాడిని అని చంద్రబాబు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ, 2014 ఎన్నికల్లో చెప్పినదాని ప్రకారం రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేశానని చెప్పి, జనంతో చప్పట్లు కొట్టించుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా..? చంద్రబాబు హయాంలో ఫలానా మంచి చేశామని చెప్పుకోవడానికి ఒక్క పథకం అయినా ఉందా..?

2017లో జరిగిన ప్లీనరీ సమావేశంలో అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు పెంచుతామని వైయస్‌ జగన్‌ ప్రకటించారు. కనీసం అప్పుడైనా చంద్రబాబు అలర్ట్‌ అయ్యాడా..? 2019 ఎన్నికల సంవత్సరంలో జనవరిలో పెంచి ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు పెంచిన పెన్షన్‌ ఇచ్చాడు. ఆఖరిలో పసుపు కుంకుమను ఓట్లు కొనుగోలు చేసేందుకు తెచ్చాడు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేయలేకపోయాడు.

సీఎం వైయస్‌ జగన్‌ చేయూత, ఆసరా పథకాలను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.13 వేల కోట్లు వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 26 వేల కోట్ల అప్పుగా పెరిగాయి. వాటిని కూడా సీఎం వైయస్‌ జగన్‌ చెల్లిస్తున్నారు. ప్రతీది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్నారు. ఫలితాలు చూపిస్తున్నారు.

జనం అంటే చంద్రబాబుకు చులకన. ఎన్నికల సమయానికి భ్రమలో పెట్టి.. ఎన్నికలు అయిపోయిన తరువాత చాపచుట్టేయొచ్చు అనే ధోరణిలోనే చంద్రబాబు ఉన్నాడు. ప్రజలను తన మాయమాటలతో నమ్మించగలను అనే భ్రమలోనే చంద్రబాబు ఉన్నాడు. ప్రజలు చాలా చైతన్యవంతులు, ఎవరు ఎంటో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు చెబితే ప్రజలు నమ్మడం లేదని కొత్తగా పవన్‌ కల్యాణ్‌ను పిలుచుకుంటున్నాడు.

అధికారంలోకి రావడానికి నేను ఇన్ని సీట్లలో పోటీచేస్తానని పవన్‌ ఎందుకు చెప్పడం లేదు. పొత్తుల గురించి మూడు ఆప్షన్లు చెప్పాడు.1. బీజేపీతో, 2. అందరినీ కలుపుకొనిపోవడం, 3. ఒంటరిగా పోటీ చేయడం.. మరి నాలుగో ఆప్షన్‌ మరిచిపోయాడా..? 2014 మాదిరిగా చంద్రబాబుకు సపోర్టు చేస్తామని ఎందుకు చెప్పలేకపోయాడు. పవన్‌ కల్యాణ్‌ సేట్‌మెంట్లు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. పవన్‌ రిమోట్‌ చంద్రబాబు దగ్గర ఉంది. ఆయన ఆడించినట్టుగా పవన్‌ ఆడుతున్నాడు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడమే పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌.

సీఎం వైయస్‌ జగన్‌ పాలన పట్ల ప్రజల్లో పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అనేక మంది ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి సంక్షేమ పథకాలను చూసి ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన సాగిస్తున్నారు.

2017లో వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలుపెట్టే రెండ్రోజుల ముందు వరకు పర్మిషన్‌ ఇవ్వలేదు. ఆరోజూ కండీషన్స్‌ ఉన్నాయి. నిబంధనలకు లోబడే వైయస్‌ జగన్‌ పాదయాత్ర పూర్తిచేశారు. చంద్రబాబు సభలో కందుకూరు, గుంటూరులో జరిగిన దుర్ఘటనల తరువాత రోడ్ల మీద సభలు పెట్టకూడదని ప్రభుత్వం తీసుకొచ్చి నిబంధన తప్ప.. మిగిలిన నిబంధనలన్నీ ఎప్పుడూ ఉండేవే.

కందుకూరు ఘటన ఎలా జరిగిందో అందరికీ తెలుసు.. వారం రోజులు కూడా కాకముందే ప్రభుత్వం చేసిన హత్యలేనని బరితెగించి అబద్ధం చెప్పగలిగాడు. గుంటూరులో చీరలు విసిరేసి అమాయకులను పెట్టుకున్న ఘటనను ప్రజలంతా చూసిన తరువాత కూడా తమ తప్పులేదని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. ఇంతకంటే వితండవాదం, బరితెగింపు ఉండదు.

ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేషా, చంద్రబాబు నాయుడా.. పవన్‌ కల్యాణా ముందు ఆ అంశాన్ని తేల్చుకోండి. వీరిలో ఎవ్వరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు. క్లారిటీతో రావాలని మేము కోరుకుంటున్నాం. పవన్‌ కల్యాణ్‌ 175 స్థానాల్లో పోటీ చేయమనండి మాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు 175 సీట్లలో పోటీ చేయమనండి మాకు అభ్యంతరం లేదు. రాజకీయాల నుంచి రిటైర్డ్‌ అవుతున్నాను.. నా కొడుకును తీసుకొస్తున్నాను అని చంద్రబాబును చెప్పమనండి ఎవరు వద్దన్నారు.

ప్రజాదరణ కలిగిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ను ఓడించండి అని ఆ ప్రజలకే చెబితే వీరిని చీదరించుకుంటారు. లోకేష్‌ మా నాన్నను ముఖ్యమంత్రి చేయండి అని తిరుగుతున్నాడా..? చంద్రబాబు సీఎం అయితే లోకేష్‌ తెరవెనుక కూర్చొని నడుపుతాడా..? లేదా రెండున్నరేళ్లు పవన్‌ సీఎంగా ఉంటారా..? చంద్రబాబు సపోర్టుతో పవన్‌ సీఎం అవుతారా..? ముందు స్పష్టత ఇవ్వండి. మీరు విడివిడిగా వచ్చినా సమ్మతమే, కలిసి వచ్చినా ఓకే.. అభ్యర్థి ఎవరో మీరు నిర్ణయించుకోండి.

పాదయాత్ర నిబంధనలకు లోబడే పూర్తిచేశాం. ఎన్ని ఆకాంక్షలు పెట్టినా వైయస్‌ జగన్‌ ప్రజల కోసం నడిచారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. ఓ ప్రాంతంలో టీడీపీ మంత్రులు కాన్వాయ్‌ వస్తుంది ఆగమని పోలీసులు విజ్ఞప్తి చేస్తే వైయస్‌ జగన్‌ మంత్రులు వెళ్లిన తరువాత బయల్దేరారు. అప్పుడు కావాలనుకుంటే మేమూ రాద్ధాంతం చేయొచ్చు. కానీ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, వారికి భరోసా ఇవ్వడానికి పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి అన్నీ భరించాం.

2014–19 మధ్య ప్రజలు ఇచ్చిన లాస్ట్‌ చాన్స్‌లో చంద్రబాబుకు ఏం చేశాడు. రుణమాఫీ, రాష్ట్ర అభివృద్ధి, సంస్కరణలు, పథకాలు, ఉద్యోగాలు ఇచ్చామని వాస్తవ లెక్కలు చెప్పగలడా..? ఐదేళ్లలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత..? వైయస్‌ జగన్‌ మూడున్నరేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలెంత అనేది ప్రజలకు తెలుసు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు అధికారంలో లేడు కాబట్టే ఆ పత్రికలకు, గెస్ట్‌ ఆర్టిస్టు రాక్షసపాలన అంటున్నారు.

Back to Top